భారత్ ఐటీలో ఇన్వెస్ట్ చేయండి..
బెల్జియం ఇన్వెస్టర్లకు ప్రధాని మోదీ ఆహ్వానం
బ్రసెల్స్: భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని బెల్జియం వ్యాపార దిగ్గజాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. వజ్రాల వర్తకం రూపంలో చిరకాలంగా ఇరు దేశాల మధ్య వ్యాపార బంధాలున్నాయని బెల్జియం సీఈవోల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వజ్రాల పరిశ్రమ భారత్లో అనేక మందికి ఉపాధి కల్పిస్తోందని మోదీ చెప్పారు. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ మైక్రోబ్లాగింగ్ సైటు ట్వీటర్ ద్వారా ఈ విషయాలు తెలిపారు. రఫ్ డైమండ్ల వ్యాపారంలో దాదాపు 84 శాతం బెల్జియంలోని యాంట్వెర్ప్ నగరంలోనే జరుగుతుంది. టర్నోవరు 54 బిలియన్ డాలర్ల పైగా ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల వ్యాపార కేంద్రమైన యాంట్వెర్ప్లో భారత ట్రేడర్ల సంఖ్య గణనీయంగా ఉంది. మరోవైపు, ఇరు దేశాలు పునరుత్పాదక ఇంధనాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఖగోళ పరిశోధనలు, ఐటీ, పర్యాటకం, బయోటెక్నాలజీ, షిప్పింగ్, పోర్టులు తదితర పరిశ్రమల్లో పరస్పరం సహకరించుకోవాలని మోదీ సూచించారు. బెల్జియంతో భారత్కు ‘రక్త సంబంధాలు’ కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. వందేళ్ల క్రితం బెల్జియంలో 1,30,000 మంది భారతీయ సైనికులు పోరాడారని, దాదాపు 9,000 మంది ప్రాణత్యాగాలు చేశారని మోదీ గుర్తు చేశారు.