ఒడిదుడుకులు కొనసాగుతాయ్!
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకుల ధోరణి కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో తీవ్ర హెచ్చుతగ్గులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోపక్క, సంవత్సరాంతం కారణంగా ఇన్వెస్టర్ల పొజిషన్లు తక్కువగానే ఉండే అవకాశం ఉండటంతో మార్కెట్లు అక్కడక్కడే కదలాడొచ్చని(సైడ్‌వేస్) కూడా భావిస్తున్నారు. ‘గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ట్రేడర్ల రోలోవర్ల ప్రభావంతో ఒడిదుడుకులు ఉండొచ్చు.
వాస్తవానికి కొత్త సంవత్సరం ముందు గ్లోబల్ మార్కెట్లలో పెద్దగా కదలికలు ఉండవు. అయితే, మన మార్కెట్లలో మాత్రం డెరివేటివ్స్ క్లోజింగ్ వల్ల భారీ హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉంది’ అని ట్రేడ్‌స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. చాలావరకూ సంస్థాగత ఇన్వెస్టర్లు సంవత్సరాంత సెలవుల్లో ఉండటంతో ట్రేడింగ్ పరిమాణం చాలా స్వల్పంగా ఉంటుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధర హెచ్చుతగ్గులు.. ఈ వారంలో మన మార్కెట్ ట్రెండ్‌కు దిశానిర్ధేశం చేస్తాయని సింఘానియా చెప్పారు.మార్కెట్లు పుంజుకోవడానికి తగిన కీలక ట్రిగ్గర్స్ కోసం వేచిచూస్తున్నాయని.. అయితే, ఏడాది చివరి రోజుల కారణంగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ముందుకొచ్చే అవకాశాల్లేవని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ వ్యాఖ్యానించారు. దీంతో మార్కెట్లు స్వల్ప శ్రేణిలో కదలికలకే పరిమితం కావచ్చనేది ఆయన అంచనా.
ప్రభుత్వం సంస్కరణల విషయంలో చురుగ్గా వ్యవహరిస్తుండటంతో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) సెంటిమెంట్ మళ్లీ మెరుగవనుందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ పేర్కొన్నారు. దీంతో వచ్చే ఏడాది భారత్ స్టాక్ మార్కెట్లు పురోగమించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుత డిసెంబర్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ.6,537 కోట్ల మేర నికర విక్రయాలు జరిపారు.
గతవారం మార్కెట్...
గత వారంలో దేశీ మార్కెట్లు లాభాలను నమోదుచేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 319 పాయింట్లు ఎగబాకి రూ.25,839 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ కూడా 99 పాయింట్లు ఎగసి రూ.7,861 వద్ద స్థిరపడింది.