సెన్సార్ బోర్డు వర్సెస్ కేంద్రం!
‘మెసెంజర్ ఆఫ్ గాడ్’పై ముదిరిన వివాదం
సెన్సార్ బోర్డు చీఫ్ లీలా శాంసన్ రాజీనామా
న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నటించిన ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ చిత్రం విడుదల వ్యవహారంపై వివాదం ముదురుతోంది. ఈ చిత్రంలో వివాదాస్పద అంశాలు ఉన్నాయంటూ దాని విడుదలకు అనుమతిని కేంద్ర సెన్సార్ బోర్డు నిరాకరించగా ఫిలిం సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్(ఎఫ్‌సీఏటీ) మాత్రం ఆ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వడం దుమారం రేపింది. దీనిపై కలత చెందిన సెన్సార్ బోర్డు చైర్పర్సన్ లీలా శాంసన్ గురువారం రాజీనామా చేయగా శుక్రవారం శాంసన్‌కు మద్దతుగా సెన్సార్ బోర్డు సభ్యురాలు ఐరా భాస్కర్ రాజీనామా చేశారు.
కేంద్రం పరిధిలోని ఎఫ్‌సీఏటీ ఈ చిత్రం విడుదలకు అనుమతివ్వడం సెన్సార్ బోర్డును ఎగతాళి చేయడమేనని శాంసన్ అన్నారు. బోర్డులో ఇటీవలి కాలంలో కొన్ని కేసుల్లో ప్రభుత్వ జోక్యం, ఒత్తిళ్లు, ప్యానెల్ సభ్యులు, అధికారుల అవినీతి వంటి కారణాల వల్ల సెన్సార్ బోర్డు చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు శాంసన్ చెప్పారు. అయితే శాంసన్ ఆరోపణలను సమాచార, ప్రసారశాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ తోసిపుచ్చారు. బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం లేదని, ప్రభుత్వ జోక్యం ఉందంటున్న శాంసన్ అందుకు ఆధారాలు చూపాలన్నారు.
మరోవైపు ఈ వివాదం నడుమ ఈ చిత్రం విడుదల శుక్రవారానికి బదులు ఆదివారానికి వాయిదా పడింది. ఈ చిత్రంలో రామ్ రహీమ్ సింగ్ తనను తాను దేవుడిగా, సిక్కుల గురువుగా చెప్పుకున్నాడంటూ సిక్కు సంఘాలు ఆందోళనకు దిగడంతో పంజాబ్, హరియాణాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రహీమ్ సింగ్ శుక్రవారం గుర్గావ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన చిత్రం ఏ మత వర్గాన్ని లక్ష్యంగా చేసుకోలేదన్నారు. కాగా, సెన్సార్ బోర్డులోని మరో సభ్యురాలు నందిని సర్దేశాయ్ మాట్లాడుతూ సినిమా విడుదలపై 15-30 రోజుల్లో నిర్ణయం తీసుకునే ఎఫ్‌సీఏటీ కేవలం 24 గంటల వ్యవధిలోనే ‘మెసంజర్ ఆఫ్ గాడ్ ’ విడుదలకు అనుమతి ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.