ఈసారి విశ్వసుందరి ఎవరో తెలుసా?
విశ్వసుందరి కిరీటం ఈసారి ఫ్రాన్స్ భామ ఇరిస్ మిథెనరిని వరించింది. మనీలాలో జరిగిన 2016 మిస్ యూనివర్స్ పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. ఇక ఈ పోటీలలో ఫస్ట్ రన్నరప్‌గా హైతీకి చెందిన రక్వెల్ పెలిసీర్, సెకండ్ రన్నరప్‌గా కొలంబియాకు చెందిన ఆండ్రియా తోవర్ నిలిచారు.
మిస్ ఫ్రాన్స్ అయిన 23 ఏళ్ల మిథెనరీ ప్రస్తుతం డెంటల్ సర్జరీలో డిగ్రీ అభ్యసిస్తున్నది. దంతాలు, నోటి శుభ్రత గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాను మిస్ యూనివర్స్ వేదికను ఉపయోగించుకుంటానని పోటీల సందర్భంగా ఆమె పేర్కొన్నది. క్రీడలంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఈ భామ.. ప్రయాణాలు చేయడం, ఫ్రెంచ్ వంటకాలు వండటం తన అభిరుచులని తెలిపింది.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన విశ్వసుందరి పోటీల్లో ఈసారి మిస్ ఇండియా రోష్మిథా హరిముర్తికి నిరాశే ఎదురైంది. బెంగళూరుకు చెందిన ఈ భామ టాప్-13లో కూడా చోటు సంపాదించలేకపోయింది. ఈసారి పోటీలలో మాజీ యూనివర్స్, భారత్‌కు చెందిన సుష్మితా సేన్ న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించడం గమనార్హం.