ఎంసీఏ లేఖపై నేడు నిర్ణయం
ముంబై: ఐపీఎల్-7 ఫైనల్ మ్యాచ్ వేదికను వాంఖడే స్టేడియం నుంచి తరలించ డాన్ని నిరసిస్తూ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) రాసిన లేఖపై లీగ్ పాలక మండలి నేడు (మంగళవారం) నిర్ణయం తీసుకోనుంది. ‘సోమవారం మా మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఫైనల్ వేదికను బెంగళూరుకు మార్చడాన్ని సభ్యులు వ్యతిరేకించారు. ఈ విషయంపై బీసీసీఐతో పాటు ఐపీఎల్ పాలకమండలితో టచ్లో ఉన్నాం.
బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ కూడా మా లేఖపై చర్చించి తుది విషయం నేడు చెబుతామని అన్నారు. ఎంసీఏకు అనుకూలంగానే అంతా జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని కమిటీకి అధ్యక్షత వహించిన ఎంసీఏ ఉపాధ్యక్షుడు రవి సావంత్ తెలిపారు. జూన్ 1న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ను ఎలాంటి కారణాలు చూపకుండానే ముంబై నుంచి బెంగళూరుకు తరలిస్తూ శనివారం ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.