IPL Broadcasting
-
ఐపీఎల్ 2022 ప్రారంభ తేదీలో మార్పు.. ధనాధన్ లీగ్ ఎప్పటి నుంచి అంటే..?
ఈ ఏడాది క్రికెట్ పండుగ ఐపీఎల్ 2022 బీసీసీఐ ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ఓ రోజు ముందుగానే ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌ను మార్చి 27న మొదలుపెట్టాలని బీసీసీఐ భావించినప్పటికీ.. లీగ్ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా కోరిక మేరకు ఒక రోజు ముందుగానే (మార్చి 26) లీగ్‌ను ప్రారంభించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. మార్చి 26వ తేదీ (శనివారం) లీగ్‌ను ప్రారంభిస్తే తర్వాతి రోజయిన ఆదివారం డబుల్ హెడర్(రెండు మ్యాచ్‌లు) జరిపే వీలుంటుందని స్టార్ ఇండియా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. ఈ విషయానికి సంబంధించి మరో రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సదరు అధికారి పేర్కొన్నారు. అదే రోజు లీగ్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, లీగ్‌ను కొత్త ప్రతిపాదిత తేదీలో ప్రారంభిస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు మరి కొన్ని మ్యాచ్‌లు మిస్ అవ్వాల్సి ఉంటుంది. పాక్ పర్యటన నేపథ్యంలో ఆస్ట్రేలియా.. ద్వైపాక్షిక సిరీస్ నేపథ్యంలో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లకు చెందిన ఆటగాళ్లు లీగ్‌లో ఓ వారం ఆలస్యంగా జాయిన్ అవుతారు. కొత్త ప్రారంభ తేదీ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు ఏప్రిల్ 6 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌కు అందుబాటులోకి రానున్నారు. చదవండి: ఐపీఎల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే! -
అఫ్గాన్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం.. మహిళలే కారణమట..!
Taliban Bans IPL Broadcast: అఫ్గాన్‌లో తాలిబన్ల వికృత చేష్టలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దీంతో సాధారణ జనజీవనం దుర్భరంగా మారింది. రెండోసారి అధికారం చేజిక్కించుకున్నాక తాము మారిపోయామంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన తాలిబన్ ముష్కరులు గతానికి మించి క్రూరంగా తయారయ్యారు. మహిళలకు సంబంధించి రోజుకో ఫత్వా జారీ చేస్తూ.. ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నారు. క్రీడలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవంటూనే మహిళల పేర్లు చెప్పి తమదైన మార్కు రాక్షస పాలన అమలు చేస్తున్నారు. తాజాగా మహిళల అశ్లీలతను సాకుగా చూపి ప్రపంచ క్రికెట్ పండుగ అయిన ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)పై నిషేధం విధించారు. స్టేడియాల్లో మహిళా ప్రేక్షకులు ఉంటున్నారని, అక్కడ మహిళలు డ్యాన్స్ చేస్తున్నారని, ఇది తమ ఆచారాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అందుచేతనే ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ తాలిబన్(ఆఫ్గానిస్తాన్)లో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు అఫ్గాన్‌లో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్స్‌ను గట్టిగా హెచ్చరించారు. కాగా, అఫ్గానిస్తాన్ స్టార్ ఆటగాళ్లు రషీద్‌ఖాన్, నబీ సహా పలువురు అఫ్గాన్ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడుతున్నారు. తాలిబన్ల తాజా నిర్ణయం పట్ల వీరు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాలిబన్ల పాలనలో అనేక వినోద కార్యక్రమాలపై ఆంక్షలు అమల్లో ఉండగా, తాజాగా ఈ జాబితాలో ఐపీఎల్ కూడా చేరింది. చదవండి: IPL 2021 2nd Phase: అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆటగాళ్లు వీరే -
ఐపీఎల్ వేలంపై సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వచ్చే ఐదేళ్ల కాలానికి టెలివిజన్, డిజిటల్ రైట్స్‌ను భారీ మోత్తానికి స్టార్ ఇండియా సంస్థ సొంతం చేసుకుంది. అయితే స్టార్ ఇండియాకు ఐపీఎల్ మీడియా హక్కులు రావడంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు. సోమవారం నిర్వహించిన వేలంలో రూ. 16 వేల 347.50 కోట్ల భారీ మొత్తానికి స్టార్ ఇండియా సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకోగా.. ఆ సంస్థకు మీడియా హక్కులు రావడంలో బీసీసీఐతో పాటు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా హస్తముందని.. అందుకుగానూ ఆయన రూ. 100 కోట్లు అందుకోనున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇంటర్నల్ ఆర్బిటరీ అప్లికేషన్ రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం నిర్వహించిన వేలంలో నిబంధనల ప్రకారం సీల్డ్ కవర్లో అత్యధిక బిడ్ వేసిన గ్రూప్‌నకు బీసీసీఐ హక్కులను కేటాయించింది. ఉపఖండంలో టెలివిజన్ హక్కుల కోసం స్టార్‌తో పోటీ పడిన సోనీ సంస్థ ఈసారి అవకాశం కోల్పోయింది. కొత్త ఒప్పందం ప్రకారం 2018 నుంచి 2022 వరకు స్టార్‌కు ఈ హక్కులుంటాయి. 2008లో తొలి ఐపీఎల్ సమయంలో పదేళ్ల కాలానికి హక్కులను వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ దాదాపు రూ. 8,200 కోట్లు సొంతం చేసుకుంది. మరుసటి ఏడాది తొమ్మిదేళ్ల కాలానికి సోనీ గ్రూప్‌నకు 1.63 బిలియన్ డాలర్లకు అమ్మేసింది. ఐపీఎల్ బిడ్‌లో అసలేం జరిగింది.. మొత్తం ఏడు కేటగిరీల్లో ఐపీఎల్ హక్కుల కోసం బీసీసీఐ బిడ్లను ఆహ్వానించింది. మొత్తం 24 కంపెనీలు బిడ్ డాక్యుమెంట్‌ను కొనుగోలు చేసినా.. చివరకు 14 కంపెనీలే వేలంలో పాల్గొన్నాయి. భారత్‌లో టీవీ హక్కుల కోసం స్టార్ రూ. 6,196.94 కోట్లతో బిడ్ వేయగా, సోనీ రూ. 11,050 కోట్లతో బిడ్ చేసి ముందంజలో నిలిచింది. అయితే డిజిటల్ హక్కుల కోసం రూ. 1,443 కోట్లతో పాటు మిగతా ఐదు కేటగిరీ (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రెస్టాఫ్ వరల్డ్, మధ్యప్రాచ్యం, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, అమెరికా)లకు కూడా స్టార్ బిడ్ వేయగా... సోనీ మాత్రం మరే ఇతర కేటగిరీలోకి అడుగే పెట్టలేదు. ఓవరాల్‌గా గ్లోబల్ బిడ్‌కే హక్కులు కేటాయించాల్సి రావడంతో స్టార్ ఇండియా ఐపీఎల్ హక్కులు దక్కించుకుంది.