వచ్చే ఏడాది భారత్ వృద్ధి 6.5%
కొత్త పెట్టుబడుల జోరుతో సాకారం...
సుస్థిర మోడీ సర్కారు రాకతో ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసం: సిటీ గ్రూప్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరగనున్న బ్రెజిల్ రాజధాని రియోతో పాటు భారత్‌పైనే ఎక్కువగా గురిపెట్టారని అంతర్జాతీయ ఫైనాన్షియల్ దిగ్గజం సిటీగ్రూప్ అంటోంది. క్రమంగా భారత్‌లో పెట్టుబడులు పుంజుకోనున్నాయని.. దీంతో వృద్ధి కూడా జోరందుకుంటుందని రీసెర్చ్ నోట్లో పేర్కొంది. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండొచ్చని... వచ్చే ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఇది 6.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని సిటీ గ్రూప్ అంచనావేసింది. మోడీ నేతృత్వంలో సుస్థిర సర్కారు కొలువుదీరడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతోందని.. స్టాక్ మార్కెట్లు ఇప్పటికే ఆ జోష్‌ను అందిపుచ్చుకున్న విషయాన్ని సిటీ గ్రూప్ ప్రస్తావించింది.
మోడీ ర్యాలీ తో గత శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త ఇంట్రాడే, ముగింపు ఆల్‌టైమ్ గరిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. జూలైలో ప్రవేశపెట్టనున్న మోడీ ప్రభుత్వ తొలి బడ్జెట్... సర్కారు విధానపరంగా తీసుకోబోయే ప్రధాన చర్యలు, భవిష్యత్ నిర్ధేశాన్ని తెలియయనుందని రీసెర్చ్ నోట్ వెల్లడించింది. పెట్టుబడులను తిరిగి జోరందుకునేలా చేయడం, జీఎస్టీ/డీటీసీల అమలుకు సంబంధించి ప్రకటన, ఆర్థిక క్రమశిక్షణ ఇతరత్రా కీలక అంశాలకు బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందో తేటతెల్లమవుతుందని సీటీ గ్రూప్ పేర్కొంది.