కనీస వేతనాలతోనే కార్మికుల మనుగడ
ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి
బీజేపీ, టీడీపీలపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరా ధ్వజం
తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
రాజమహేంద్రవరం సిటీ :
కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికుల కడుపు కొడుతున్నారని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలతో కార్మికుల జీవనం ఇబ్బందికరంగా తయారైందని వారికి కనీస వేతనాలు అందించేందుకు మోడీ ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన అన్నరు. ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీలో ఐఎన్టీయూసీ జిల్లా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి కలసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ విదేశీ వ్యాపారులను మోడీ దేశంలోనికి ఆహ్వానించడం ద్వారా కార్మికులను మరింత పేదవాళ్లను చేస్తున్నారన్నారు. బీజేపీ ధనవంతులు, వ్యాపారులకు అండగా మారిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల సమస్యల కోసం అన్ని కార్మిక సంఘాలతో కలసి సెప్టెంబరు 2న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నామన్నారు. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్టు సంజీవరెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్ .రఘువీరారెడ్డి మాట్లాడుతూ బీజేపీ, టీడీపీలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. కార్మికులకు అండగా కాంగ్రెస్ ఉంటుందని, ఆ మేరకు నిరంతరాయంగా కృషి చేస్తుందన్నారు. వీరి పాలనలో పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నారన్నారు. రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. మాజీ మంత్రి పల్లం రాజు, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, సుంకర పద్మశ్రీ, పంతం నానాజీ, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబే అసలైన ద్రోహి : రఘువీరారెడ్డి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబే అసలైన ద్రోహి అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఐఎన్టీయూసీ జిల్లా కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రధాని మోదీ పాదాల వద్ద మోకరిల్లారన్నారు. ప్రత్యేక హోదావిషయంలో చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవిని కాదని ఆయన నైజం బైటపెట్టుకున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధనకు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేక బిల్లుకు మద్దతు ఇచ్చి హోదాకు అనుకూలంగా ఓటు వేయాలని రఘువీరారెడ్డి కోరారు.