హైదరాబాద్లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ
* 500 కోట్లతో గచ్చిబౌలి కేంద్ర విస్తరణ
* అదనంగా 8,000 సీట్ల సామర్థ్యం
* ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య 18,000
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్ కేంద్రాన్ని భారీగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ. 500 కోట్లు వ్యయం చేయనుంది. గచ్చిబౌలిలో ఉన్న 11 ఎకరాల క్యాంపస్లో ఈ విస్తరణ కార్యక్రమాన్ని చేపడుతోంది. 8,000 సీటింగ్ సామర్థ్యం గల 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం కాగ్నిజెంట్కి 2.25 లక్షల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని అందిపుచ్చుకునే విధంగా హైదరాబాద్ కేంద్ర విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు కాగ్నిజెంట్ వైస్ చైర్మన్ లక్ష్మి నారాయణన్ తెలిపారు.
మా వ్యాపార విజయంలో హైదరాబాద్ కేంద్రం అత్యంత కీలకమైనదన్నారు. ఈ సందర్భంగా వ్యాపార విస్తరణ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 2002లో 180 మందితో కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభించగా, ఇప్పుడు 18,000 మందికిపైగా పనిచేస్తున్నారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో ఉన్న 20 ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీలను సందర్శించి 8,000 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించింది.