విచారణ పారదర్శకంగా ఉండాలి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఓటరు దరఖాస్తు విచారణను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. దరఖాస్తుల విచారణలో ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా నిర్వహించాలన్నారు. ఈ నెల 13వ తేదీలోపు విచారణ పూర్తిచేసి, 16వ తేదీలోగా తుది జాబితా ప్రకటించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు 30 నుంచి 40 మంది పరిశీలకులను పంపించనున్నట్లు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు మార్పులు, చేర్పులకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 18శాతం మాత్రమే విచారణ చేశారని, మిగిలిన 82 శాతం వేగవంతంగా చేయాలని ఆదేశించారు.
ఒక్కో జిల్లాలో దాదాపు 80 నుంచి 90 వేల దరకాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. మైనర్లు, స్థానికంగా నివాసం లేనివారి దరఖాస్తుల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. జనాభా లెక్కలు, స్త్రీ పురుష నిష్పత్తులను ఆధారం చేసుకొని ఓటర్ల జాబితాలు ఉన్నాయో లోవో పరిశీలించాలన్నారు. విచారణ సమయంలో దరఖాస్తుదారులు ఉన్న పక్షంలో ఆధారాలు, పత్రాలు వంటి వాటి విషయంలో సడలింపు ధోరణిలో వ్యవహరించాలని సూచించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచేందుకు ప్రతి జిల్లాలో చేపట్టిన గోదాముల నిర్మాణాన్ని ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల ఖాళీలు ఉంటే వెంటనే భర్తీ చేయాలని భన్వర్‌లాల్ ఆదేశించారు.
అద్దంకి ఘటనను ప్రస్తావించిన భన్వర్‌లాల్
ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘర్షణ సంఘటనను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన ఓటర్ల నమోదు ప్రక్రియకు లక్షా 58 వేల 380 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో 31శాతం దరఖాస్తులను ఇప్పటివరకు విచారించినట్లు తెలిపారు. మిగిలిన దరఖాస్తుల విచారణను ఈ నెల 10వ తేదీలోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఒంగోలులో ఓట్ల నమోదుపై వివిధ రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదులపై రెండుసార్లు విచారణ నిర్వహించినట్లు తెలిపారు.
డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారి ఓట్ల విషయంలో ఫిర్యాదుల్లో పేర్కొన్న సంఖ్యకు, విచారణలో తేలిన సంఖ్యకు పెద్దగా తేడా లేదన్నారు. ఇళ్లు మారిన విషయంలో మాత్రం 1500 తేడా ఉన్నట్లు వివరించారు. కనిగిరి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కొన్ని ఫిర్యాదులు ఉన్నాయని, వాటిని ఈ నెల 13వ తేదీలోపు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ స్థానాలు ఖాళీగా ఉండటంతో అక్కడ ఇన్చార్జిలను నియమించినట్లు వివరించారు. జిల్లాలో గోదాముల నిర్మాణానికి 1.42 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రతిపాదనలు పంపించగా, 1.22 కోట్ల రూపాయలు విడుదల చేశారని, మొత్తం నగదు డిపాజిట్ చేస్తేనే పనులు ప్రారంభిస్తామని గృహనిర్మాణశాఖ అధికారులు తెలిపారన్నారు. మిగిలిన * 20 లక్షలు మంజూరు చేస్తే పనులు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, ఒంగోలు కందుకూరు ఆర్డీఓలు ఎంఎస్ మురళి, టి.బాపిరెడ్డి, హెచ్-సెక్షన్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, అన్ని నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు పాల్గొన్నారు.