inugala peddireddy
-
బీఆర్ఎస్కు పెద్దిరెడ్డి రాజీనామా
హుజూరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, రెండుసార్లు మంత్రిగా, కార్మిక సంఘ నేతగా సేవలందించిన ఇనుగాల పెద్దిరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గురువారం లేఖ రాశారు. 2021 జూలై 27న తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో పెద్దిరెడ్డి బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ తనను పార్టీ పరిగణనలోకి తీసుకోకపోవడం, ఇటీవల కరీంనగర్లో నిర్వహించిన కదనభేరి సభకు ఆహ్వానించనందుకు మనస్తాపంతో పార్టీకి రాజీ నామా చేస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులు, ప్రజాభీష్టం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పెద్దిరెడ్డి వెల్లడించారు. -
ఈ నెల 16న కారెక్కనున్న కౌశిక్ రెడ్డి.. ఆయనతోపాటు మరొకరు?
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ కేంద్రంగా కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆది, సోమవారాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఊహించని మలుపులు తిరిగాయి. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ సంభాషణలు లీక్ అయిన వెంటనే వేగంగా పావులు కదిలాయి. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించుకోవడం జరిగిపోయింది. ఈ నెల 16న హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఇటీవల టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలంగాణ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ సోమవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే. లక్ష్మికాంతారావుతో పెద్దిరెడ్డి భేటీ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పెద్దిరెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందగా, వయో భారంతో కెప్టెన్ పరామర్శకు వెళ్లలేదు. ఆదివారం పెద్దకర్మ ముగిసిన నేపథ్యంలో సోమవారం పెద్దిరెడ్డి స్వయంగా కెప్టెన్ ఇంటికి వెళ్లి 2 గంటల పాటు సమావేశమయ్యారు. హుజూరాబాద్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన పెద్దిరెడ్డి బీజేపీ తరఫున ఈసారి పోటీ చేయాలని భావించారు. ఈటల బీజేపీలో చేరడంతో ఆ అవకాశం కోల్పోయిన ఆయన బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పటి నుంచి అంటీ ముంటనట్టుగానే బీజేపీతో ఉన్న పెద్దిరెడ్డి త్వరలోనే టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేసీఆర్‌తో గతంలో ఉన్న పరిచయాలు, తాజాగా సహచరుడు ఎల్.రమణ టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో పెద్దిరెడ్డి కూడా కారెక్కడం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై ‘సాక్షి’ ఆయనను సంప్రదించగా.. ఇప్పటివరకు తనను టీఆర్ఎస్లోకి ఎవరూ ఆహ్వానించలేదని, పిలుపొస్తే ఆలోచిస్తానని అన్నారు. -
టీడీపీని ఖాళీ చేయడమే టీఆర్ఎస్ లక్ష్యం
టీడీపీ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయటమే లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శుక్రవారం మాట్లాడుతూ ఎర్రబెల్లి వ్యాఖ్యలతో టీఆర్ఎస్ కుట్రపూరిత వైఖరి బయటపడిందన్నారు. తెరాస ప్రత్యర్థి పార్టీల నేతలను ఒత్తిళ్లకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటోందని విమర్శించారు. టీఆర్ఎస్లో ఎర్రబెల్లి చేరికపై మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానంటున్న ఎర్రబెల్లి పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు పార్టీ మారలేదని ప్రశ్నించారు. -
ముచ్చటగా ముగ్గురు
సాక్షి, కరీంనగర్ : ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ మూడు నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించింది. రామగుండం, వేములవాడ, కోరుట్ల నియోజకవర్గాల ఇన్చార్జీలను నియమిస్తున్నట్టు సోమవారం పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ ప్రకటించింది. తెలంగాణ అంశంలో ద్వంద్వ వైఖరి అనుసరించడంతో జిల్లాలో కుదేలయిన పార్టీని పునర్నిర్మించేందుకు, ఎన్నికల నేపథ్యంలో క్యాడర్‌ను కాపాడుకునేందుకు సంస్థాగత వ్యవహారాలపై అధినేత చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర సందర్భంగానే నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించారు. బలహీనంగా ఉన్నచోట్ల పార్టీని బలోపేతం చేయాలని, పనితీరు మెరుగుపర్చుకోకుం టే ఇన్చార్జీలను మార్చకతప్పదని హెచ్చరించారు. గతనెలలో సంస్థాగత మార్పులు చేర్పులపై కసరత్తు చేపట్టారు. కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జీల మార్పుపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో జిల్లా నాయకులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపారు. నవంబర్ రెండవ వారంలో మూడురోజుల పాటు ఇన్చార్జీల నియామకాలపై జిల్లా నేతలతో భేటీ అయిన చంద్రబాబు స్థానిక నాయకత్వం అభ్యంతరాలతో నిర్ణయం తీసుకోలేకపోయారు. నవంబర్ 16న ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జిగా మద్దెల రవీందర్‌ను మాత్రమే ప్రకటించి మిగిలిన నియోజకవర్గాలపై నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా సోమవారం మూడు సెగ్మెంట్లకు కొత్త నేతలను ప్రకటించారు. రామగుండం నియోజకవర్గ ఇన్చార్జిగా గోపు అయిలయ్యయాదవ్ స్థానంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డిని నియమించారు. వెనుకబడిన తరగతులకు చెందిన ఐలయ్యయాదవ్ను తొలగించడం పట్ల వ్యతిరేకత వస్తోంది. పెద్దిరెడ్డి హుస్నాబాద్ నుంచి అసెంబ్లీకి గానీ, కరీంనగర్ లోకసభ స్థానం నుంచి గానీ పోటీ చేస్తారన్న ప్రచారం మొన్నటివరకు జరిగింది. రామగుండంలో కార్మిక నాయకుడిగా గుర్తింపు ఉన్న పెద్దిరెడ్డిని అక్కడ నుంచి బరిలోకి దింపితే కలిసొస్తుందన్న ఆశతో ఇక్కడ ఇన్చార్జి మార్పు జరిగినట్టు చెప్తున్నారు. కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథంను అనారోగ్య కారణాల వల్ల మార్చారు. తన కుమారుడికే అవకాశం ఇవ్వాలని విశ్వనాథం కోరినప్పటికీ చంద్రబాబు సాంబారి ప్రభాకర్‌కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అయితే గత రెండు ఎన్నికల్లో శికారి విశ్వనాథం ఓడిపోవడం వల్లే ఆయనను ఇన్చార్జి పదవి నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జిగా గండ్ర నళిని తప్పించి మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్‌రావుకు పగ్గాలు అప్పగించారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సిహెచ్.రమేశ్‌బాబు ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన స్థానంలో గండ్ర వెంకటేశ్వర్రావుకు బాధ్యతలు అప్పగించారు. కొంతకాలానికే వెంకటేశ్వర్రావు మృతి చెందగా, ఆయన భార్య నళినిని ఇన్చార్జిగా నియమించారు. వేములవాడ బాధ్యతల నుంచి తనను తప్పించవద్దని గండ్ర నళిని కోరినా ఫలితం లేకపోయింది. చెన్నాడి సుధాకర్‌రావు పార్టీ మారేందుకు యోచిస్తున్నారని గతంలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనను ఇన్చార్జిగా నియమించినట్టు భావిస్తున్నారు. కరీంనగర్‌పై వీడని సందిగ్ధం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి నియామకంపై ప్రతిష్టంభన వీడలేదు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీని వీడినప్పటినుంచి ఇక్కడ ఇన్చార్జి లేరు. స్థానిక నేతల్లో నుంచే ఇన్చార్జిని నియమించాలని, బయటి వారిని బలవంతంగా రుద్దవద్దన్న డిమాండ్ బలంగా ఉంది. వేములవాడ ఇన్చార్జిగా ఉన్న గండ్ర నళినికి కరీంనగర్ బాధ్యతలు ఇవ్వాలని భావించినా ఆమె సుముఖంగా లేకపోవడం, స్థానిక నేతల నుంచి వ్యతిరేకత కారణంగా నిర్ణయం తీసుకోలేకపోయారు.