పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలు
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియా, కెనడా దేశవాసులను లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు. పేట్‌బషీరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, నేరాలు చేస్తున్న 13 మంది నిందితులను అరెస్ట్‌చేశారు. ఈమేరకు మేడ్చల్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) డీసీపీ ఎంఏ రషీద్, అదనపు డీసీపీ శోభన్ కుమార్‌లతో కలిసి మేడ్చల్ జోన్ డీసీపీ సందీప్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
లండన్‌లో పెడితే దొరికిపోతామని...
హనుమకొండలోని కిషన్‌పురకు చెందిన బైరిక్ ప్రమోద్ రెడ్డి లండన్‌లో ఏ1 ఎక్స్‌ప్రెస్ సూపర్ మార్కెట్ నిర్వహించేవాడు. వ్యాపారం పెద్దగా సాగకపోవటం, అప్పులు మీద పడటంతో అక్రమ మార్గంలో సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. లండన్‌లో ఉంటున్న స్నేహితులు వరంగల్‌కు చెందిన కుంచాల అజయ్ కుమార్, రామకృష్ణా రెడ్డి, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రబీష్ కుమార్ ప్రసాద్ అలియాస్ రాహుల్, సర్బేష్ కుమార్ గుప్తా అలియాస్ ఆమెన్‌లకు విదేశీయులను మోసం చేసే పథకం గురించి చెప్పాడు. అయితే లండన్‌లో నకిలీ కాల్ సెంటర్ పెట్టి మోసాలు చేస్తే సులువుగా పట్టుబడతామని గ్రహించిన ముఠా.. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావించింది.
‘ఎనీ డెస్క్’ద్వారా కూడా..
నెల రోజుల క్రితం పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని వీఎస్‌ఎస్ అపార్ట్‌మెంట్‌లో ఈ ముఠా సభ్యులు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సాంకేతిక సేవలు అందిస్తామనే నెపంతో ఆస్ట్రేలియా, కెనడా దేశస్తులను టార్గెట్ చేసుకున్నారు. ఆయా దేశాలకు చెందిన పౌరుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఇతరత్రా వ్యక్తిగత వివరాలను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆకాశ్, వెస్లీల నుంచి కొనుగోలు చేశారు.
టెలికాలర్లుగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముకేష్ రజాక్ అలియాస్ మార్క్, కర్మా షీపాల్ అలియాస్ జాక్, ఎండీ ముస్తఫా అలియాస్ డానియల్, అన్మోల్ ప్రదాన్ అలియాస్ స్టీఫెన్, రాయ్ రిష్కాంత్ అలియాస్ ర్యాన్, ఐడీపీఎల్ బాలానగర్‌కు చెందిన మహ్మద్ సమీర్ అలియాస్ సామ్ మహ్మద్ హాజీ, బొల్లారంకు చెందిన గుంజి పవన్ కుమార్ అలియాస్ కెవిన్, నిర్మల్‌కు చెందిన సాయి వీర ప్రసాద్ అలియాస్ జేమ్స్, జీడిమెట్లకు చెందిన నయాకోటి బస్వరాజులను నియమించుకున్నాడు.
వీరు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) ద్వారా విదేశీయులకు ఫోన్ చేసేవారు. మీరు వినియోగించే అమెజాన్ ప్రైమ్ యాప్ నకిలీదని, హ్యాక్ అయిందని, భద్రతా లోపాలున్నాయని చెప్పి నమ్మించేవారు. సాంకేతిక సేవలను అందించేందుకు కొంత రుసుము చెల్లించాలని చెప్పి మొబైల్‌కు లింక్‌లు పంపించి బ్యాంకు అకౌంట్లు ఖాళీ చేసేవారు. గిఫ్ట్ కార్డుల రూపంలో ఆస్ట్రేలియా బ్యాంకు ఖాతాలకు సొమ్మును బదిలీ చేయించుకునేవారు.
కొన్ని సందర్భాల్లో బాధితుల సెల్‌ఫోన్‌లో ఎనీ డెస్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి, దాని ద్వారా బ్యాంకు ఖాతా వివరాలను తస్కరించి ఖాతా ఖాళీ చేసేవారు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌లో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు.
పరారీలో ఉన్న రామకృష్ణా రెడ్డి, ఆకాశ్, వెస్లీల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 13 కంప్యూటర్లు, సీపీయూలు, హెడ్ సెట్లు, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, మెమొరీ కార్డు, సిమ్ కార్డులు, సెల్‌ఫోన్లు, చేతి గడియారాలు, కారు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment