విభజనతో సాగునీటి సమస్య జటిలం
గుడ్లవల్లేరు/గుడివాడరూరల్/కృత్తివెన్ను, న్యూస్‌లైన్ :
తెలంగాణ విభజనతో సాగునీటి సమస్య మరింత జఠిలం కానుందని కేంద్ర బృందం ఎదుట కౌతవరం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కె.శ్రీరామవర్మ ఆధ్వర్యంలోని కేంద్ర బృందం బుధవారం గుడ్లవల్లేరుమండలంలోని కౌతారం,గుడివాడ మండలంలోని తట్టివర్రు గ్రామంలోనూ,కృత్తివెన్ను మండలం లక్ష్మిపురం గ్రామంలోనూ పర్యటించింది.
కౌతవరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ విభజన జరుగక ముందే గత ఖరీఫ్‌లో అదునుకు సాగునీరివ్వవ్వలేదని, విభజనతో మరింత నష్టపోతామని కేంద్రబృందం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
పంట నష్ట పరిహారంతో పాటు కొంతమందికే ఇన్సూరెన్స్ అందుతుందని అన్నారు. నష్టపోయిన అర్హులైన రైతులందరికీ బీమా అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు అభ్యంతరాల వల్లనే సాగునీటిని ఆలస్యంగా వదిలే పరిస్థితి తలెత్తినట్లు ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరావు కేంద్ర బృందానికి సమాధానమిచ్చారు.
జిల్లాలో ్ట1.67లక్షల మంది రైతులకు నష్టం...
హెలెన్ తుఫాను వల్ల జిల్లాలో 1.67లక్షల మంది రైతులకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ వి.నరసింహులు తెలిపారు. దాదాపు 80వేల హెక్టారుల్లో పంట నష్టం వాటిల్లినట్లు చెప్పారు. కౌతవరం రైతులతో కేంద్ర బృందం ప్రతినిధి శ్రీరామవర్మ మాట్లాడుతూ వ్యవసాయాధికారులు పంటనష్ట పరిహార అంచనాల్ని ప్రభుత్వానికి నివేదిక పంపారని, నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా సిఫారసు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రోడ్లను నిర్మించరూ...
తుఫాన్లకు గ్రామంలోని రోడ్లన్నీ అధ్వానంగా మారిపోయాయని కౌతవరం గ్రామ సర్పంచి పడమటి సుజాత కేంద్ర బృందానికి వినతిపత్రాన్ని అందజేశారు. కేంద్ర బృందం కౌతవరం రావటానికి ముందుగా తుఫాన్ల కోతకు గురైన మామిడికోళ్ల మీదుగా లంకాదొడ్డి, డోకిపర్రు జిల్లా పరిషత్ రోడ్డును పరిశీలించారు.
లెక్కలు సరి చూసుకోండి....
తట్టివర్రు గ్రామంలోని పంట పోలాలను, రోడ్డును కేంద్ర కమిటీ సభ్యులు పరిశీలించిస్థానిక రైతులన వివరాలడిగి తెలుసుకున్నారు. స్థానిక అధికారులు చూపిన లెక్కలకు కేంద్ర కమిటీకి నివేదించిన జాబితాకు పొంతన కుదరకపోవటంతో కేంద్రకమిటీ సభ్యులు ఆర్పీ సింగ్ ఆసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి పొరపాటు వల్లనే నిధులు తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు.
నష్టపరిహారాన్ని పెంచండి....
హెలెన్, లెహర్ తుపానుల నష్టపరిహారాన్ని ఎకరానికి రూ. 4వేల నుంచి రూ. 8వేలకు పెంచాలని కేంద్ర బృందానికి కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో రైతులు విజ్ఞప్తి చేశారు. పర్యటనలో కేంద్ర బృందానికి చెందిన ఆర్.పి.సింగ్, ఎ.కృష్ణప్రసాద్, పంచాయయితీరాజ్ ఎస్ఈ జి.జయరాజ్, ఈఈ పి.అశోక్‌కుమార్, గుడివాడ ఆర్డీవో వెంకటసుబ్బయ్య, వ్యవసాయశాఖ జిల్లా డీడీ వెంకటేశ్వరరావు, రూరల్ డెవలప్మెంట్ అధికారి కె.రాంవర్మ, ఏడీఏ మణిధర్, బంటుమిల్లి ఏడీఏ మురళీకృష్ణ, గుడ్లవల్లేరు తహశీల్దార్ మైకేల్‌రాజు, ఆర్.ఐ వై.లక్ష్మీనారాయణ, ఏఈవో పి.దివ్య, జెడ్పీ ఏఈ ఆర్.రాఘవులు, రైతులు పడమటి నాంచారయ్య, కానూరి సత్తిబాబు, నాంజీ, వడ్లమూడి యుగంధర్, చాపరాల జగన్మోహనరావు, కానూరి రాజేంద్రప్రసాద్, ఈడె రామారావు, సునీల్, పోతురాజు, ఆదర్శ రైతులు శ్రీనివాసరరావు, సుబ్బారావు తదితరులున్నారు.