కావేరి నీటిలో తమిళనాడు వాటా ఇప్పటికే వదిలాం
మంత్రి ఎంబీ.పాటిల్
దావణగెరె, న్యూస్‌లైన్ : తమిళనాడు వాటా కావేరి నీటిని ఇప్పటికే కర్ణాటక విడుదల చేసిందని, ఈ ఏడాదిలో మళ్లీ నీరు వదలడం సాధ్యం కాదని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి ఎంబీ. పాటిల్ తెలిపారు. ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు మార్గదర్శనం మేరకు ఏటా తమిళనాడుకు కర్ణాటక 192 టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రం బిళిగుండ్లు వద్ద ఉన్న నీటిమాపన కేంద్రం నుంచి 220 టీఎంసీల నీరు విడుదల చేసినందున ఈ ఏడాది తమిళనాడు వాటా కన్నా ఎక్కువ నీటినే వదిలామన్నారు.
అందువల్ల తమిళనాడుకు మళ్లీ నీరు విడుదల చేసే ్రపసక్తే లేదని స్పష్టం చేశారు. జలవనరుల శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది ఇంజనీర్లు, 500 మంది అసిస్టెంట్ ఇంజనీర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 200 మంది ఇంజనీర్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఇంకా 500 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆర్థిక శాఖ అనుమతించాయన్నారు. ఇంకా 700 నుంచి 800 ఉద్యోగాలను కాంట్రాక్ట్ ఆధారంగా భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు.
రాష్ట్ర సరిహద్దుల్లో నీటిపారుదల పథకాల అమలుకు చాలా సమస్యలున్నాయన్నారు. ఈ విషయంపై డిసెంబర్లో బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగిసి తుది తీర్పు వెలువడనుందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నీటిపారుదల శాఖా మంత్రులతో చర్చించి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొంటామన్నారు. బాగల్‌కోట, బీజాపూర్ జిల్లాల్లో నీటిపారుదల పథకాలు కల్పించే ఉద్దేశంతో 1.20 లక్షల హెక్టార్ల భూమిని స్వాధీన పరచుకునే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
జిల్లాలోని 22 చెరువులకు నీరు నింపే ఎత్తిపోతల పథకాలను రెండు నెలల్లో పూర్తి చేసి ప్రయోగాత్మకంగా చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. ఏటా రూ.10 వేల కోట్లతో నీటిపారుదల పథకాల పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో పనులు చేపడతామన్నారు. అప్పర్‌కృష్ణా, ఎత్తినహొళె, మల్లాబాద్ పథకాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 8 లక్షల హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో నీటిపారుదల శాఖ మేనేజింగ్ డెరైక్టర్ రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు.