రోగులకు మంచిరోజులు
సాక్షి, ముంబై: బీఎంసీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు నాణ్యమైన భోజనం అందజేయాలని పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. రోగులకు భోజనం సరఫరా చేసే బాధ్యతలు విలేపార్లేలోని ఇస్కాన్ సంస్థకు అప్పగించింది. ఇప్పటిదాకా బీఎంసీ ఆస్పత్రుల్లోని రోగులకు పరిపాలన విభాగమే భోజనం పంపిణీ చేస్తోంది. ఇక నుంచి ఈ బాధ్యతను ‘ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్’ నిర్వహించనుంది. ఈ బాధ్యతను ఎవరికి అప్పగించాలా? అనే విషయమై మొదట టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్)కు చెందిన గట్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే కూడా ఈ డిమాండ్‌ను బలంగా వినిపించారు. కాని అధికారంలో ఉన్న నాయకులు వారి డిమాండ్‌ను పట్టించుకోకుండానే ఇస్కాన్ వైపు మొగ్గు చూపారు. అయితే భోజనం పంపిణీచేసే ఈ పథకాన్ని ముందుగా విలేపార్లేలోని కూపర్ ఆస్పత్రి నుంచి ప్రారంభించనున్నారు. అందుకు రూ.1.97 కోట్లు ఖర్చుకానుంది. ఈ మొత్తంతో ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్.. రోగులకు రెండు పూటల భోజనంతోపాటు టీ, అల్పాహారం అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
పెరిగిన రోగుల సంఖ్య...
కూపర్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఇక్కడ 636 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. గతంలో రోగులకు భోజనం సరఫరా చేయాలంటే బీఎంసీ పరిపాలన విభాగానికి రూ.1.99 కోట్లు ఖర్చయ్యేది. రోగుల సంఖ్య పెరగడంతో వంటశాల సిబ్బంది, వార్డుబాయ్‌ల సంఖ్య కూడా పెంచాల్సి ఉంటుంది.
దీని కారణంగా వ్యయం పెరిగే అవకాశముంది. కాని ఇస్కాన్ సంస్థ మాత్రం రూ.1.97 కోట్లకే రెండు పూటల భోజనం, టీ, అల్పాహారం అందజేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఇస్కాన్ సంస్థకే కాంట్రాక్టు ఇవ్వాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు మంగళవారం జరిగిన స్థాయి సమితి సమావేశంలో ఆమోదం లభించింది. బీఎంసీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గతంలో మహిళా పొదుపు సంఘాల ద్వారా కిచిడీ పంపిణీ జరిగేది. ప్రస్తుతం దీన్ని కూడా నిలిపివేసి ఇస్కాన్ సంస్థకు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు బీఎంసీ అదనపు కమిషనర్ మోహన్ అడ్తానీ చెప్పారు.