మెదడుకూ స్టెంట్స్!
కొత్త పరిశోధన
మెదడులో రక్తం గడ్డ కట్టడం వల్ల వచ్చే స్ట్రోక్‌ని (పక్షవాతాన్ని) ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారన్న విషయం తెలిసిందే. ఇలా పక్షవాతం వచ్చిన సందర్భాల్లో వెంటనే టీపీఏ (టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్) అనే ఇంజెక్షన్ ఇస్తారన్న విషయమూ తెలిసిందే. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన మరుక్షణంలో అది రక్తపు గడ్డలను (క్లాట్స్‌ను) చెదరగొట్టి మళ్లీ మెదడులోని ఆయా భాగాలకు రక్తసరఫరా పునరుద్ధరిస్తుంది. అందుకే పక్షవాతం వచ్చిన రోగుల్లో వెంటనే ఈ ఇంజెక్షన్‌ను ఇస్తుంటారు. అయితే మెదడులోకి స్టెంట్ వేయడం వల్ల టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ కంటే మంచి ఫలితాలు ఉంటాయని ఒక డచ్ అధ్యయనంలో తేలింది. మిస్టర్ క్లీన్ అనే పేరిట నిర్వహించిన ఈ అధ్యయనాన్ని 500 మంది పక్షవాతం రోగులపై నిర్వహించారు. ఇందులో 89 శాతం మందికి ప్రాణరక్షణ మందుగా వ్యవహరించే టిష్యూప్లాస్మినోజెన్ యాక్టివేటర్‌ను ఇచ్చారు. ఇక మిగతావారిలో ఎంపిక చేసిన వారికి ఇంట్రా ఆర్టీరియల్ ట్రీట్మెంట్గా వ్యవహరించే చికిత్స చేశారు. అంటే వారి తొడ భాగం నుంచి ఒక క్యాథెటర్‌ను (పైప్లాంటి ఉపకరణాన్ని) ప్రవేశపెట్టి, మెదడులో రక్తం గడ్డకట్టిన ప్రాంతానికి ఆ క్యాథెటర్‌ను తీసుకెళ్లి, ఆ ప్రాంతంలో స్టెంట్‌ను అమర్చారు.
క్యాథెటర్‌ను వెనక్కులాగే సమయంలో గడ్డకట్టిన రక్తపు ముద్దనూ వెనక్కుతీసుకువచ్చి దాన్ని బయటకు తొలగించారు. ఈ అధ్యయనం ద్వారా ఇలా రక్తం గడ్డకట్టడం వల్ల పక్షవాతం వచ్చిన వారికి స్టెంట్ వేయడం వల్ల 32.6 శాతం మంది అంతకు ముందు వ్యవహరించినట్లే తమ పనులు తామే చేసుకునేలా ఉన్నారనీ, అయితే కేవలం టీపీఏ ఇచ్చిన వారిలో 19.1 శాతం మంది మాత్రమే, స్టెంట్ వేసిన వారిలా బాగుపడ్డారని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన డచ్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ విషయాలను ‘ద న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో పొందుపరచారు.