వరంగల్ జిల్లాలో పరువు హత్య
కేసముద్రం, న్యూస్‌లైన్: కూతురి ప్రేమవ్యవహారం ఇంటి పరువు తీస్తుందని భావించిన ఓతండ్రి ఆమెను కడతేర్చాడు. వరంగల్ జిల్లా కేసముద్రం మండల సీఐ వాసాల సతీష్ కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం సర్నేనిగూడెంకు చెందిన నర్ర సత్యం, జయ దంపతులు బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం కేసముద్రం మండల కేంద్రానికి వచ్చారు. అద్దె ఇంట్లో ఉంటూ, కంప్రెషర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కాగా, పెద్ద కుమార్తెకు పెళ్లయింది. చిన్నకుమార్తె మహేశ్వరి (17) పదో తరగతి చదువు తుండగా ఓ యువకుడి ప్రేమలో పడింది. గమనించిన తండ్రి ఆమెను మందలించి, హన్మకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో చేర్పించాడు.
కొద్దిరోజుల తర్వాత కూతురి సెల్‌ఫోన్‌కు ఆ యువకుడు మేసేజీలు రావడం చూసి, ఆమెను ఇంటికి తీసుకొచ్చి, మరోసారి గట్టిగా మందలించాడు. ఆమె వినిపించుకున్నట్లు కనిపించలేదు. దీంతో కూతురి ప్రేమ వ్యవహారంతో ఇంటిపరువు పోతుందని భావించిన సత్యం బుధవారం రాత్రి నిద్రిస్తున్న కూతురి మెడకు చున్నీ బిగించి చంపాడు. చున్నీని మెడకు గట్టిగా చుట్టి, దానికి మరో చున్నీని ముడివేసి మంచం కోడుపై భాగాన కట్టి ఉరివేసుకున్నట్లు చిత్రీకరించాడు. గురువారం వేకువజామున మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు బయటకు పొక్కడంతో మహబూబాబాద్ డీఎస్పీ రమాదేవి, రూరల్ సీఐ వాసాల సతీష్, ఎస్సై కరుణాకర్‌లు వచ్చి విచారణ చేపట్టారు. ఇంటి పరువు పోతుందనే తాను ఈ ఘటనకు పాల్పడినట్లు మహేశ్వరి తండ్రి సత్యం పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.