సత్యనారాయణ నివాస గృహంలో తనిఖీ చేస్తున్న పోలీసులు (ఫైల్)
సాక్షి, గద్వాల క్రైం: తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. ఎంతమంది కాలనీలో సంచరిస్తున్నా.. పోలీసుల నిఘా.. పెట్రోలీంగ్.. అడుగడుగునా తనిఖీలు చేపడుతున్నా వారి కన్నుపడితే మాత్రం కన్నం పడాల్సిందే.. అనుమానం రాకుండా తమ చేతివాటంతో ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకెళ్తారు.. రెండురోజులకు ఒక చోరీ చేపడుతూ దొరబాబుల్లా తప్పించుకుంటున్నారు.. ఇందుకు జోగుళాంబ గద్వాల జిల్లా వీరికి స్వర్గధామంగా మారింది.. అంతుచిక్కని ఆట విడుపుతో జిల్లా పోలీసులకు సవాల్ విసురుతున్నారు.. గత రెండు నెలల్లోనే ఇప్పటి వరకు గద్వాల, అయిజ, మానవపాడు, శాంతినగర్ మండలాల్లో 14 చోరీలు చేయగా.. రూ.8,70,500 నగదు, 65 తులాల బంగారం, 57 తులాల వెండి ఆభరణాలు కలిపి రూ.21,22,230 విలువైన సొత్తు మాయమైపోయింది..
అంతర్రాష్ట్ర ముఠా పనేనా..?
గత కొన్ని నెలలుగా స్తబ్ధుగా ఉన్న జిల్లాలో వరుస చోరీలు జరుగుతుండటంతో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు జిల్లాకు వచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చోరీలు జరుగుతున్న తీరును బట్టి చూస్తే పక్కా పథకం ప్రకారమే చేస్తున్నారు. ముఠాలోని సభ్యులు పట్టణంలోనే సంచరిస్తూ ఆయా కాలనీల్లో తాళం వేసిన ఇళ్లలోనే దొంగతనాలు చేస్తున్నారు. ఇలాంటి తరహాలో చోరీలు జరగడం జిల్లాలో ప్రథమంగా ఉంది. అయితే అంతర్రాష్ట్ర ముఠా సభ్యులే చోరీలకు పాల్పడినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులను సైతం ముఠా సభ్యులు గమనిస్తూ ఎవరికి చిక్కకుండా జిల్లాలోనే సంచరిస్తున్నట్లు తెలుస్తుంది.
గంటల వ్యవధిలోనే..
ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న వరుస చోరీలతో సామాన్య ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లలోనే చోరీలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నిత్యం పోలీసుల గస్తీలు, తనిఖీలు, నిఘా ఉన్నప్పటికీ ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే ఏంచక్కా దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇక పోలీసులు వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుని ప్రజల్లో ఉన్న భయాందోళనను తొలగించాలి.
పోలీసులకు సవాల్
చోరీలకు పాల్పడిన దుండగులు ఎవరనే అంశంపై జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టిసారించింది. ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు.. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సరిహద్దుల్లో తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పలు ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సహాయంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ జాదుగాళ్లు తప్పించుకుంటున్నారు. కేసుల ఛేదనలో పలు పోలీసు బృందాలు విస్తృతంగా అధ్యయనం చేసినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో పోలీసులకు సవాల్‌గా మారింది.
చోరీ ఘటనలు ఇవిగో..
- అక్టోబర్ మొదటి వారంలో పలు ఇళ్లలో చోరీ ఘటనలు చోటుచేసుకోగా.. రూ.5 వేలు, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు.
- అక్టోబర్ 13న ఎక్లాస్‌పురం నర్సింహారెడ్డికి చెందిన అయిజలోని లక్ష్మీనర్సింహా ట్రేడర్స్ దుకాణంలో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ.3.40 లక్షల విలువైన వస్తు సామగ్రిని ఎత్తుకెళ్లారు.
- అక్టోబర్ 27న గద్వాలలోని కోర్టు సమీపంలో నివాసం ఉంటున్న సత్యనారాయణ ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ.90 వేల నగదు, 10 తులాల బంగారం అపహరించారు.
- నవంబర్ 6న శాంతినగర్‌కు చెందిన సువర్ణ అనే మహిళ పని నిమిత్తం కర్నూలు బస్సులో పెబ్బేరుకు వెళ్తుండగా ఆమె వద్ద ఉన్న 2.50 గ్రాముల బంగారం అపహరించారు.
- నవంబర్ 8న గద్వాల పట్టణానికి చెందిన సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి దైవదర్శనం కోసం తిరుపతికి వెళ్లారు. అయితే తాళం వేసి ఉండడంతో మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని దుండగులు తాళం విరగొట్టి ఇంట్లో ఉన్న రూ.41 వేల నగదు ఎత్తుకెళ్లారు.
- నవంబర్ 9న పట్టణంలోని షేరెల్లివీధికి చెందిన రాఘవచారి కుటుంబ సభ్యులతో కలిసి కేటీదొడ్డి మండలంలోని వెంకటాపురంలో జాతరకు వెళ్లారు. గమనించిన దొంగలు మధ్యాహ్న సమయంలో ఇంట్లోకి చొరబడి 55 తులాల బంగారం, 57 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఇలా గడిచిన 41 రోజుల వ్యవధిలోనే 14 దొంగతనాలు చేసి.. భారీగా నగదు, బంగారం ఆభరణాలు అపహరించుకెళ్లారు.
త్వరలోనే పట్టుకుంటాం
చోరీలు చేస్తున్న వ్యక్తులను త్వరలో పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తాం. అయితే చోరీలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తే తెలిసిన వ్యక్తులే చేస్తున్నట్లు తెలుస్తుంది. పథకం ప్రకారమే తాళం వేసిన ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి. ఈ విషయమై ప్రత్యేక బృందాలు కూపీ లాగుతున్నాయి. ప్రజలు సైతం విలువైన ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదు బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలి. ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – షాకీర్ హుస్సేన్, డీఎస్పీ, గద్వాల
Comments
Please login to add a commentAdd a comment