
హుజూరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, రెండుసార్లు మంత్రిగా, కార్మిక సంఘ నేతగా సేవలందించిన ఇనుగాల పెద్దిరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు గురువారం లేఖ రాశారు. 2021 జూలై 27న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో పెద్దిరెడ్డి బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు.
2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ తనను పార్టీ పరిగణనలోకి తీసుకోకపోవడం, ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన కదనభేరి సభకు ఆహ్వానించనందుకు మనస్తాపంతో పార్టీకి రాజీ నామా చేస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులు, ప్రజాభీష్టం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పెద్దిరెడ్డి వెల్లడించారు.