‘అయ్యగారి’ ఆకాంక్ష
ఇది డాక్టర్ ఎ.ఎస్.రావు (అయ్యగారి సాంబశివరావు) శతజయంతి సంవ త్సరం. ప్రతిష్టాత్మక ఈసీఐఎల్ రూపకర్త రావుగారే. దేశీయ ఎలక్ట్రానిక్ రంగ మనే కలను సాకారం చేసిన ప్రతిభాశీలి. భారతదేశ ఎలక్ట్రానిక్ రంగం పురోగ మించడానికి అవిశ్రాంతంగా శ్రమించిన కార్యశీలి. హైదరాబాద్ ఆధునికతకు కార కులు ముగ్గురని చెబుతారు. బి.హెచ్.ఇ.ఎల్. స్థాపనకి డా॥కె.ఎల్.రావు; రక్షణ రంగానికి చెందిన డి.ఆర్.డి.ఎల్. వంటి సంస్థలు అందడానికి సూరి భగవంతం, ఇ.సి.ఐ.ఎల్., ఎన్.ఎఫ్.సి. సంస్థలు మనకే దక్కడానికి కారణం ఏఎస్రావుగారు. అయితే తన పేరు కాకుండా హోమి జె బాబాకి ఆ ఘనతను ఆపాదించిన నిగర్వి రావు. హోమీ బాబా తలలో నాలుకలా వ్యవహరించి, మహారాష్ట్ర, తమిళనాడు నాయకుల ఒత్తిడులని అధిగమించి, అన్ని విధాలా హైదరాబాద్ మౌలాలి ప్రాంతం అనుకూలమన్న నివేదికలను రావు రూపొందింపజేశారు.
విద్యుత్ ఉత్పాదనపై రావుగారికి స్పష్టమైన అవగాహన ఉంది. ఆ రంగంలో నిష్ణాతుడు నార్ల తాతారావుతో ఆత్మీయత దాని ఫలితమే. ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభాన్ని రావు అప్పుడే ఊహించారు. అణు విద్యుత్ తయారీపై అపోహలను తొలగించి నాణ్యమైన విద్యుత్‌ని అందించాలని చెప్పారు. ఎలాంటి పరిమితులు లేని సౌరశక్తిని ఇందుకోసం వాడొచ్చని సూచించారు. భారత ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితితో బాటు పలు అంతర్జాతీయ వేదికలపై మన అణుశాస్త్ర పరిజ్ఞానపు విజ్ఞాన ఖనిలా నిలిచారు. దేశ, విదేశాల పత్రికల్లో వెలువడిన వారి వ్యాసాలు ఇప్పటికీ అణుశాస్త్ర విద్యార్థులకి మార్గదర్శనం చేస్తున్నాయి. నలుపు, తెలుపు టీవీల తయారీ ఈసీఐఎల్‌లో చేపట్టి ఆవైపు మన చూపు మరల్చింది రావుగారే. ఏఎస్ రావునగర్‌లో 1994లో ‘ఇండోట్రానిక్స్’ అనే ఎలక్ట్రానిక్స్ శిక్షణ సంస్థ ప్రారంభోత్సవానికి విచ్చేసినపుడు ఎల్రక్టానిక్ రంగంలో చైనా పోటీని తట్టుకు నేందుకు రావుగారు చేసిన సూచనలు మరువలేనివి. యువత, గృహిణులు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కుటీర పరిశ్రమగా చేపడితే మరింత నాణ్యంగా చౌకగా అందించవచ్చునని చెప్పారు.
ఏఎస్ రావు మానవతా దృష్టికి ఇదో మచ్చుతునక. ఈసీఐఎల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఒక నియామకం మీద రావుగారి నిర్ణయాన్ని కోరారు. ఆ ఉద్యో గార్థికి గుండె వ్యాధి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. నిజానికి ఇలాంటి అభ్యర్థిని తిరస్కరిస్తారు. అయితే అతడిని ఉద్యోగంలోకి తీసుకొమ్మని రావు గారు ఆదేశించారు. అదేమంటే, ఇలాగైనా ఆపదలో ఉన్న వ్యక్తికి మనం సాయ పడిన వారమవుతామని చెప్పారు.
నిరాడంబరతకు చిరునామాగా నిలిచే రావుగారు పదవీ విరమణ చేశాక నాచారంలో ఉండేవారు. సందర్శకులను అనుమతించేవారు కాదు. దయచేసి సందర్శకులు రావద్దని బోర్డు పెట్టుకున్నారు. ఉద్యోగ విరమణ తరువాత తానేమీ సహాయం చెయ్యలేని స్థితి కనుకనే ఎవరినీ నిరాశ పరచడం ఇష్టం లేక బోర్డు పెట్టానని అన్నారు. ఎప్పుడూ మూసి ఉండే ఆ ఇంటి గేట్లు మిత్రు లెవరైనా ఫోన్ చేస్తే మాత్రమే తెరుచుకునేవి.
చేతి సంచితో ఎప్పుడూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించేవారు రావుగారు. ఒకసారి కండక్టర్‌తో ఎ.ఎస్. రావునగర్కి టికెట్ కావాలన్నారు. వారే ఎ.ఎస్. రావుగారని తెలిసిన కండక్టర్ ఆయన నిరాడంబరతని అందరికీ చాటాడు. పదవీ విరమణ తరువాత రావుగారు కుమార్తె పెళ్లి ఖర్చులకై నాచారం ఇంటిలో సగభాగం అమ్మేశారు.
రావుగారు 2003లో పరమపదించారు. వారి పేరుపై అవార్డులను అంతకు ముందు నుంచే ప్రారంభించి కొనసాగిస్తున్నారు. సుమారు 120 ఎకరాల్లో రూపుదిద్దుకొన్న డాక్టర్ ఎ.ఎస్.రావు నగర్ మౌలాలి ప్రాంతానికి తలమానికం. ఇక్కడ నుంచి వెళ్లి స్థిరపడినవారి పిల్లలు విదేశాల్లో తమ అపార్ట్‌మెంటుల్లో ఎ.ఎస్.రావునగర్ పేరు పెట్టుకుంటూ విశ్వవ్యాప్తం చేస్తు న్నారు. న్యూజెర్సీలో ఒక వీధికి వీరి పేరు పెట్టారు. పద్మశ్రీ, పద్మభూషణ్, భట్నాగర్ పురస్కారం, నాయుడమ్మ బంగారు పతకం, కళాప్రపూర్ణ... ఎన్నెన్నో గౌరవాలు వరించినా చివరివరకు రావుగారిలో అదే వినమ్రత. అదే నిరాడం బరత. అందుకే ఎప్పటికీ రావు ఒక స్ఫూర్తి ప్రదాత.
(ఎ.ఎస్.రావు శతజయంతి సందర్భంగా స్మారక తపాలా బిళ్ల విడుదల నేడు)
పేరిచర్ల రాజగోపాలరాజు మౌలాలి, హైదరాబాద్
డాక్టర్ ఎ.ఎస్.రావు
1914-2003