గణతంత్రానికి సిద్ధం
సాక్షి, ముంబై: గణతంత్ర దినోత్సవాల కోసం ముంబైతోపాటు రాష్ట్రం ముస్తాబైంది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం జాతీయ పతాకావిష్కరణ అనంతరం కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. పలుప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
తెలుగు సంఘాల ఆధ్వర్యంలో...
ముంబైతోపాటు రాష్ట్రంలోని తెలుగు సంఘాలు ప్రతిసారిలాగే ఈసారి కూడా గణతంత్ర దినోత్సవాలకు సిద్ధమయ్యాయి. ఆంధ్రమహాసభ, తెలుగు కళాసమితితోపాటు పద్మశాలి, మున్నూర్కాపు, తెలంగాణ , దళిత సంఘాలు ఇలా అనేక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జాతీయ పతాకావిష్కరణ జరగనుంది. అనంతరం వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యంగా ముంబైతోపాటు ఠాణే, నవీముంబై, భివండీ, పుణే, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు కొన్నేళ్లుగా ఈ గణతంత్ర దినోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా అదే ఉత్సాహంతో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలతోపాటు వివిధ సాంసృ్కతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
భారీ భద్రత...
గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా అన్ని ప్రాంతాలపై నిఘా వేయడంతోపాటు నాకాబందీ నిర్వహించి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.