'అతడితో ఏదోక రోజు సినిమా చేస్తా'
చెన్నై: తమిళ హీరో సూర్యతో సినిమా చేస్తానని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజకుమార్ హిరానీ అన్నారు. సూర్య గొప్ప నటుడని, అతడు నటించిన సినిమాలు చూశానని తెలిపారు. 'ఇరుధి సుత్రు' తమిళ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో హిరానీ మాట్లాడుతూ... సూర్యతో ఏదోక రోజు సినిమా చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి హీరో సూర్య స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. మాధవన్, శశికాంత్, సీవీ కుమార్, రితికా సింగ్, ముంతాజ్ సర్కార్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు సుధ కొంగర దర్శకత్వం వహించారు. రాజకుమార్ హిరానీ సహ నిర్మాతగా వ్యహరిస్తున్నారు.
మాధవన్ చొరవతోనే ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించేందుకు హిరానీ ఒప్పుకున్నారని సుధ తెలిపారు. ఆర్థిక సమస్యలతో షూటింగ్ ఆగిపోయే పరిస్థితి రావడంతో హిరానీతో మాధవన్ మాట్లాడి తమ సినిమాలో భాగస్వామిని చేశారని వెల్లడించారు. 'ఇరుధి సుత్రు' సినిమాలో మాధవన్ బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్నాడు. చాక్లెట్ బాయ్ నుంచి మాధవన్ బయటపడ్డాడని ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన నటుడు సిద్ధార్ధ అన్నారు. విలక్షణ దర్శకుడు బాల, సీనియర్ నటుడు నాజర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.