ఇనుప ఖనిజం ధరలిక తగ్గవు..
‘సాక్షి’ ఇంటర్వ్యూ : ఎన్ఎండీసీ చైర్మన్ నరేంద్ర కొఠారీ
⇒ అంతర్జాతీయంగా డిమాండు తగ్గి సప్లయి పెరుగుతోంది
⇒ అందుకే గడిచిన ఏడాదిలో అంత దారుణంగా తగ్గింది
⇒ దేశీయంగా డిమాండు బావుంది కనక ఇక తగ్గుదల ఉండదు
⇒ మా ఇతర వ్యాపారాలన్నీ ట్రాక్మీదే ఉన్నాయి
⇒ కార్పొరేట్ ఆఫీసును హైదరాబాద్‌లోనే ఉంచుతాం
సాక్షి, బిజినెస్ బ్యూరో: చమురు, బొగ్గు, ఇనుము... ఒకటేమిటి! అంతర్జాతీయంగా పలు వస్తువుల ధరలు పతనమవుతూనే ఉన్నాయి. చమురు ధరల పతనం వల్ల ప్రభుత్వానికి సబ్సిడీ మిగిలి, పెంచిన పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతున్న మాట వాస్తవం. కానీ ప్రభుత్వ కంపెనీల ఆదాయాలు మాత్రం గణనీయంగా పడిపోతున్నాయి. ప్రభుత్వ రంగ లిస్టెడ్ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) కూడా ఈ రకమైన ఇబ్బందుల్లోనే ఉంది.
దేశీయంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ... విదేశాల్లోని గనుల్లో సైతం పెట్టుబడులు పెడుతున్న ఈ సంస్థ... గడిచిన ఏడాదిగా ముడి ఇనుము ధరలు పతనమౌతుండటంతో లాభాలపై ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రైవేటు పోటీని తట్టుకునేందుకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరసగా రెండు సార్లు ముడి ఇనుము ధరల్ని తగ్గించింది. మరి ముడి ఇనుము ధరలు ఇంకా పతనమవుతాయా? దానికనుగుణంగా ఎన్ఎండీసీ కూడా ధరలను సవరిస్తూ పోతుందా? ఈ పతనం ఎంతవరకూ కొనసాగే అవకాశముంది? ఇలాంటి సందేహాలన్నిటికీ ఎన్ఎండీసీ ఛైర్మన్ నరేంద్ర కొఠారీ సమాధానమిచ్చారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ధరల పతనం నుంచి ఎన్ఎండీసీ పెట్టుబడుల వరకూ వివిధ అంశాలను వెల్లడించారు. వివరాలివీ...
♦ అంతర్జాతీయంగా ముడి ఇనుము ధరలు గడిచిన ఏడాదిలో 46 శాతం పడిపోయాయి. టన్ను 122 డాలర్ల నుంచి 75 డాలర్లకు చేరింది. ఇంకా తగ్గుతుందా? లేక ఇక్కడితో ఆగుతుందనుకుంటున్నారా?
ధరలు పతనమవుతున్న మాట నిజమే. ఒక దశలో టన్ను 114 డాలర్ల నుంచి 60 డాలర్లకు కూడా చేరింది. నా ఉద్దేశం ప్రకారం ఇదే అట్టడుగు స్థాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ను మించిన సరఫరా ఉంది. బీహెచ్పీ వంటి దిగ్గజాలకు తోడు కొత్త మైనింగ్ కంపెనీలూ వస్తున్నాయి. సోవియట్ రిపబ్లిక్లలో సైతం ఉత్పత్తి పెరిగింది. మరోవంక చైనా వంటి దేశాల నుంచి డిమాండ్ తగ్గిపోయింది. అందుకని ధరల పతనం ఈ పరిణామాలన్నిటిపైనా ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పటికే బాగా పడిన దృష్ట్యా ఇంతకన్నా తగ్గవన్నదే నా ఉద్దేశం.
♦ రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా?
అలాంటిదేమీ లేదు. అంతర్జాతీయంగా పరిణామాలు బాగులేకున్నా దేశీయంగా ఆశావహ పరిస్థితులున్నాయి. బడ్జెట్లో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం ఇవ్వటం, స్వచ్ఛ భారత్... ఇవన్నీ దేశీయంగా డిమాండ్‌ను పెంచేవే. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం పెరుగుతోంది కాబట్టి వచ్చే రెండు మూడు నెలల్లో ధరల స్థిరీకరణ జరుగుతుందని నా నమ్మకం.
♦ గత రెండు నెలల్లో ఇప్పటికే ధరలు రెండుసార్లు తగ్గించారు. ఇంకా తగ్గిస్తారా?
ఒడిషాలోను, అంతర్జాతీయంగాను ధరలు తగ్గుతున్నాయి. కొన్ని ప్రయివేటు సంస్థలు ధరలు తగ్గించే ఆలోచన చేస్తుండ వచ్చు గానీ... మేమైతే ధరలను మరింత తగ్గించాలని అనుకోవటం లేదు. మా నుంచి ధరల తగ్గింపు ఉండదు.
♦ మీరు రెండుసార్లు తగ్గించినా... ప్రయివేటు ఆపరేటర్లతో పోలిస్తే మీ ధరలు ఎక్కువనే వాదనలున్నాయి. నిజమా?
అలాంటిదేమీ లేదు. అయినా ప్రయివేటు కంపెనీల కన్నా మేం ఎక్కువ ధర నిర్ణయిస్తే మా దగ్గర కొనేవారెవరైనా ఉంటారా? అయితే ముడి ఇనుము ధరలు ఖనిజం దొరికే స్థలం, దాని నాణ్యత, అక్కడున్న డిమాండు బట్టి ఉంటాయి. వినియోగదారుల్ని బట్టి కూడా ధరలు మారుతాయి. ఉదాహరణకు విశాఖపట్నం, ఒడిషా, కోల్‌కతా వంటి తూర్పు తీర ప్రాంతాలతో పోలిస్తే ముంబాయి, గుజరాత్ వంటి పశ్చిమ ప్రాంతాల్లో ధర ఎక్కువ. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో రవాణా ఛార్జీలు తక్కువ కనక. తూర్పు తీరంలోనే మా అమ్మకాలు ఎక్కువ. కర్ణాటకలో కూడా. మా ధరలైతే అంతర్జాతీయ దిగుమతి ధర కన్నా తక్కువేనని చెప్పగలను.
♦ మరి ఈ ధరల తగ్గింపు ప్రభావం మీ లాభాలపై ఉంటుందా?
ఉండదు. ఎందుకంటే మేం దీన్ని సర్దుబాటు చేయడానికి ఉత్పత్తిని పెంచుతున్నాం. విక్రయాలు పెంచుతున్నాం. టర్నోవరు పెంచటం ద్వారా ధరల కారణంగా వస్తున్న ఆదాయనష్టాన్ని భర్తీ చేసుకుంటాం.
♦ సరే! మీరు మైనింగ్ కాకుండా విద్యుత్, ఎరువులు, ఉక్కు తయారీ రంగాల్లోకి కూడా అడుగుపెడుతున్నట్లు గతంలో ప్రకటించారు. ఆ ప్రణాళికల ప్రస్తుత పరిస్థితి ఏంటి?
అన్నీ అనుకున్నట్లే జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తున్నాం. అది మరో రెండేళ్లలో పూర్తయి ఉత్పత్తి ప్రారంభిస్తుంది. బళ్లారిలో ఏర్పాటు చేస్తున్న పెల్లెట్ ప్లాంటు దాదాపు పూర్తయింది. అక్కడ మరో రెండు నెలల్లో ఉత్పత్తి మొదలవుతుంది. ఇక ఎరువుల విషయానికొస్తే పొటాష్ మైనింగ్‌లోకి ప్రవేశించాం. రష్యాలో పొటాష్ మైన్స్‌లో పెట్టుబడులు పెట్టాం. జార్ఖండ్, ఒడిషాల్లో గనులకు దగ్గరకగా కర్మాగారాల ఏర్పాటుకు ప్రత్యేక కంపెనీలు (ఎస్పీవీలు) ఏర్పాటు చేశాం. మాతో పాటు సెయిల్, ఆర్ఐఎన్ఎల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ వంటి భారతీయ దిగ్గజాలు ఏర్పాటు చేసుకున్న ఇంటర్నేషనల్ కోల్ వెంచర్స్ లిమిటెడ్ (ఐవీసీఎల్) మొజాంబిక్‌లో గనుల తవ్వకం చేపడుతోంది. దీని ద్వారా ఇతర ప్రాపర్టీలను కూడా చూస్తున్నాం.
♦ సరే! మీ కార్పొరేట్ ఆఫీసును హైదరాబాద్ నుంచి మీకు గనులు ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గఢ్ లేదా జార్ఖండ్‌కు మారుస్తారని వినవస్తోంది... నిజమా?
అలాంటిదేమీ లేదు. మా కార్పొరేట్ ఆఫీసు హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తాం.