అబ్బుర పరిచిన నావికా విన్యాసాలు
విశాఖపట్నం: అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షలో భాగంగా బుధవారం జరిగిన నమూనా విన్యాసాలు విశాఖ వాసుల్ని ఆశ్చర్యచకితుల్ని చేశాయి. ప్రతి ఏటా నేవీ డే సందర్భంగా ఇలాంటి విన్యాసాలను వీక్షించే విశాఖవాసులకు ఈసారి అంతర్జాతీయ నౌకలు విశాఖ సాగరతీరంలో అలరించాయి. సాయం సమయంలో ఒక్కసారిగా ఆయా నౌకలకు విద్యుద్దీపాలంకరణతో సముద్రజలాలపై ఓలలాడుతూ కనువిందు చేశాయి. తొలుత సాయం వేళలో ఆర్థగంట పాటు యుద్ధ నౌకలు విశాఖ సముద్రతీరంలో విన్యాసాలు చేయగా యుద్ధ విమానాలు గగనతలంలో రయ్యిన దూసుకుపోయి గగుర్భాటుకు గురిచేశాయి.
సముద్రతీరం నుంచి విశాఖ వీధుల మీదుగా ఫ్లైఫాస్ట్ చేస్తూ తీరప్రాంతంలో వీక్షించేందుకు వచ్చిన వారితో పాటు నగర ప్రజలకు ఐఎఫ్ఆర్ను తలపించాయి. యుద్ధ నౌకలు సైతం శత్రుదేశాల యుద్ధ నౌకలపై దాడి చేయడం, చమురునిల్వలపై దాడి వంటి విన్యాసాలు అబ్బురపరిచాయి. యుద్ధ టాంకర్లు, నావికా సైనికులు హఠాత్తుగా తీరంలోకి దూసుకు వచ్చి దాడుల ప్రదర్శన జరిపారు. రిహార్సల్స్‌లో భాగంగా గురు, శుక్రవారాల్లో సయితం విశాఖ సాగర తీరంలో ఈ విన్యాసాలు చోటుచేసుకోనున్నాయి.