ఎరిథ్మియా అంటే ఏమిటి? ఎందుకొస్తుంది?
మా బావ వయసు 42 ఏళ్లు. సిగరెట్లు కాలుస్తాడు గానీ, మద్యం అలవాటు లేదు. కానీ అప్పుడప్పుడు మైకం కమ్మినట్టు కనిపిస్తాడు. కొద్దికాలంగా ఛాతీలో అప్పుడప్పుడు నొప్పి అంటున్నాడు. తరచు శ్వాస తీసుకోడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కొన్నిసార్లు స్పృహ తప్పుతున్నాడు. దాంతో సిటీలో పెద్ద హాస్పిటల్లో చూపించాం. పరీక్షలన్నీ చేసి కార్డియాలజిస్ట్‌ను కలవమన్నారు. ఆయన కొన్ని టెస్ట్‌లు చేసి గుండె ఎక్కువగా కొట్టుకుంటోంది. అరిథ్మియా వ్యాధి అని నిర్ధారణ చేశాడు. హైదరాబాద్ వెళ్లిఎలక్ట్రోఫిజియాలజిస్ట్ను కలవమన్నారు. మాకు గాభరాగా ఉంది. అసలీ గుండెజబ్బు ఏమిటి? ఎందుకొస్తుంది? చికిత్స ఉందా? ఆందోళనలో ఉన్నాం. దయచేసి వివరంగా తెలియజేయండి.
మన గుండెకు ప్రత్యేకమైన విద్యుత్ వ్యవస్థ ఉంటుంది. గుండె శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గుండె సంకోచవ్యాకోచాలు చెందాలి. నిర్దిష్ట సమయానికి అందే విద్యుత్ ప్రేరణలతోనే ప్రతీసారీ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే గుండెలోని విద్యుత్ చర్యలే గుండె స్పందనలను ప్రేరేపిస్తుంటాయన్నమాట. గుండె కొట్టుకోడాన్ని నిర్ణయించే విద్యుత్ ప్రేరణలలో హెచ్చుతగ్గులు ‘ఎరిథ్మియా’కు దారితీస్తాయి. అంటే గుండె ఎక్కువగానో లేదా తక్కువగానో కొట్టుకోవడం జరుగుతుంది. ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయాన్నీ కలిగించవచ్చు.
గుండె రక్తాన్ని సరఫరా చేసే తీరిది...
గుండె పూర్తిగా కండర నిర్మిత అవయవం. ఇది శరీర భాగాలకు ప్రతిరోజూ 16,000 లీటర్లకు పైగా రక్తాన్ని పంప్ చేస్తుంటుంది. శరీరపు మూలమూలా ఉన్న అతి చిన్న రక్తకేశనాళికల (క్యాపిల్లరీస్) వరకూ చేరే విధంగా రక్తప్రసరణను క్రమబద్దీకరిస్తుంటుంది.గుండె కుడి–ఎడమ భాగాలలో రెండేసి గదులు ఉంటాయి. వీటిలో పైభాగంలోని వాటిని ఏట్రియా అని, కింద ఉన్న వాటిని వెంట్రికల్స్ అని అంటారు. శరీరంలోని వివిధ అవయవాల నుంచి గుండెకు వచ్చిన రక్తం... దాని కుడి ఏట్రియమ్‌లోకి చేరుతుంది. తర్వాత దాని కిందనే ఉన్న కుడి వెంట్రికల్‌లోకి ప్రవహిస్తుంది. రక్తం అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి పంప్ అవుతుంది. అక్కడ రక్తం ఆక్సిజన్‌లో శుద్ధి అవుతుంది. శుద్ధమైన రక్తం గుండెలోని ఎడమ ఏట్రియమ్‌లోకి వెళ్తుంది. అక్కడి నుంచి ఎడమ వెంట్రికల్కు చేరుకుంటంది.
ఎడమ వెంట్రికిల్ శుద్ధ రక్తాన్ని శరీర భాగాలన్నింటికీ పంప్ చేస్తుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గుండెలో సంకోచ వ్యాకోచాలు ఓ క్రమపద్ధతిలో పూర్తిగా లయబద్ధంగా జరగాలి. నిర్దిష్ట సమయానికి అందే విద్యుత్ ప్రేరణలతోనే ప్రతిసారీ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రేరణ మొదట కుడి ఏట్రియమ్లో ‘సైనల్ నోడ్’ నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి విద్యుత్ తరంగాలు తీగలాంటి ప్రవాహకాలుగా పనిచేసే ప్రత్యేక కండరాల ద్వారా గుండెలోనే ఉన్న ఏట్రియో–వెంట్రిక్యులార్ నోడ్ (ఏవీఎన్)కు చేరతాయి. ఇక్కడి నుంచి విద్యుత్తు వెంట్రికల్స్కు ప్రవహించి అవి సంకోచించేటట్లు చేస్తుంది. దాంతో రక్తం అన్ని శరీర భాగాలకు పంప్ అవుతుంది.విద్యుత్ ప్రేరణలతో ఈ విధంగా ఒక చక్రభ్రమణంలా సాగే ఈ ప్రక్రియ మొత్తాన్ని ఒకసారి గుండె స్పందనగా పరిగణిస్తారు.
ఈ విద్యుత్ ప్రరసణ ప్రక్రియలో ఎలాంటి ఆటంకం ఏర్పడినా అది గుండె స్పంనల్లో లోటుపాట్లకు కారణం అవుతుంది. దీనివల్ల గుండె ఎక్కువసార్లు కొట్టుకోవడమో (ఈ కండిషన్‌ను టాకికార్డియా అంటారు) లేదా తక్కువ సార్లు ప్రతిస్పందించడమో (దీన్ని బ్రేకికార్డియా అంటారు) జరుగుతుంది. గుండె విద్యుత్ వ్యవస్థలో సమస్యలు సైనల్ నోడ్, ఏవీనోడ్ లేదా విద్యుత్ ప్రసారం చేసే కండరాలలో లోపాల వల్ల ఏర్పడతాయి. గుండె అతి వేగంగా లేదా చాలా నెమ్మదిగా కొట్టుకుంటూ ఉంటే శరీర భాగాలకు రక్తసరఫరా దెబ్బతింటుంది. దాంతో మైకం కమ్మినట్టుగా ఉంటుంది. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, స్పృహతప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సమస్య నిర్ధారణ ఇలా...
గుండెకు సంబంధించిన విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు అది సాధారణ స్థాయికంటే ఎక్కువసార్లో లేదా చాలా తక్కువ పర్యాయాలో కొట్టుకుంటుంది. ఎలక్ట్రోఫిజియాలజీలో గుండె విద్యుత్ వ్యవస్థ పనితీరును సమీక్షించే పరీక్షలు నిర్వహించి, గుండె స్పందనల్లో అసాధారణ స్థితి ఏదైనా ఉందేమో తెలుసుకుంటారు. గుండెలోకి వెళ్లే రక్తనాళాల ద్వారా కాథటర్లు, వైర్ ఎలక్ట్రోడ్లను ప్రవేశపెట్టడం ద్వారా దాని విద్యుత్ చర్యలను పరిశీలించగలుగుతారు. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులకు కారణాలు ఏమిటో తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ వ్యక్తిలో గుండె పనితీరును మళ్లీ మాములు దశకు (నార్మల్కు) తెచ్చేందుకు అవసరమైన చికిత్సా వ్యూహాన్ని నిర్ణయిస్తారు.
అందుబాటులో మంచి చికిత్స...
మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ బావగారికి వచ్చిన సమస్యను చక్కదిద్దే ఎలక్ట్రోఫిజియాలజీ విభాగం ఎంతగానో అభివృద్ధి చెందింది. గుండె విద్యుత్‌క్షేత్రంలో లోటుపాట్లను సరిదిద్దే అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అరిథ్మియాకు సాధారణ మందులతో చికిత్స చేస్తారు. గుండె స్పందనలు సాధారణ స్థితికి చేరుకునేందుకు వేర్వేరు మందులను సిఫార్సు చేసి, వాటితో గుండె ఏ మేరకు సాధారణ స్థితికి చేరుకుంటుదో పరిశీలిస్తారు.
క్యాథటర్ అబ్లేషన్, కార్డియాక్ రీసింక్రొనైజేషన్ థెరపీ అనే ప్రక్రియలను అనుసరిస్తారు. అవసరాన్ని బట్టి కార్డియోవర్టర్, డిఫిబ్రిలేషన్, పేస్‌మేకర్ వంటి ఇంప్లాంట్స్‌ను అమర్చుతారు. గుండెకొట్టుకోవడంలో వచ్చే విపరీత వ్యత్యాసాల వల్ల ఏర్పడే అనారోగ్యాలకు ఇప్పుడు ఎలక్ట్రోఫిజియాలజీతో సరైన చికిత్స అందుబాటులో ఉంది. దీంతో గుండె సమస్యలు వచ్చిన ఆ వ్యక్తి ఎలాంటి రాజీ లేకుండా పూర్తిస్థాయిలో సాధారణ జీవితం గడపడానికి వీలవుతుంది.
డా. రాజశేఖర్ వరద, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్
ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్. సికింద్రాబాద్