వరుసగా మూడో ఏడాది...
దుబాయ్: విరాట్ కోహ్లి నాయకత్వంలో గత ఏడాది టెస్టు క్రికెట్లో పలు చిరస్మరణీయ విజయాలు సాధించిన భారత జట్టు మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నంబర్‌వన్ టీమ్‌గా నిలిచింది. భారత్ వరుసగా మూడో సంవత్సరం ఈ ఘనత సాధించడం విశేషం. ఐసీసీ కటాఫ్ తేదీ ఏప్రిల్ 1 వరకు 116 పాయింట్లతో ఉన్న టీమిండియా ర్యాంకుల్లో అగ్రస్థానంతో ఏడాదిని ముగించింది. నంబర్‌వన్‌గా నిలిచిన భారత జట్టుకు 10 లక్షల డాలర్ల బహుమతితో పాటు ప్రత్యేక గదను అందజేస్తారు. ర్యాంకింగ్ కోసం పరిగణలోకి తీసుకున్న సమయంలో టీమిండియా... సొంతగడ్డపై అప్ఘనిస్తాన్‌ను ఏకైక టెస్టులో ఓడించింది. ఆ తర్వాత స్వదేశంలోనే వెస్టిండీస్‌ను 2–0తో చిత్తు చేసింది. అనంతరం ఇంగ్లండ్‌లో 1–4తో సిరీస్‌ను కోల్పోయినా... తమ టెస్టు చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ (2–1తో) గెలుచుకొని సంచలనం సృష్టించింది. భారత్ తర్వాత ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఏడాదిలో ఎక్కువ భాగం రెండో స్థానంలో కొనసాగిన దక్షిణాఫ్రికా...స్వదేశంలో శ్రీలంక చేతిలో 0–2తో సిరీస్ కోల్పోవడంతో వెనకబడిపోయి మూడో స్థానానికే పరిమితమైంది.
‘ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ గదను మరోసారి నిలబెట్టుకోవడం పట్ల మేమంతా చాలా గర్వపడుతున్నాం. మా జట్టు అన్ని ఫార్మాట్లలో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నా, టెస్టుల్లో అగ్రస్థానంలో నిలవడం మాకు మరింత ఆనందాన్ని కలిగించింది. టెస్టు క్రికెట్ ప్రాధాన్యత ఏమిటో, అత్యుత్తమ ఆటగాళ్లే ఇక్కడ ఎలా నిలబడగలరో మనందరికీ తెలుసు. మా జట్టులో ఎంతో ప్రతిభ ఉంది. వచ్చే సంవత్సరం కూడా ఇదే జోరు కొనసాగిస్తాం. టెస్టు క్రికెట్లో మళ్లీ ఇలాంటి ఘనతనే సాధించాలని కోరుకుంటున్నాం’
–విరాట్ కోహ్లి, భారత కెప్టెన్