Irrigated projects
-
విద్యుత్ భారం తగ్గినట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ఎత్తిపోతల పథకాలకు సరఫరా చేసే విద్యుత్ చార్జీలను తగ్గించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)ని కోరాయి. ప్రస్తుతం రూ. 6.40గా ఉన్న యూనిట్ చార్జీని రూ. 4.88కు తగ్గించాలని ప్రతిపాదించాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు డిస్కంలు గత వారం ఈఆర్సీకి విన్నవించాయి. మార్చిలోగా ఈ సిఫారసులను ఈఆర్సీ ఆమోదించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తయితే వాటి నిర్వహణకు ఏటా దాదాపు 12 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం కానుండగా వాటికి ప్రస్తుత చార్జీలే వర్తిస్తే రూ. 13,824 కోట్ల వ్యయం కానుంది. ఒకవేళ చార్జీల తగ్గింపునకు ఈఆర్సీ అనుమతిస్తే చార్జీల వ్యయం ఏకంగా రూ. 3,284 కోట్లు తగ్గి రూ. 10,540 కోట్లకే విద్యుత్ చార్జీల భారం పరిమితం కానుంది. ఏటా పెరుగుతున్న వినియోగం.. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తయిన/కొనసాగుతున్న 19 ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా 58.78 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అందుబాటులోకి తేవడంతోపాటు మరో 8.45 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలు నిర్వహణలోకి వస్తే 11,495 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం కానుంది. అయితే ప్రస్తుతం అలీసాగర్, గుత్పా, ఉదయ సముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశిత ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతోంది. నీటిని తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్ అవసరాలను గుర్తించారు. ప్రస్తుతం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా వీటికై 1,359 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఈ వినియోగం ఈ ఏడాది జూన్–జులై నాటికి 3,331 మెగావాట్లకు పెరగనుండగా 2018–19కల్లా 5,869 మెగావాట్లకు, 2019–20కల్లా 8,369 మెగావాట్లకు, 2020–21కల్లా 10,089, 2021–22కల్లా 11,495 మెగావాట్లకు పెరగనుంది. విద్యుత్ అవసరం పెరుగుతుండటం, దానికి తగట్లే యూనిట్‌కు రూ. 6.40పైసల మేర చెల్లించాల్సి ఉండటంతో నీటిపారుదలశాఖపై విద్యుత్ భారం పెరగనుంది. ఈ నేపథ్యంలో యూనిట్‌పై వసూలు చేస్తున్న చార్జీని రూ. 4.50 పైసలకు తగ్గించాలని డిస్కంలను కోరింది. అయితే దీనిపై ఈఆర్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో డిస్కంలు ఈ మేరకు ఈఆర్సీ ముందు ప్రతిపాదనలు పెట్టాయి. యూనిట్ చార్జీ తగ్గింపు అవసరాన్ని ఈఆర్సీ ముందు బలంగా వాదించేందుకు నీటిపారుదలశాఖ ప్రత్యేకంగా ఓ కన్సల్టెంట్‌ను సైతం నియమిస్తోంది. దీనికితోడు తగ్గింపు అంశంపై ఈఆర్సీ ముందు తొలిసారి పిటిషన్ కూడా దాఖలు చేయనుంది. సాధారణంగా డిస్కంలు చేసిన ప్రతిపాదనలను ఈఆర్సీ యథావిధిగా ఆమోదిస్తుందని, ఆ దృష్ట్యా ప్రస్తుత చార్జీల తగ్గింపు ప్రతిపాదన సైతం ఆమోదం పొందుతుందని విద్యుత్‌శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
దగా బడ్జెట్!
జిల్లాకు తీరని అన్యాయం ► డోన్‌లో మైనింగ్ స్కూల్ఏర్పాటుకు లభించని హామీ ► ప్రాజెక్టులకూ అరకొర కేటాయింపులు ► ప్రతిపాదనలన్నీబుట్టదాఖలే.. ► స్వయంగా సీఎం ఇచ్చిన హామీలకే నిధుల్లేవు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘నేనూ రాయలసీమలో పుట్టినవాడినే. నా శరీరంలోనూ ప్రవహించేది రాయలసీమ రక్తమే. అలాంటిది రాయలసీమకు అన్యాయం చేస్తానా’’ అని ఆవేశంగా మాట్లాడిన సీఎం.. బడ్జెట్లో ఏ మాత్రం కనికరం చూపలేదు. కర్నూలు జిల్లాకు బడ్జెట్లో అడుగడుగునా అన్యాయమే కనిపించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాకు ఇచ్చిన హామీలకూ బడ్జెట్లో దిక్కులేకుండా పోయింది. డోన్‌లో మైనింగ్ స్కూలు ఏర్పాటు చేస్తానని 2014 ఆగస్టు 15న కర్నూలు నగర నడిబొడ్డున హామీ ఇచ్చారు. అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం(2016-17)లో తరగతులు కూడా ప్రారంభిస్తామన్నారు. అయితే, అటు బడ్జెట్ ప్రసంగంలో కానీ.. ఇటుబడ్జెట్ కేటాయింపుల్లో కానీ ఆ మాటే లేకపోయింది. అదేవిధంగా ఈ ఖరీఫ్ సీజనులో జిల్లాలోని ప్రాజెక్టులన్నీ జూన్ నాటికి పూర్తి చేసి నీళ్లు ఇస్తామని గతంలో సీఎం ప్రకటించారు. అయితే, ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులతోనే సరిపెట్టారు. మొత్తంగా ఉర్దూ యూనివర్సిటీకి రూ.20 కోట్లు కేటాయింపు తదితర పైపై పూతలే తప్ప జిల్లాకు బడ్జెట్‌తో ఒరిగిందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టులకు అరకొర విదిలింపులే.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులు, కేటాయింపులకు బడ్జెట్లో ఏ మాత్రం పొంతన లేకపోవడం గమనార్హం. మొత్తం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.190 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వాస్తవానికి ఇది కూడా తక్కువే. ఉన్నతస్థాయి అధికారుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో నామమాత్రంగానే జిల్లా సాగునీటిశాఖ అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. వీటికి కూడా మోక్షం లభించలేదు. ఇందులో గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు రూ.20 కోట్లు, జీడీపీ(గాజులదిన్నె)కి రూ.1.15 కోట్లు, కేసీ కెనాల్ ఆధునికీరణకు రూ.50.94 కోట్లు, తుంగభద్ర దిగువ కాలువ ఆధునీకరణకు రూ.6 కోట్లు, ఎస్ఆర్బీసీకి రూ.56 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనల్లో కోరారు. అయితే, ఎస్ఆర్బీసీకి రూ.43.05 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక కేసీ కెనాల్ ఆధునికీకరణకు రూ.38 కోట్లతో సరిపెట్టారు. బాబూ.. వీటి మాటేమిటి! ఇక డోన్ మైనింగ్ స్కూలుకు ఒక్క పైసా కేటాయించని ప్రభుత్వం.. సీఎం హామీ ఇచ్చిన ఓర్వకల్లు-మిడుతూరు రోడ్డుకు రూ.1.50 కోట్ల కేటాయింపుపైనా బడ్జెట్లో స్పష్టత లేదని తెలుస్తోంది. కేవలం ఉర్దూ యూనివర్సిటీకి రూ.20 కోట్లు కేటాయించారు. అదేవిధంగా కర్నూలు నగరం వెలుపల అవుటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు కూడా అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. అయితే, బడ్జెట్లో వీటికీ మోక్షం లభించలేదు. మొత్తంగా జిల్లాకు హామీ మేరకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేకపోవడం పట్ల జిల్లా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.