International Table Tennis Federation
-
శరత్ కమల్‌కు అరుదైన గౌరవం.. భారత్ తరఫున తొలి ఆటగాడిగా..!
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆటగాడు, ఖేల్‌రత్న అవార్డీ ఆచంట శరత్ కమల్‌ను అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్) సముచిత రీతిలో గౌరవించింది. ప్రతిష్టాత్మక ఐటీటీఎఫ్ అథ్లెట్స్ కమిషన్‌లో శరత్ కమల్‌కు చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడు శరత్ కావడం విశేషం. 2022–2026 మధ్య నాలుగేళ్ల కాలానికిగాను వేర్వేరు ఖండాల నుంచి ఎనిమిది మందిని (నలుగురు పురుషులు, నలుగురు మహిళలు) ఇందులోకి ఎంపిక చేశారు. మొత్తం 283 మంది అథ్లెట్లు ఓటింగ్‌లో పాల్గొనగా, ఆసియా ఖండం ప్రతినిధిగా శరత్‌కు 187 ఓట్లు లభించాయి. మహిళల కేటగిరీలో ఎంపికైన చైనా ప్యాడ్లర్ ల్యూ షీవెన్‌కు 153 ఓట్లు మాత్రమే వచ్చాయి. తనకు లభించిన ఈ అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేసిన శరత్ కమల్...ఆసియా ఖండం నుంచి తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో శరత్ 3 స్వర్ణాలు నెగ్గాడు. నేటి నుంచి ఏషియన్ కప్... బ్యాంకాక్ వేదికగా నేటినుంచి ఐటీటీఎఫ్–ఏటీటీయూ ఏషియన్ కప్ టోర్నీలో శరత్ కమల్‌తో పాటు మరో భారత టాప్ ఆటగాడు సత్యన్ పాల్గొంటున్నారు. అయితే వీరిద్దరికీ కఠిన ‘డ్రా’ ఎదురైంది. తొలి పోరులో తమకంటే మెరుగైన ర్యాంక్‌ల్లో ఉన్న చువాంగ్ చి యువానా (చైనీస్ తైపీ)తో శరత్ తలపడనుండగా, యుకియా ఉడా (జపాన్)ను సత్యన్ ఎదుర్కొంటాడు. -
శరత్ కమల్ @ 31
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) సమాఖ్య (ఐటీటీఎఫ్) తాజాగా విడుదల చేసిన పురుషుల టీటీ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ ఆచంట శరత్ కమల్ ఏడు స్థానాలు ఎగబాకి 31వ స్థానంలో నిలిచాడు. దాంతో భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంకు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 10 సంవత్సరాల తన ఐటీటీఎఫ్ టైటిల్ నిరీక్షణకు గత నెలలో తెరదించుతూ ఒమన్ ఓపెన్‌లో శరత్ విజేతగా నిలిచాడు. దాంతో అతని ర్యాంకింగ్ మెరుగుపడింది. భారత్‌కే చెందిన సత్యన్ 32వ ర్యాంకులో ఉన్నాడు. హర్మీత్ దేశాయ్ (72), ఆంటోని అమల్‌రాజ్ (100), మానవ్ ఠక్కర్ (139) స్థానాల్లో నిలిచారు. ఇక మహిళల విభాగంలో మనికా బాత్రా 63వ స్థానంలో ఉండగా... సుతీర్థ ముఖర్జీ 95వ స్థానంలో నిలిచింది. -
సత్యన్... కొత్త చరిత్ర
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో టాప్–25లో చోటు సంపాదించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా జ్ఞానశేఖరన్ సత్యన్ గుర్తింపు పొందాడు. సోమవారం విడుదల చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో చెన్నైకు చెందిన సత్యన్ నాలుగు స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. హంగేరిలో గత వారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్యన్ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ‘నా ప్రదర్శనతో చాలా సంతృప్తిగా ఉన్నాను. ఈ ఏడాది చివరికల్లా టాప్–15లోకి చేరడమే నా లక్ష్యం’ అని సత్యన్ అన్నాడు. -
ఒమన్ ఓపెన్ టీటీ టోర్నీ రన్నరప్ అర్చన
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఒమన్ ఓపెన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి అర్చన కామత్ రన్నరప్‌గా నిలిచింది. మస్కట్‌లో శనివారం జరిగిన అండర్–21 మహిళల సింగిల్స్ ఫైనల్లో అర్చన 7–11, 8–11, 6–11తో ఒడో సాత్సుకి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. క్వార్టర్ ఫైనల్లో అర్చన 11–7, 11–5, 11–8తో గోయ్ రుయ్ జువాన్ (సింగపూర్)పై, సెమీఫైనల్లో 6–11, 5–11, 11–2, 11–6, 11–9తో మరియా తైలకోవా (రష్యా)పై గెలిచింది. -
సత్యన్ కొత్త చరిత్ర
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున ఆల్‌టైమ్ బెస్ట్ ర్యాంక్ సాధించిన క్రీడాకారుడిగా జ్ఞానశేఖరన్ సత్యన్ చరిత్ర సృష్టించాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సత్యన్ మూడు స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంక్ సాధించిన ప్లేయర్‌గా ఆచంట శరత్ కమల్ (30వ ర్యాంక్) పేరిట ఉన్న రికార్డును సత్యన్ సవరించాడు. గత ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న శరత్ కమల్ మూడు స్థానాలు పడిపోయి 33వ ర్యాంక్‌కు చేరాడు. తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల సత్యన్ ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో సత్యన్ టీమ్ విభాగంలో స్వర్ణం, మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యం, పురుషుల డబుల్స్‌లో రజతం సాధించాడు. ఆస్ట్రియా ఓపెన్ వరల్డ్ టూర్ ప్లాటినమ్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో మనిక బత్రా టాప్–50లోకి స్థానం పొందిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె పది స్థానాలు ఎగబాకి 47వ ర్యాంక్‌కు చేరుకుంది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో మనిక మహిళల సింగిల్స్, టీమ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది. -
రన్నరప్ మానవ్ ఠక్కర్
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) వరల్డ్ జూనియర్ సర్క్యూట్ ఫైనల్స్ టోర్నమెంట్లో భారత యువతార మానవ్ ఠక్కర్ రన్నరప్‌గా నిలిచాడు. లక్సెంబర్గ్‌లో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో జూనియర్ ప్రపంచ నంబర్‌వన్ మానవ్ 11–9, 3–11, 11–9, 6–11, 3–11, 11–9, 6–11తో టాప్ సీడ్ కనక్ ఝా (అమెరికా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. సెమీఫైనల్స్‌లో మానవ్ 11–8, 11–8, 11–5, 11–8తో అబ్దుల్ అజీజ్ (ఈజిప్ట్)పై, కనక్ ఝా 11–3, 12–10, 11–9, 11–6తో ఇవోనిన్ డెనిస్ (రష్యా)పై గెలుపొందారు. -
జోర్డాన్ ఓపెన్ చాంప్ స్నేహిత్
హైదరాబాద్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) జూనియర్ సర్క్యూట్ జోర్డాన్ ఓపెన్ టీటీ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సురవజ్జుల ఫిడేల్ రఫీక్ స్నేహిత్ విజేతగా నిలిచాడు. జోర్డాన్ రాజధాని అమ్మాన్లో గురువారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 4–1 (12–10, 7–11, 11–9, 11–4, 11–6)తో జీత్ చంద్ర (భారత్)పై గెలుపొందాడు. డబుల్స్‌లో భారత్‌కే చెందిన అనుక్రమ్ జైన్‌తో కలిసి రజతాన్ని గెలిచిన స్నేహిత్ ఒకరోజు వ్యవధిలోనే సింగిల్స్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. స్నేహిత్ కెరీర్లో ఇదే తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. సెమీఫైనల్లో స్నేహిత్ 4–2 (11–7, 9–11, 4–11, 11–4, 12–10, 14–12)తో హు పొ సున్ (చైనీస్ తైపీ)పై, క్వార్టర్స్‌లో 4–2 (11–4, 11–8, 11–5, 3–11, 9–11, 11–4)తో వాంగ్ యి ఫాన్ (చైనీస్ తైపీ)పై, ప్రిక్వార్టర్స్‌లో 4–2 (13–15, 13–15, 11–9, 11–8, 11–4, 11–4)తో అబ్దెల్ అజీజ్ యూసుఫ్ (ఈజిప్ట్)పై గెలిచాడు. -
శరత్ కమల్ సంచలనం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్)వరల్డ్ టూర్ ఇండియా ఓపెన్ టోర్నీలో భారత వెటరన్ స్టార్ ఆచంట శరత్ కమల్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 62వ ర్యాంకర్ శరత్ కమల్ 11–8, 11–7, 11–4, 14–16, 11–5తో ప్రపంచ 24వ ర్యాంకర్ యుటో మురామత్సు (జపాన్)పై సంచలన విజయం సాధించాడు. శనివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాల్ డ్రింకాల్ (ఇంగ్లండ్)తో శరత్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన సానిల్ శెట్టి 9–11, 11–9, 12–10, 4–11, 7–11, 7–11తో గార్డోస్ రాబర్ట్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణులు మౌసమి పౌల్, సుతీర్థ ముఖర్జీ, మౌమా దాస్, అర్చన కామత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు.