‘ఇష్రత్’రెండో అఫిడవిట్ సరైనదే
♦ తనే బాధ్యత తీసుకుంటానన్న చిదంబరం
♦ పిళ్లైకీ అందులో భాగముందని వ్యాఖ్య
♦ 2009 నాటి నివేదికను పరీక్షించనున్న హోంశాఖ
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన 2004నాటి ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో రెండో అఫిడవిట్లో పేర్కొన్న విషయాలు వందశాతం వాస్తవమని కేంద్ర మాజీ హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. ఈ విషయంలో బీజేపీ విమర్శలు చేస్తున్నా.. తన మాటకు కట్టుబడి ఉన్నట్లు చిదంబరం వెల్లడించారు. ‘ఆ ఘటన నివేదిక వచ్చినపుడు (2009లో) కేంద్ర హోం మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా. నాకెంత బాధ్యత ఉందో హోం శాఖ కార్యదర్శిగా ఆయన (జీకే పిళ్లై) బాధ్యత కూడా అంతే. కానీ ఆయన తన వివాదం నుంచి తప్పించుకుంటున్నారు. ఆయన వ్యవహరించిన తీరు నిరాశకు గురిచేసింది’ అని చిదంబరం అన్నారు.
ఈ కేసుకు సంబంధించి మొదటి అఫిడవిట్ అస్పష్టంగా, సందిగ్ధంగా ఉన్నందునే రెండో అఫిడవిట్‌ను కోరాల్సి వచ్చింది. నిఘా వర్గాలు సేకరించిన సమాచారంపైనే కేంద్ర ప్రభుత్వం సందేహాలు వ్యక్తం చేసిందని.. ఇలాంటి నివేదికలను సాక్ష్యంగా పరిగణించలేమని చిదంబరం అన్నారు. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని.. దీనికి కేంద్రం బాధ్యత వహించదన్నారు. ‘నా ప్రమేయం లేకుండానే తొలి అఫిడవిట్ సిద్ధమైంది. అందులో వాస్తవాలు లేవనిపించింది. హోం సెక్రటరీ, ఐబీ డెరైక్టర్, ఇతర అధికారులతో కలసి చర్చలు జరిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే రెండో అఫిడవిట్ సిద్ధమైంది’ అని చిదంబరం తెలిపారు. అయినా రెండో అఫిడవిట్‌లోని ఏ విషయం తప్పుగా ఉందో తనకర్థం కాలేదన్నారు.
ఇది వందశాతం సరైనదే. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను తెప్పించుకుని పూర్తిగా సమీక్షించాకే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2009లో తొలి అఫిడవిట్ దాఖలు చేసినపుడు ఇషత్‌త్రో సహా చనిపోయిన వారంతా లష్కరే ఉగ్రవాదులని పేర్కొనగా.. రెండు నెలల తర్వాత దాఖలు చేసిన రెండో అఫిడవిట్లో వారు ఉగ్రవాదులనే విషయంపై స్పష్టత లేదని పేర్కొన్నారు. మరోవైపు, అఫ్జల్ గురు ఉరితీత తమ ప్రభుత్వ హయాంలోనే జరిగినా.. అది సరైన నిర్ణయం కాదని తనకు అనిపించిందన్నారు. అఫ్జల్‌ది దేశవ్యతిరేకం.. రాజద్రోహం కాదని చిదంబరం పునరుద్ఘాటించారు. మరోవైపు, ఇషత్ ్రజహాన్ ఎన్కౌంటర్లో యూపీఏ సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్, ఇతర పత్రాలను కేంద్ర హోం శాఖ పరిశీలించనుంది. అయితే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు లభించలేదని.. అవి ఎక్కడున్నాయో తెలియటం లేదని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.