‘ఇన్విజిలేషన్ జాబితా మార్పు’పై విచారణ
వీరఘట్టం: వీరఘట్టం జిల్లా పరిషత్ బాలుర, బాలికోన్నత పాఠశాలల పరీక్ష కేంద్రాల్లో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల కోసం ఎంఈఓ పంపించిన ఇన్విజిలేషన్ జాబితాను ఎవరు మార్చారో, అక్రమ నియామకాలు ఎవరు చేశారో త్వరితగతిన గుర్తించాలని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి జిల్లా విద్యా శా ఖను ఆదేశించారు. దీంతో ఈ అక్రమాలను బయటపెట్టేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు మంగళవారం పాలకొండ ఉపవిద్యాశాఖ కార్యాలయ సిబ్బందిని శ్రీకాకుళంలో విచారించారు. వీరఘట్టం ఎంఈఓ సుబ్రహ్మణ్యం పాలకొండకు పంపించిన జాబితాను, పాలకొండ ఉపవి ద్యాశాఖ కార్యాలయంలో రూపొందించిన కొత్త జాబితాను త్రిసభ్య కమిటీ క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే వీరికి కూడా పలు ప్రశ్నలతో కూడిన ప్రశ్న పత్రాన్ని ఇచ్చారు. అనంతరం వీరిని విడివిడిగా విచారించారు.
వీరఘట్టంలోని పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్ ప్ర క్రియ చిలిచిలికి గాలివానలా మారింది. ఇన్విజిలేషన్ నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ చాలా సీరియస్‌గా ఉన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేందుకు ఇప్పటికే త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ఈ నెల 24న వీరఘట్టంలో 26 మంది ఉపాధ్యాయులను విచారించిన విషయం తెలిసిందే. తాజాగా డైట్ ప్రిన్సిపాల్ ఎన్.తిరుపతిరావు, ఆర్.ఎం.ఎస్. ఎ ఉపవిద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి, సోంపేట సీనియర్ ప్రధానోపాధ్యాయుడు టి.జోగారావుతో కూడిన త్రిసభ్య కమిటీ పాలకొండ ఉపవిద్యాశాఖ కార్యాలయ సిబ్బందిని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విచారించడంతో పైరవీలు చేయించినవారిలో ఆందోళన మొదలైంది.
జాబితా ఎలా కుదించారు?
వీరఘట్టంలో ఉన్న ఐదు పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేషన్ కోసం మండలం నుంచి 50 మంది జాబితాను మండల విద్యాశాఖాధికారి పాలకొండ ఉపవిద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. అయితే ఈ జాబితాను పక్కన పెట్టి ఇంటర్మీడియట్ ఇన్విజిలేషన్‌లో ఉన్న వారికి కూడా టెన్త్ ఇన్విజిలేషన్ వేయడం, పరీక్షా కేంద్రాలకు దగ్గరలో ఉన్న ఎస్టీటీలను వేయాల్సి ఉన్నప్పటికీ దూరప్రాంతాల్లో ఉన్న పాఠశాల సిబ్బందిని నియమిస్తూ ఎంఈఓ పంపించిన జాబితాను కుదించారు.
పైరవీలు చేసేందుకా..?
పదో తరగతి ఇన్విజిలేషన్‌లో పైరవీలు చేసేందుకే కొంత మంది ఉపాధ్యాయులు ఇన్విజిలేషన్ వేయించుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని వల్ల తెలివైన విద్యార్థులు నష్టపోతున్నారని, ఏటా కొంత మంది ఉపాధ్యాయులు బయట వ్యక్తులతో బేరాలు కుదుర్చుకుని పదో తరగతి ఇన్విజిలేషన్‌లో నేరుగా మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తున్నారని, ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
వాస్తవానికి ఈ నియామకాలన్నీ పాలకొండ ఉపవిధ్యాశాఖ కార్యాలయం కేంద్రంగా జరిగాయని, ఓ ఉద్యోగి అసంబద్ధంగా ఇన్విజిలేషన్‌లు వేశారంటూ పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పరీక్షల్లో పైరవీలు చేసేందుకే పలువురు పట్టుబట్టి ఇన్విజిలేషన్ బాధ్యతలు చేపడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
కఠిన చర్యలు తీసుకుంటాం
త్రిసభ్య కమిటీ విచారణ రెండు రోజుల్లో పూర్తి కానుంది. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఎంఈఓ వాంగ్మూలం, త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదికలు పరిశీలిస్తాం. అక్రమాలు నిజమేనని తేలితే కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.– ఎం.సాయిరాం,జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీకాకుళం