25,500 స్థాయికి పుత్తడి తగ్గొచ్చు
ఇండియా రేటింగ్స్ అంచనా
- ఈ ఏడాది అంతర్జాతీయ ధరలకు
- సమానంగా దిగిరాకతప్పదని విశ్లేషణ
ముంబై: దేశీయంగా పసిడి ధర ఈ ఏడాది(2014-15)లో ఇప్పటి అంతర్జాతీయ ధరకు సమానంగా దిగివస్తుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ గురువారం అంచనావేసింది. ఈ ధర 10 గ్రాములకు రూ.25,500, రూ.27,500 స్థాయికి పడుతుందని పేర్కొంది.
ప్రస్తుత తీరు: అంతర్జాతీయ ధరతో పోల్చితే, దాదాపు రూ.2,500 నుంచి రూ.3,000 వరకూ అధిక ప్రీమియంతో ప్రస్తుతం దేశీయంగా బంగారం ధర ఉంది. స్పాట్ మార్కెట్లో పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర దాదాపు రూ.30,000 స్థాయిలో కదలాడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా పసిడి దిగుమతులపై కేంద్రం 10% కస్టమ్స్ సుంకాలను అమలుచేస్తోంది. ఆభరణాల దిగుమతులకు సంబంధించి ఈ రేటు 15%గా ఉంది. క్యాడ్ కట్టడి నేపథ్యంలో దేశీయంగా సుంకాలు తగ్గించేస్తే... ప్రీమియంలు పడిపోయి, పసిడి ధర అంతర్జాతీయ ధరకు సమాన స్థాయికి వచ్చే అవకాశం ఎలానూ ఉంది. ఆయా అంశాలను పక్కనబెడితే, కేవలం విధానపరమైన విశ్లేషణకు ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో ప్రాధాన్యత ఇచ్చింది. విశేషాలు ఇవీ...
* ప్రస్తుతం నెమైక్స్ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర ఔన్స్‌కు (31.1 గ్రాములు) 1,300 డాలర్లు పలుకుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ ధర 1,150-1,250 డాలర్లకు తగ్గవచ్చు.
* దీంతో బంగారం ధరకు ‘ప్రతికూల అవుట్‌లుక్’ను ఇస్తున్నాం.
* అమెరికా, యూరోజోన్ జీడీపీలు మరింత పటిష్టమయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే అమెరికా డాలర్ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. పసిడిలో పెట్టుబడులు క్యాపిటల్ మార్కెట్లకు తరలే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో పసిడి ధరలు మరింత పడిపోవచ్చు.
*అమెరికా ఆర్థికాభివృద్ధి, సహాయక చర్యల ఉపసంహరణ, వడ్డీరేట్ల పెంపు.. ఇవన్నీ బంగారంలో పెట్టుబడులను నిరుత్సాహపరిచేవే.
*ఈ ఏడాది బంగారం కొనుగోళ్లు సైతం తగ్గే అవకాశం ఉంది.
* అయితే అమెరికా, యూరోపియన్ యూనియన్‌లో జీడీపీ వృద్ధి రేట్లు అంచనాలకన్నా తగ్గినా, కొన్ని దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగినా, చైనా ఫైనాన్షియల్ మార్కెట్లో అనిశ్చితులు ఏర్పడినా... బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌కు 1,300 డాలర్లను దాటే అవకాశం ఉంది.