మల్లూ శిరీష్ అనిపించుకుంటాడా?
అల్లు అర్జున్‌కి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. అక్కడివాళ్లు ‘మల్లూ అర్జున్’ అని పిల్చుకుంటారు. ఇప్పుడు బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ మలయాళ ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. అయితే అన్నయ్యలా అనువాద చిత్రాల ద్వారా కాదు.. స్ట్రైట్ సినిమాతో. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, శిరీష్ కాంబినేషన్లో ‘1971 బియాండ్ బోర్డర్స్’ టైటిల్‌తో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో మోహన్‌లాల్ హీరో కాగా, ట్యాంక్ కమాండర్‌గా శిరీష్ కీలక పాత్ర చేయనున్నారు. మేజర్ రవి దర్శకుడు.
అల్లు శిరీష్ మాట్లాడుతూ - ‘‘మలయాళ తెరకు పరిచయం కావడానికి ఇది సరైన సబ్జెక్ట్. ఇందులో ట్యాంక్ కమాండర్‌గా ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ రోల్ చేస్తున్నా. పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా సాగే చిత్రం కాదిది. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉంటుంది. మోహన్‌లాల్ వంటి స్టార్‌తో కలసి నటించే అవకాశం రావడం నా లక్. త్వరలో షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు. అల్లు అర్జున్‌ని ఆదరించి, ‘మల్లూ అర్జున్’ అని అభిమానంగా పిల్చుకుంటున్న మలయాళ ప్రేక్షకులతో శిరీష్ కూడా ‘మల్లూ శిరీష్’ అనిపించుకోగలుగుతాడా? వెయిట్ అండ్ సీ.