మీరు అంతర్జాతీయ పౌరుడు!!
సాధారణంగా ఎప్పుడూ బెత్తం పట్టుకుని అదిలించే హెడ్మాస్టారిలా వ్యవహరించే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ శుక్రవారం మాత్రం కాస్తంత సరదాగా కనిపించారు. సభ్యులను కాస్త అదిలిస్తూనే... సీనియర్లతో మాత్రం జోకులు వేశారు. అరుణ్ జైట్లీ చర్చకు సమాధానం ఇస్తుండగా మధ్యలో అడ్డుకుని మాట్లాడుతున్న సుజనా చౌదరిని మందలిస్తూ.. ఒక మంత్రి మాట్లాడుతుంటే మరో మంత్రి అడ్డుకోవడం ఏంటని చిన్నగా మొట్టికాయలు వేశారు.
ఇక సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడినప్పుడు.. తాను మద్రాసులో పుట్టానని, ఆంధ్రాలో పెరిగానని, తెలంగాణతోనూ అనుబంధం ఉందని, అందువల్ల తెలుగు రాష్ట్రాల విషయంలో తన సూచనలను పట్టించుకోవాలని అన్నారు. దాంతో స్పందించిన కురియన్.. ఏచూరిని ప్రత్యేకంగా సంబోధిస్తూ, ‘‘మీరు జాతీయ, ఇంకా మాట్లాడితే అంతర్జాతీయ పౌరులు. మీరు ఏ విషయం గురించైనా మాట్లాడొచ్చు. మీకు రాష్ట్రాల పరిమితులు లేవు. ఏ రాష్ట్రం, ఏ అంశంపై అయినా మాట్లాడొచ్చు’’ అని నవ్వుతూ చెప్పారు. దీంతో సీతారాం ఏచూరితో పాటు సభ మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది.