irrigation officer
-
అవినీతి ఉద్యోగి: రూ.కోటిన్నర అక్రమాస్తులు
సాక్షి, ధవళేశ్వరం: ఇరిగేషన్ హెడ్‌వర్క్స్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పల్లంకుర్తి పద్మారావు ఆస్తులపై సోమవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఏకకాలంలో దాడులు నిర్వహించింది. దాడుల్లో సుమారు రూ.1.50 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. పద్మారావు ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ధవళేశ్వరం మసీదు వీధిలోని పద్మారావు ఇల్లు, మండపేటలోని అతని బావమరిది ఇల్లు, గోపాలపురంలోని చెల్లెలి భర్త ఇల్లు, పద్మారావు పనిచేస్తున్న ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ కార్యాలయంలోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ధవళేశ్వరంలోని ఇల్లు, రాజమహేంద్రవరంలో శీలం నూకరాజు వీధిలో ఒక ఇల్లు, మండపేటలో రూ.10లక్షలు విలువైన స్థలం, రూ.10లక్షల బంగారం, కొంత నగదు, వెండి వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు 1.50 కోట్లుగా నిర్ధారించారు. పద్మారావు పేరున పలు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని వాటిని పరిశీలించాల్సి ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు, రాజమహేంద్రవరం రేంజ్ సీఐ పీవీ సూర్యమోహనరావు, వి.పుల్లారావు, డి.వాసుకృష్ణ, పీవీజీ తిలక్, ఎస్సైలు టి.నరేష్, బి.సూర్యం పాల్గొన్నారు. ఇరిగేషన్‌లోని పలువురు ఉన్నతాధికారులు పద్మారావుకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. గతంలో పద్మారావుపై ఆరోపణలు వచ్చినా ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. (చదవండి: అవినీతిపై పంజా విసిరిన ఏసీబీ) -
ఉన్నతాధి(బే)కారి చేష్టలు..
సాక్షి, నెల్లూరు : నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారి వేధింపులతో ఉద్యోగినులు ఆందోళన చెందుతున్నారు. ఆ అధికారి క్యాబిన్లోకి వెళ్లాలంటే మహిళలు జంకుతున్నారు. ఇరిగేషన్‌శాఖ అధికారిగా ఆయన రెండేళ్ల క్రితం బదిలీపై వచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏడాదిపాటు తన కార్యాలయంలో పనిచేసే మహిళలను చూపులతో విసిగించేవాడు. వారిని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవాడు. ఆయన ఉన్నతాధికారి కావడంతో మహిళలు బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. అవసరం లేకున్నా మహిళలను క్యాబిన్లోకి పిలిపించడం, హాయ్ మేడమ్.. మీ చీర బాగుంది.. మీకు డ్రస్ బాగాలేదు.. మీరు చీర కడితేనే చాలా బాగుంటారు.. అంటూ విసిగించేవాడు. ఉన్నతాధికారి కావడంతో ఎదురు చెబితే ఎక్కడ టార్గెట్ చేస్తాడోనని మహిళలు బయటకు చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నారు. అధికారి చేష్టలకు.. ఇరిగేషన్ కార్యాలయంలో సదరు విభాగంలో ఇద్దరు, ఫీల్డ్‌లో ఇద్దరు, మిగిలిన విభాగాల్లో మరో ముగ్గురు మహిళలు పనిచేస్తున్నారు. అందులో కొందరు మహిళలు ఉన్నతాధికారి వికృత చేష్టలకు ఇబ్బందిపడిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఫీల్డ్‌లో ఉన్న ఓ మహిళా అధికారి అధికారి వేధింపులు తట్టుకోలేక సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రులు మహిళలకు ఫోన్లు చేయడం, వివిధ రకాలుగా మేసేజ్‌లు పెడుతూ వారికి నరకం చూపిస్తున్నాడు. నన్ను ఒక్కసారి గమనిస్తే పదోన్నతులు, ఇక్రిమెంట్లు ఇప్పిస్తానంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. మరోవైపు తన కార్యాలయాన్నే ఉన్నతాధికారి బార్గా మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తన క్యాబిన్‌లోనే మద్యం సేవిస్తున్నట్లుగా కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. రాత్రివేళలో అర్ధరాత్రి వరకు ఉంటూ అక్కడే ఓ చిరుద్యోగి ద్వారా మద్యం తెప్పించుకొని ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. గత టీడీపీ హయాంలో జిల్లాకు చెందిన మాజీ మంత్రితో ఆయనకు సాన్నిహిత్యం ఉండడంతో ఆ అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా కనీస విచారణకు కూడా జరగని పరిస్థితి నెలకొంది. -
ఏసీబీకి దొరికిన ఇరిగేషన్ అధికారి
భారీగా లంచం తీసుకుంటూ.. ఓ ఇరిగేషన్ అధికారి ఏసీబీకి రెండ్ హాండెండ్ గా దొరికి పోయాడు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా గుర్రం పాడు డివిజన్ ఏఎంఆర్ ప్రాజెక్టుకు సంబంధించి రూ. 32లక్షల బిల్లు ప్రాసెస్ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ ఎం మానిక్ ప్రభు.. రూ.1,37,500 లంచం ఇవ్వాల్సిందిగా.. కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేశాడు. దీంతో పి. జైపాల్ రెడ్డి డిప్యూటీ ఈఈపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఏసీబీ రేంజ్ డీఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వలపన్నిన అధికారులు...సైదాబాద్ లోని ఎస్ బీ హెచ్ పార్కు వద్ద పట్టుకున్నారు. మానిక్ ప్రభు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.