ఏడాదికి లక్ష ఫోన్ల ట్యాపింగ్!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తున్న ఫోన్ల సంఖ్య ఏడాదికి లక్షకు పైగా ఉంటున్నాయట. దీనికి రాష్ట్ర ప్రభుత్వాల నిఘాలు కూడా జతచేస్తే ఆ సంఖ్య ఆశ్చర్యం గొలిపేలా ఉంటుందని సాఫ్ట్వేర్ ఫ్రీడం లా సెంటర్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఉచితంగా న్యాయసహాయం అందించే ఆ సంస్థ ఈ మధ్యనే ఇస్తాంబుల్లో జరిగిన ‘ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం’లో తన నివేదికను విడుదల చేసింది.
‘ఇండియాస్ సర్వైలెన్స్ స్టేట్’ అనే పేరుతో విడుదలైన ఆ నివేదికను ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంతో రూపొందించారు. భారతదేశం తన ప్రజలపై నిరంత రం నిఘా ఉంచుతోందని 68 పేజీల నివేదికలో ఆ సంస్థ పేర్కొంది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాలను అనుసరించి భారత్ ఈ నిఘా ను నిర్వహిస్తోందని తెలిపింది. ఈ చట్టాల ద్వారా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఈ మెయిల్స్, ఇంటర్నెట్ వినియోగంపై కన్నేసి ఉంచుతోందని అందులో చెప్పారు.