10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మనూ భాకర్–సరబ్‌జోత్ జోడీ ముందంజ
నేడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కాంస్య పతక పోరు
నాలుగో స్థానంతో ముగించిన అర్జున్ బబూతా
షూటింగ్ యువ తార మనూ భాకర్ రెండు రోజుల వ్యవధిలో తన రెండో ఒలింపిక్ పతకంపై గురి పెట్టింది. ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం నెగ్గిన మనూ భాకర్‌కు ఈసారి సరబ్‌జోత్ సింగ్ జత కలిశాడు. ఈ జోడీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది.
జిన్ ఓయె–లీ వన్‌హో (దక్షిణ కొరియా) జంటతో నేడు జరిగే ఈ పోరులో గెలిస్తే ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా మను చరిత్ర సృష్టిస్తుంది. వ్యక్తిగత విభాగంలో త్రుటిలో ఫైనల్ అవకాశాలు చేజార్చుకున్న సరబ్‌జోత్‌కు కూడా తొలి పతకం గెలుచుకునేందుకు ఇది మంచి అవకాశం. మరోవైపు సోమవారం పతకం కోసం బరిలోకి దిగిన షూటర్లలో అర్జున్ బబూతా నాలుగో స్థానంలో నిలిచి దురదృష్టవశాత్తూ కాంస్యం చేజార్చుకోగా, రమిత ఏడో స్థానంతో నిరాశగా ని్రష్కమించింది.
పారిస్: ఒలింపిక్స్ షూటింగ్ సమరాల్లో భారత్‌కు సోమవారం మిశ్రమ ఫలితాలు లభించాయి. మనూ భాకర్–సరబ్‌జోత్ జోడీ కాంస్య పతకం గెలుచుకునే అవకాశాలు సృష్టించుకోగా... ఇతర షూటర్లు విఫలమయ్యారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మనూ–సరబ్ జోడీ క్వాలిఫయింగ్‌లో మెరుగైన చక్కటి ప్రదర్శన కనబర్చింది. నేడు జరిగే కాంస్య పతక పోరులో మనూ–సరబ్ ద్వయం గెలిస్తే భారత్ ఖాతాలో షూటింగ్ నుంచి మరో పతకం చేరుతుంది. ఈ మ్యాచ్‌లో కొరియాకు చెందిన జిన్ ఓయె–లీ వన్‌హో జంటతో భారత జోడీ తలపడుతుంది.
సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో 580 స్కోరు సాధించిన భారత షూటింగ్ జంట పతకం కోసం ముందంజ వేసింది. మూడు సిరీస్‌లలో ఇద్దరు భారత షూటర్లు కలిసి వరుసగా 193, 195, 192 స్కోర్లు సాధించారు. తొలి రెండు సిరీస్‌లలో 98, 98 పాయింట్లు సాధించిన మనూ చివరి సిరీస్‌లో 95కే పరిమితం కావడం తుది ఫలితంపై ప్రభావం చూపించింది. సరబ్‌జోత్ 95, 97, 97 స్కోర్లు నమోదు చేశాడు.
నేటి భారత్ ప్రత్యర్థి కొరియా 579 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో తొలి రెండు స్థానాలు సాధించిన టర్కీ (582), సెర్బియా (581) నేడు జరిగే ఫైనల్లో స్వర్ణ–రజత పతకం కోసం పోటీ పడతాయి. ఇదే ఈవెంట్‌లో బరిలోకి దిగిన మరో భారత జోడీ రిథమ్ సాంగ్వాన్–అర్జున్ సింగ్ చీమా ఓవరాల్‌గా 576 పాయింట్లు స్కోరు చేసి 10వ స్థానంతో ముగించింది.
బబూతా పోరాడినా...
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో పతక ఆశలతో బరిలోకి దిగిన అర్జున్ బబూతాను చివరకు దురదృష్టం పలకరించింది. స్టేజ్–1లో పది షాట్‌ల తర్వాత 105 పాయింట్లతో అతను మూడో స్థానంతో మెరుగైన స్థితిలో నిలిచాడు. స్టేజ్–2 ఎలిమినేషన్ రౌండ్ తొలి సిరీస్‌లో కూడా 10.6, 10.6 స్కోర్లతో పతకావకాశాలు మెరుగుపర్చుకున్నాడు. అయితే ఇదే జోరును బబూతా కొనసాగించలేకపోయాడు. రెండో సిరీస్ తొలి షాట్‌లో పేలవంగా 9.9 స్కోరు చేయడం అతడిని బాగా దెబ్బ తీసింది.
అయినా సరే... మూడు సిరీస్‌లు ముగిసిన తర్వాత 167.8 స్కోరుతో క్రొయేíÙయా షూటర్ మరిసిచ్‌తో సమంగా నిలి చాడు. కానీ నాలుగో సిరీస్ రెండో షాట్‌లో 10.1 మాత్రమే సాధించి వెనకబడిపోయాడు. ఓవరాల్‌గా 208.4 పాయింట్లతో నాలుగో స్థానమే దక్కింది. ఈ ఈవెంట్‌లో షెంగ్ లిహావో (చైనా–252.2), విక్టర్ లింగ్రెన్ (స్వీడన్–251.4), మిరాన్ మరిసిచ్ (క్రొయేíÙయా–230) స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగం ఫైనల్లో భారత షూటర్ రమిత జిందాల్ నిరాశపర్చింది.
మొత్తం 145.3 పాయింట్లతో ఆమె ఏడో స్థానంతో ముగించింది. పురుషుల ట్రాప్ ఈవెంట్ క్వాలిఫయింగ్‌లో తొలి రోజు భారత షూటర్ పృథ్వీరాజ్ తొండైమన్ పేలవ ప్రదర్శనను కనబర్చాడు. 75 పాయింట్ల మూడు రౌండ్ల తర్వాత పృథ్వీరాజ్ 68 పాయింట్లు సాధించి ప్రస్తుతం 30వ (చివరి) స్థానంలో కొనసాగుతున్నాడు. అతను వరుసగా 22, 25, 21 పాయింట్లు స్కోరు చేశాడు. మంగళవారం మరో 25 పాయింట్లు చొప్పున రెండు రౌండ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత ఓవరాల్ పాయింట్లను బట్టి టాప్–6లో నిలిచినవారు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment