వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ విజయరావు
గూడూరు: కూలి పనులు చేసుకుంటున్నట్టు నమ్మించి చెన్నై వంటి రద్దీగా ఉన్న ప్రదేశాల్లో విలువైన సెల్ ఫోన్లను దొంగిలించి సొమ్ము చేసుకుంటున్న ముఠాలోని ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.23.63 లక్షల విలువైన సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు గూడూరులోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన మేకల సుబ్బారావు కుమారుడు కృష్ణ, అదే ప్రాంతానికి చెందిన మేకల మురళీ కుమారుడు పవన్‌లు.. మరో ఇద్దరితో కలిసి 45 రోజుల కిందట చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతానికి వెళ్లారు.
అక్కడ తాము కూలి పనులు చేసుకుంటామని స్థానికులను నమ్మించి ఓగదిని అద్దెకు తీసుకున్నారు. వారంతా కలిసి పగటి వేళల్లో బస్టాండ్‌లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో జేబులు కొట్టడంతో పాటు సెల్‌ఫోన్లు చోరీ చేస్తుండేవారు. అలా దొంగిలించిన సెల్‌ఫోన్లను స్నేహితుడి సాయంతో సాఫ్ట్‌వేర్‌ను ఫార్మెట్ చేసి విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు తదితరులు జాతీయ రహదారిపై పోటుపాళెం కూడలి ప్రాంతం వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్సు దిగి అనుమానాస్పదంగా బ్యాగులు పట్టుకుని తిరుగుతున్న కృష్ణ, పవన్‌లను వారు గమనించారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి నేర చరిత్రతో పాటు వారి వద్ద ఉన్న బ్యాగుల్లో 228 సెల్‌ఫోన్లు బయటపడ్డాయి. కృష్ణపై పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కేసులుండగా, ఆకివీడు పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment