ఈ ఏడాది క్రికెట్ పండుగ ఐపీఎల్ 2022 బీసీసీఐ ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ఓ రోజు ముందుగానే ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌ను మార్చి 27న మొదలుపెట్టాలని బీసీసీఐ భావించినప్పటికీ.. లీగ్ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా కోరిక మేరకు ఒక రోజు ముందుగానే (మార్చి 26) లీగ్‌ను ప్రారంభించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.
మార్చి 26వ తేదీ (శనివారం) లీగ్‌ను ప్రారంభిస్తే తర్వాతి రోజయిన ఆదివారం డబుల్ హెడర్(రెండు మ్యాచ్‌లు) జరిపే వీలుంటుందని స్టార్ ఇండియా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. ఈ విషయానికి సంబంధించి మరో రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సదరు అధికారి పేర్కొన్నారు. అదే రోజు లీగ్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, లీగ్‌ను కొత్త ప్రతిపాదిత తేదీలో ప్రారంభిస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు మరి కొన్ని మ్యాచ్‌లు మిస్ అవ్వాల్సి ఉంటుంది. పాక్ పర్యటన నేపథ్యంలో ఆస్ట్రేలియా.. ద్వైపాక్షిక సిరీస్ నేపథ్యంలో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లకు చెందిన ఆటగాళ్లు లీగ్‌లో ఓ వారం ఆలస్యంగా జాయిన్ అవుతారు. కొత్త ప్రారంభ తేదీ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు ఏప్రిల్ 6 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌కు అందుబాటులోకి రానున్నారు.
చదవండి: ఐపీఎల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే!
Comments
Please login to add a commentAdd a comment