న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం గెలిచిన మనూ భాకర్ పాత ట్వీట్ ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. 2018 అక్టోబర్‌లో యూత్ ఒలింపిక్స్‌లో మనూభాకర్ గోల్డ్‌మెడల్ గెలిచిన తర్వాత అప్పటి హర్యానా మంత్రి అనిల్ విజ్ ఆమెకు రూ.2 కోట్ల రివార్డు ప్రకటించారు.
అయితే ఈ నగదు అందకపోవడంతో రివార్డు ప్రకటించిన మూడు నెలల తర్వాత మనూ భాకర్ ఒక ట్వీట్ చేశారు. అనిల్‌విజ్ రివార్డు ప్రకటించిన ట్వీట్ స్క్రీన్‌షాట్స్ పోస్ట్ చేస్తూ ‘సర్ ప్లీజ్ కన్ఫామ్ చేయండి. ఈ రివార్డు నిజమేనా లేక ఉత్త జుమ్లానా’అని ప్రశ్నించారు. తమకు రివార్డుగా ప్రకటించిన సొమ్ముతో హర్యానా ప్రభుత్వంలో కొందరు ఆటలాడుతున్నారని భాకర్ విమర్శించారు.
దీనికి స్పందించిన అనిల్‌విజ్ రివార్డు గురించి భాకర్ తొలుత క్రీడాశాఖలో తెలుసుకుని తర్వాత ఓపెన్‌గా మాట్లాడాలని సూచించారు. భాకర్‌కు రూ.2కోట్ల రూపాయలు కచ్చితంగా వస్తాయని స్పష్టం చేశారు. క్రీడాకారులకు క్రమశిక్షణ అవసరం అన్నారు.
తాజాగా ఈ ట్వీట్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి. శివసేన(ఉద్ధవ్) వర్గానికి చెందిన ఎంపీ ప్రియాంక చతుర్వేది తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు. భాకర్‌కు రివార్డు నగదు ఎగ్గొట్టి ఇప్పుడు ఒలింపిక్స్‌లో ఆమెకు పతకం రాగానే క్రెడిట్ కోసం బీజేపీ నాయకులు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాగా, మనుభాకర్ షూటింగ్‌లో కాంస్య పతకం గెలుచుకుని ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతా తెరిచారు.
Comments
Please login to add a commentAdd a comment