Interstate gang of thieves
-
నకిలీ కాల్ సెంటర్‌తో ఖాతాలు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియా, కెనడా దేశవాసులను లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు. పేట్బషీరాబాద్లో నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, నేరాలు చేస్తున్న 13 మంది నిందితులను అరెస్ట్‌చేశారు. ఈమేరకు మేడ్చల్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ ఎంఏ రషీద్, అదనపు డీసీపీ శోభన్ కుమార్‌లతో కలిసి మేడ్చల్ జోన్ డీసీపీ సందీప్ బుధవారం మీడియాకు వెల్లడించారు. లండన్‌లో పెడితే దొరికిపోతామని... హనుమకొండలోని కిషన్‌పురకు చెందిన బైరిక్ ప్రమోద్ రెడ్డి లండన్‌లో ఏ1 ఎక్స్‌ప్రెస్ సూపర్ మార్కెట్ నిర్వహించేవాడు. వ్యాపారం పెద్దగా సాగకపోవటం, అప్పులు మీద పడటంతో అక్రమ మార్గంలో సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. లండన్‌లో ఉంటున్న స్నేహితులు వరంగల్‌కు చెందిన కుంచాల అజయ్ కుమార్, రామకృష్ణా రెడ్డి, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రబీష్ కుమార్ ప్రసాద్ అలియాస్ రాహుల్, సర్బేష్ కుమార్ గుప్తా అలియాస్ ఆమెన్లకు విదేశీయులను మోసం చేసే పథకం గురించి చెప్పాడు. అయితే లండన్‌లో నకిలీ కాల్ సెంటర్ పెట్టి మోసాలు చేస్తే సులువుగా పట్టుబడతామని గ్రహించిన ముఠా.. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావించింది. ‘ఎనీ డెస్క్’ద్వారా కూడా.. నెల రోజుల క్రితం పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని వీఎస్ఎస్ అపార్ట్మెంట్లో ఈ ముఠా సభ్యులు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సాంకేతిక సేవలు అందిస్తామనే నెపంతో ఆస్ట్రేలియా, కెనడా దేశస్తులను టార్గెట్ చేసుకున్నారు. ఆయా దేశాలకు చెందిన పౌరుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఇతరత్రా వ్యక్తిగత వివరాలను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆకాశ్, వెస్లీల నుంచి కొనుగోలు చేశారు. టెలికాలర్లుగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముకేష్ రజాక్ అలియాస్ మార్క్, కర్మా షీపాల్ అలియాస్ జాక్, ఎండీ ముస్తఫా అలియాస్ డానియల్, అన్మోల్ ప్రదాన్ అలియాస్ స్టీఫెన్, రాయ్ రిష్కాంత్ అలియాస్ ర్యాన్, ఐడీపీఎల్ బాలానగర్‌కు చెందిన మహ్మద్ సమీర్ అలియాస్ సామ్ మహ్మద్ హాజీ, బొల్లారంకు చెందిన గుంజి పవన్ కుమార్ అలియాస్ కెవిన్, నిర్మల్‌కు చెందిన సాయి వీర ప్రసాద్ అలియాస్ జేమ్స్, జీడిమెట్లకు చెందిన నయాకోటి బస్వరాజులను నియమించుకున్నాడు. వీరు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) ద్వారా విదేశీయులకు ఫోన్ చేసేవారు. మీరు వినియోగించే అమెజాన్ ప్రైమ్ యాప్ నకిలీదని, హ్యాక్ అయిందని, భద్రతా లోపాలున్నాయని చెప్పి నమ్మించేవారు. సాంకేతిక సేవలను అందించేందుకు కొంత రుసుము చెల్లించాలని చెప్పి మొబైల్‌కు లింక్‌లు పంపించి బ్యాంకు అకౌంట్లు ఖాళీ చేసేవారు. గిఫ్ట్ కార్డుల రూపంలో ఆస్ట్రేలియా బ్యాంకు ఖాతాలకు సొమ్మును బదిలీ చేయించుకునేవారు. కొన్ని సందర్భాల్లో బాధితుల సెల్ఫోన్లో ఎనీ డెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి, దాని ద్వారా బ్యాంకు ఖాతా వివరాలను తస్కరించి ఖాతా ఖాళీ చేసేవారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్లో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రామకృష్ణా రెడ్డి, ఆకాశ్, వెస్లీల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 13 కంప్యూటర్లు, సీపీయూలు, హెడ్ సెట్లు, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, మెమొరీ కార్డు, సిమ్ కార్డులు, సెల్ఫోన్లు, చేతి గడియారాలు, కారు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
సైబర్ మోసగాళ్ల అరెస్ట్
విజయవాడ స్పోర్ట్స్: మన్‌గో గోనట్స్ వ్యాపారం చేస్తే అధిక లాభాలు వస్తాయని వ్యాపారులను నమ్మించి నగదు వసూలు చేస్తూ భారీ సైబర్ మోసానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు విజయవాడ సైబర్ పోలీసులు చెక్ పెట్టారు. గుజరాత్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ కేంద్రంగా ఈ నేరానికి పాల్పడుతున్న సతీష్‌శర్మ, కృష్ణశర్మను అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరూ విజయవాడ హనుమాన్‌పేటకు చెందిన ఓ చెప్పుల వ్యాపారిని ఉచ్చులోకి దింపారు. ముందుగా ఫేస్బుక్ ద్వారా ఓ మహిళను ఆ వ్యాపారికి పరిచయం చేసి మన్‌గో గోనట్స్ వ్యాపారాన్ని వివరించారు. ఆఫ్రికా దేశాల్లో తక్కువ ధరకు లభించే ఈ నట్స్‌ను ఇండియాలో అమ్మితే లాభాలు గడించవచ్చని వ్యాపారిని నమ్మించారు. పలు దఫాలుగా రూ.78 లక్షలు వసూలు చేశారు. తరువాత నుంచి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో చెప్పుల వ్యాపారి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు గుజరాత్ కేంద్రంగా సైబర్ నేరానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సహకారంతో ముందుగా నిందితులు సతీష్‌శర్మ, కృష్ణశర్మకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు వారు స్పందించకపోవడంతో వారిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సైబర్ సీఐ కె.శ్రీనివాస్ తెలిపారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు పంపినట్లు చెప్పారు. -
అంతర్రాష్ట్ర సెల్ఫోన్ల చోరీ ముఠాలో ఇద్దరి అరెస్ట్
గూడూరు: కూలి పనులు చేసుకుంటున్నట్టు నమ్మించి చెన్నై వంటి రద్దీగా ఉన్న ప్రదేశాల్లో విలువైన సెల్ ఫోన్లను దొంగిలించి సొమ్ము చేసుకుంటున్న ముఠాలోని ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.23.63 లక్షల విలువైన సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు గూడూరులోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన మేకల సుబ్బారావు కుమారుడు కృష్ణ, అదే ప్రాంతానికి చెందిన మేకల మురళీ కుమారుడు పవన్‌లు.. మరో ఇద్దరితో కలిసి 45 రోజుల కిందట చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తాము కూలి పనులు చేసుకుంటామని స్థానికులను నమ్మించి ఓగదిని అద్దెకు తీసుకున్నారు. వారంతా కలిసి పగటి వేళల్లో బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో జేబులు కొట్టడంతో పాటు సెల్ఫోన్లు చోరీ చేస్తుండేవారు. అలా దొంగిలించిన సెల్ఫోన్లను స్నేహితుడి సాయంతో సాఫ్ట్‌వేర్‌ను ఫార్మెట్ చేసి విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్ఐ బ్రహ్మనాయుడు తదితరులు జాతీయ రహదారిపై పోటుపాళెం కూడలి ప్రాంతం వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్సు దిగి అనుమానాస్పదంగా బ్యాగులు పట్టుకుని తిరుగుతున్న కృష్ణ, పవన్‌లను వారు గమనించారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి నేర చరిత్రతో పాటు వారి వద్ద ఉన్న బ్యాగుల్లో 228 సెల్ఫోన్లు బయటపడ్డాయి. కృష్ణపై పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కేసులుండగా, ఆకివీడు పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
పుత్తూరు రూరల్(చిత్తూరు జిల్లా): అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన నలుగురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.45 లక్షలు విలువ చేసే బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను పుత్తూరు డీఎస్పీ టీడీ యశ్వంత్ శనివారం మీడియాకు వెల్లడించారు. పుత్తూరు డివిజన్ పరిధిలోని దొంగతనాలను అరికట్టేందుకు, నిందితులను పట్టుకునేందుకు నెల రోజులుగా 30 మందితో కూడిన 4 బృందాలు తమిళనాడు, ఏపీ సరిహద్దుల్లో విసృతంగా గాలించాయని చెప్పారు. ఈ నెల 14న నారాయణవనం మండలం పాలమంగళం బస్టాప్ వద్ద పుత్తూరు రూరల్ సీఐ, నారాయణవనం, ఎస్ఆర్పురం, వరదయ్యపాళెం ఎస్ఐలతో కూడిన బృందం తమిళనాడుకు చెందిన నలుగురు గజ దొంగలను పట్టుకుందని చెప్పారు. వీరిలో రాయపురానికి చెందిన ఆర్.రవి అలియాస్ రవిశంకర్.. ప్రస్తుతం ఏపీలోని పిచ్చాటూరు మండలం కొత్తగొల్లకండ్రిగలో నివాసం ఉంటున్నారని తెలిపారు. మిగిలిన ముగ్గురు కె.భాస్కర్, ఎ.మణి, ఎం.సేతు ధర్మపురం జిల్లా ఆరూరుకు చెందిన వారని పేర్కొన్నారు. వీరిని విచారించగా సత్యవేడు, వరదయ్యపాళెం, నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం, పుత్తూరు, ఎస్ఆర్ పురం, కార్వేటి నగరం, వెదురుకుప్పం పోలీస్స్టేషన్ల పరిధిలోని ఇళ్లల్లో దొంగతనాలు చేశామని అంగీకరించినట్లు తెలిపారు. ఈ కేసులను ఛేదించిన పుత్తూరు, నగరి రూరల్ సీఐలు ఎం.సురేష్‌కుమార్, ఎం.రాజశేఖర్, సీఐ చంద్రశేఖర్‌నాయక్, ఎస్ఐలు ఎం.ప్రియాంక, ఎన్.శ్రీకాంత్‌రెడ్డి, ఎం.నాగార్జునరెడ్డి, పురుషోత్తంరెడ్డి, ఇతర సిబ్బందిని ఎస్పీ సెంథిల్‌కుమార్ అభినందించారని డీఎస్పీ తెలిపారు. -
పెద్ద మనుషులుగా చలామణి అవుతూ..!
సాక్షి, హైదరాబాద్: పెద్ద మనుషులుగా చలామణి అవుతూ..గత ఐదేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తెలంగాణ, ఆంధప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన నలుగురు దొంగలు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారని సీపీ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఈ ముఠా 10 చోరీలకు పాల్పడినట్లు గుర్తించామని పేర్కొన్నారు. వారివద్ద నుంచి 60 తులాల బంగారం, 2 కిలోల వెండి, ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సీపీ వెల్లడించారు. నిందితులు వారి గ్రామాల్లో వ్యాపారం నిర్వహిస్తూ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారని తెలిపారు. ఏడాదిలో ఒకసారి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల వైపు వచ్చి చోరీలకు తెగబడుతున్నారని చెప్పారు. చోరీల కోసం వచ్చినప్పుడు ఖరీదైన హోటళ్లలో బస చేసి..తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేస్తున్నారని సీపీ పేర్కొన్నారు. -
జైల్లో జట్టుకట్టి పథకం వేసి..
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో గతేడాది డిసెంబర్ ఆఖరివారంలో వరుస గొలుసు చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్రముఠా గుట్టును హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతోపాటుగా హైదరాబాద్ వాసి చింతమల్ల ప్రణీత్ చౌదరిలు ముఠాగా ఏర్పడి ఈ వరుస గొలుసు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లి డిపోర్టేషన్‌పై తిరిగి వచ్చి నేర జీవితాన్ని ఎంచుకున్న ప్రణీత్ చౌదరే ఈ ముఠాకు సూత్రధారిగా తేల్చారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ ముఠా ఆట కట్టించడమే కాకుండా వారినుంచి మొత్తం సొత్తును రికవరీ చేసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. తన కార్యాలయంలో ఈ ముఠాకు సంబంధించి పూర్తి వివరాలను బుధవారం ఆయన మీడియాకు వెల్లడించారు. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ప్రణీత్ ఇంజనీరింగ్ చదువు మధ్యలోనే ఆపి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివేందుకు లండన్‌కు వెళ్లాడు. ముందస్తు సమాచారం లేకుండా భారత్‌కు వచ్చి వెళ్లడంతో ప్రణీత్‌ను అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు డిపోర్టేషన్ పద్ధతిలో తిప్పిపంపేశారు. అప్పట్నుంచి నేరజీవితం ప్రారంభించిన ప్రణీత్ తన వద్ద ఉన్న అమెరికా డాలర్లు మార్పిడి చేసుకోవచ్చంటూ ఆశ చూపించి చాలామందిని మోసం చేశాడు. 2014–15 ఏడాదిలో సరూర్‌నగర్, ఉప్పల్‌తోపాటు నోయిడాలోను పలు నేరాలు చేసి అక్కడి పోలీసులకు చిక్కాడు. 2015లో ప్రణీత్‌పై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ ప్రయోగించడంతో రెండున్నరేళ్ల పాటు నోయిడా సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఇదే జైలులో స్నాచింగ్స్, దోపిడీ నేరాలతో జైలు శిక్ష అనుభవిస్తున్న యూపీకి చెందిన ఛోకా, మోను వాల్మీకితో ప్రణీత్ చౌదరికి పరిచయమేర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడి గొలుసు చోరీలు చేయాలని పథకం వేశారు. ముందు రెక్కీ...ఆపై చోరీలు ఎల్బీనగర్ జోన్‌పై ప్రణీత్‌కు మంచి పట్టుండటంతో ప్రధాన రహదారికి ఆనుకుని ఏయే చోట్ల స్నాచింగ్ చేయాలి? ఏ రూట్లో పారిపోవాలి అన్న విషయాలు ముందే ఆలోచించి పెట్టుకున్నాడు. గత నెల 24న ఛోకా, మోనులను హైదరాబాద్ రప్పించి కాచిగూడలోని లాడ్జిలో బస ఏర్పాటు చేశాడు. చోరీలు చేసేందుకు ఓఎల్ఎక్స్లో మలక్‌పేటకు చెందిన సోఫి యాన్ నుంచి కేటీఎం బైక్‌ను అద్దెకు తీసుకున్నారు. వీరిద్దరూ దీనిపై, ప్రణీత్ పల్సర్ బైక్‌పై తిరుగుతూ గతనెల 24, 25 తేదీల్లో రెక్కీలు నిర్వహించారు. 26 సాయంత్రం ప్రణీత్ లాడ్జిలోనే ఉండిపోగా.. ఛోకా, మోనులిద్దరూ సాయంత్రం 4.40 నుంచి రాత్రి 8.55 మధ్య మీర్‌పేట, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్‌నగర్‌ల్లో 5 గొలుసు చోరీలకు పాల్పడ్డారు. ఆ రాత్రి లాడ్జిలో ఉండి మరుసటి రోజు ఉదయం 7 నుంచి 7.40 వరకు చైతన్యపురి, వనస్థలిపురం, హయత్‌నగర్‌ల్లో 5 స్నాచింగ్స్ చేసి తిరిగి లాడ్జికి వెళ్లిపోయారు. అదేరోజు వాహనాన్ని భవానీనగర్ ఠాణా పరిధిలో వదిలేసి ముగ్గురూ కలిసి ఉత్తరాదికి పారిపోయారు. దారి చూపిన గూగుల్ పే ఈ కేసులన్నీ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగినప్పటికీ హైదరాబాద్ పోలీసులూ అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సీసీ కెమెరాల్లో రికా ర్డయిన ఫీడ్‌తో పాటు ఇతర ఆధారాలను పరిశీలించారు. స్నాచర్లు ఉత్తరాదికి చెందిన వారుగా తేలడంతో తమ పరిధిల్లోని లాడ్జీల్లో ఆరా తీయగా... కాచిగూడలోని ఓ లాడ్జీలో వీరి వివరాలు దొరికాయి. లాడ్జి యజమానికి డబ్బు చెల్లించేందుకు ప్రణీత్ తన గూగుల్ పే యాప్‌ను వాడటంతో అడ్డంగా దొరికిపోయాడు. దుండగుల కోసం ఉత్తరాదిలో గాలించిన పోలీసులకు నిరాశే ఎదురైంది. అయితే మళ్లీ నేరాలు చేసేందుకు వీరు నగరానికి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భవానీనగర్ పరిధిలో ఇద్దరు స్నాచర్లు పల్సర్‌పై తిరుగుతూ పోలీసులకు చిక్కడంతో వారిద్వారా లాడ్జిలో ఉన్న ప్రణీత్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి బంగారాన్ని రికవరీ చేశారు. వాహనాలతో పాటుగా చోరీ ప్రయ త్నంలో ఎవరైనా అడ్డుకుంటే అంతం చేయడానికి ఉంచుకున్న ఓ కత్తినీ ఛోకా నుంచి స్వాధీనం చేసు కున్నారు. వీరికి బైక్ అద్దెకు ఇచ్చిన సోఫియాన్ పైనా విచారణకు నిర్ణయించారు. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని అధికారులు యోచిస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం స్నాచర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాచకొండ అధికారులకు అప్పగించారు. -
కన్ను పడితే కన్నమే..
సాక్షి, గద్వాల క్రైం: తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. ఎంతమంది కాలనీలో సంచరిస్తున్నా.. పోలీసుల నిఘా.. పెట్రోలీంగ్.. అడుగడుగునా తనిఖీలు చేపడుతున్నా వారి కన్నుపడితే మాత్రం కన్నం పడాల్సిందే.. అనుమానం రాకుండా తమ చేతివాటంతో ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకెళ్తారు.. రెండురోజులకు ఒక చోరీ చేపడుతూ దొరబాబుల్లా తప్పించుకుంటున్నారు.. ఇందుకు జోగుళాంబ గద్వాల జిల్లా వీరికి స్వర్గధామంగా మారింది.. అంతుచిక్కని ఆట విడుపుతో జిల్లా పోలీసులకు సవాల్ విసురుతున్నారు.. గత రెండు నెలల్లోనే ఇప్పటి వరకు గద్వాల, అయిజ, మానవపాడు, శాంతినగర్ మండలాల్లో 14 చోరీలు చేయగా.. రూ.8,70,500 నగదు, 65 తులాల బంగారం, 57 తులాల వెండి ఆభరణాలు కలిపి రూ.21,22,230 విలువైన సొత్తు మాయమైపోయింది.. అంతర్రాష్ట్ర ముఠా పనేనా..? గత కొన్ని నెలలుగా స్తబ్ధుగా ఉన్న జిల్లాలో వరుస చోరీలు జరుగుతుండటంతో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు జిల్లాకు వచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చోరీలు జరుగుతున్న తీరును బట్టి చూస్తే పక్కా పథకం ప్రకారమే చేస్తున్నారు. ముఠాలోని సభ్యులు పట్టణంలోనే సంచరిస్తూ ఆయా కాలనీల్లో తాళం వేసిన ఇళ్లలోనే దొంగతనాలు చేస్తున్నారు. ఇలాంటి తరహాలో చోరీలు జరగడం జిల్లాలో ప్రథమంగా ఉంది. అయితే అంతర్రాష్ట్ర ముఠా సభ్యులే చోరీలకు పాల్పడినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులను సైతం ముఠా సభ్యులు గమనిస్తూ ఎవరికి చిక్కకుండా జిల్లాలోనే సంచరిస్తున్నట్లు తెలుస్తుంది. గంటల వ్యవధిలోనే.. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న వరుస చోరీలతో సామాన్య ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లలోనే చోరీలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నిత్యం పోలీసుల గస్తీలు, తనిఖీలు, నిఘా ఉన్నప్పటికీ ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే ఏంచక్కా దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇక పోలీసులు వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుని ప్రజల్లో ఉన్న భయాందోళనను తొలగించాలి. పోలీసులకు సవాల్ చోరీలకు పాల్పడిన దుండగులు ఎవరనే అంశంపై జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టిసారించింది. ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు.. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సరిహద్దుల్లో తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పలు ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సహాయంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ జాదుగాళ్లు తప్పించుకుంటున్నారు. కేసుల ఛేదనలో పలు పోలీసు బృందాలు విస్తృతంగా అధ్యయనం చేసినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. చోరీ ఘటనలు ఇవిగో.. - అక్టోబర్ మొదటి వారంలో పలు ఇళ్లలో చోరీ ఘటనలు చోటుచేసుకోగా.. రూ.5 వేలు, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. - అక్టోబర్ 13న ఎక్లాస్పురం నర్సింహారెడ్డికి చెందిన అయిజలోని లక్ష్మీనర్సింహా ట్రేడర్స్ దుకాణంలో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ.3.40 లక్షల విలువైన వస్తు సామగ్రిని ఎత్తుకెళ్లారు. - అక్టోబర్ 27న గద్వాలలోని కోర్టు సమీపంలో నివాసం ఉంటున్న సత్యనారాయణ ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ.90 వేల నగదు, 10 తులాల బంగారం అపహరించారు. - నవంబర్ 6న శాంతినగర్‌కు చెందిన సువర్ణ అనే మహిళ పని నిమిత్తం కర్నూలు బస్సులో పెబ్బేరుకు వెళ్తుండగా ఆమె వద్ద ఉన్న 2.50 గ్రాముల బంగారం అపహరించారు. - నవంబర్ 8న గద్వాల పట్టణానికి చెందిన సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి దైవదర్శనం కోసం తిరుపతికి వెళ్లారు. అయితే తాళం వేసి ఉండడంతో మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని దుండగులు తాళం విరగొట్టి ఇంట్లో ఉన్న రూ.41 వేల నగదు ఎత్తుకెళ్లారు. - నవంబర్ 9న పట్టణంలోని షేరెల్లివీధికి చెందిన రాఘవచారి కుటుంబ సభ్యులతో కలిసి కేటీదొడ్డి మండలంలోని వెంకటాపురంలో జాతరకు వెళ్లారు. గమనించిన దొంగలు మధ్యాహ్న సమయంలో ఇంట్లోకి చొరబడి 55 తులాల బంగారం, 57 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఇలా గడిచిన 41 రోజుల వ్యవధిలోనే 14 దొంగతనాలు చేసి.. భారీగా నగదు, బంగారం ఆభరణాలు అపహరించుకెళ్లారు. త్వరలోనే పట్టుకుంటాం చోరీలు చేస్తున్న వ్యక్తులను త్వరలో పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తాం. అయితే చోరీలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తే తెలిసిన వ్యక్తులే చేస్తున్నట్లు తెలుస్తుంది. పథకం ప్రకారమే తాళం వేసిన ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి. ఈ విషయమై ప్రత్యేక బృందాలు కూపీ లాగుతున్నాయి. ప్రజలు సైతం విలువైన ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదు బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలి. ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – షాకీర్ హుస్సేన్, డీఎస్పీ, గద్వాల -
తిరుపతిలో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
తిరుపతి: నగరంలో దొంగల ముఠాల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. అంతరాష్ట్ర దొంగల ముఠా ఆగడాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. ఈ చర్యల్లో భాగంగా తిరుపతిలో బుధవారం ఏడు మంది అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ దొంగతనాలు చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వీరినుంచి 20 బైకులు, 2 కంప్యూటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన ఏడుమంది దొంగలలో 6మంది విద్యార్థులు ఉండటం విశేషం.