అమ్మకానికి యాహూ ఇంటర్నెట్ వ్యాపారం!
శాన్‌ఫ్రాన్సిస్కో/బెంగళూరు: యాహూ కంపెనీ కీలకమైన తన ఇంటర్నెట్ బిజినెస్‌ను విక్రయించాలని యోచిస్తోంది. ఈవారం జరిగే కంపెనీ డెరైక్టర్ల బోర్డ్‌లో ఈ మేరకు ఒక నిర్ణయం వెలువడగలదని సమాచారం. యాహూ కంపెనీ భవితవ్యం, ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరిసా మేయర్ భవితవ్యంపై కూడా విస్తృతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ బోర్డ్ మీటింగ్ జరగనున్నది. యాహూ సంస్థ తన ఇంటర్నెట్ వ్యాపారాన్ని విక్రయించే అవకాశాలున్నాయంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ మంగళవారం పేర్కొంది. బోర్డ్ సమావేశాలు బుధవారం నుంచి శుక్రవారం వరకూ జరగనున్నాయి.
ఈ సమావేశాల్లో ఆలీబాబా హోల్డింగ్ గ్రూప్‌లో ఉన్న 3,000 కోట్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించే విషయం కూడా చర్చకు రానున్నదని సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో కంపెనీ షేర్లు 7శాతం ఎగిశాయి. యాహూ కీలక వ్యాపారాలు.. యాహూ మెయిల్, న్యూస్, స్పోర్ట్స్ సైట్ల విక్రయానికి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, మీడియా, టెలికాం కంపెనీల నుంచి మంచి స్పందన లభించగలదని యాహూ భావిస్తోంది. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి యాహూ నిరాకరించింది. కాగా చాలా కాలం గూగుల్‌లో పనిచేసి ఆ తర్వాత యాహూలో చేరిన మరిసా మేయర్‌పై పనితీరు అంశాల పట్ల తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి.
గూగుల్, ఫేస్‌బుక్‌లతో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న యాహూ ఆమె రాకతో టర్న్‌అరౌండ్ అవగలదన్న అంచనాలు పెరిగిపోయాయి. అయితే మావెన్స్ పేరుతో ఆమె అందుబాటులోకి తెచ్చిన వ్యూహాం సత్ఫలితాలనివ్వలేదు.