ఇంటర్నెట్ బిజినెస్లో అత్యధిక ఉద్యోగావకాశాలు
సాక్షి, అమరావతి: దేశంలో ఇంటర్నెట్ బిజినెస్ రంగం వేగంగా విస్తరిస్తోందని, ఈ ఏడాది ఈ రంగంలో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉంటాయని ఇండియా స్కిల్స్ రిపోర్ట్– 2023 వెల్లడించింది. భారతదేశంలో ప్రస్తుతం 74.9 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా.. వచ్చే ఐదేళ్లలో ఆ సంఖ్య 90 కోట్లకు చేరుతుందని రిపోర్ట్ స్పష్టం చేసింది. అత్యంత వేగంగా ఈ రంగం విస్తరిస్తోందని, భారతదేశం డిజిటల్ దిగ్గజంగా స్థిరపడేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇంజినీరింగ్, తయారీ రంగంలో పెట్టుబడులపై దృష్టి సారిస్తోందని, ఫార్మాస్యూటికల్ రంగం కూడా గణనీయంగా విస్తరిస్తోందని, ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది.
ఉపాధి అర్హతలో మహిళలే ముందు
గత ఆరేళ్లుగా ఉపాధి అర్హత గల యువతలో మహిళలే అత్యధికంగా ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. 2017లో ఉపాధి అర్హతగల మహిళా వనరులు 40.88 శాతం ఉంటే 2023లో అది 52.80 శాతానికి పెరిగింది. దేశం వ్యాప్తంగా ఉపాధి అర్హత కలిగిన మహిళా వనరులుండటం విద్యలో భారతదేశం సాధించిన విజయాన్ని తెలియజేస్తోందని రిపోర్ట్ వ్యాఖ్యానించింది. దేశంలో అత్యధిక ఉపాధి నైపుణ్యాలు ఈ ఏడాది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది.
ఈ ఏడాది ఉద్యోగావకాశాలు ఎక్కువ
దేశంలో గత ఆరేళ్లతో పోల్చితే ఈ ఏడాది ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ అంచనావేసింది. 2017లో 40.44 శాతమే ఉద్యోగావకాశాలుండగా ఈ ఏడాది 50.3 శాతం మేరకు అది పెరిగాయని రిపోర్ట్ పేర్కొంది. కోవిడ్ సంక్షోభం కారణంగా మూడేళ్లు అంటే 2020 నుంచి 2022 వరకు దేశంలో ఉద్యోగావకాశాలు 46 శాతానికే పరిమితమయ్యాయి.
గత ఆరు సంవత్సరాలుగా ఉద్యోగాలు ఎక్కువగా కల్పించిన రంగాలు..
2017 – ఆయిల్ అండ్ గ్యాస్, స్టీల్, మినరల్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఆటోమోటివ్స్.
2018 – బ్యాంకింగ్,ఫైనాన్స్, సర్వీస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్.
2019 – బీఎఫ్ఎస్ఐ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, మాన్యుఫ్యాక్చరింగ్.
2020 – బీఎఫ్ఎస్ఐ, ఐటీ,
2021 – బీఎఫ్ఎస్ఐ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఐటీ, ఇంటర్నెట్ బిజినెస్.
2022 – ఇంటర్నెట్ బిజినెస్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఐటీ, ఫార్మా