Islamic State of Iraq and Syria (ISIS)
-
ఐసిస్ వధువు షమీమాకు యూకేలో నో ఎంట్రీ
లండన్: ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్ (ఐఎస్ఐఎస్)లో చేరేందుకు చిన్నప్పుడే సిరియాకి పారిపోయిన, బంగ్లాదేశ్ సంతతికి చెందిన లండన్ యువతి షమీమా బేగం(21)ని తిరిగి దేశంలోకి అనుమతి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో యూకే ప్రభుత్వం, న్యాయపోరాటంలో అతిపెద్ద విజయం సాధించినట్టయ్యింది. 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని షమీమా బేగం ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టు గ్రూప్‌లో చేరేందుకు 2015 ఫిబ్రవరిలో పారిపోయింది. ఈ కేసులో ఐదు ప్రధాన కోర్టులకు చెందిన న్యాయమూర్తులు బేగంని తిరిగి దేశంలోకి అనుమతించరాదని ఏకగ్రీవంగా ఈ తీర్పునిచ్చారు. ఫిబ్రవరి 2019లో సిరియా శరణార్థి శిబిరంలో బేగంని గుర్తించిన తరువాత, జాతీయ భద్రతా కారణాల రీత్యా ఆమె బ్రిటిష్ పౌరసత్వాన్ని రద్దు చేశారు. సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా హోం శాఖ చేసిన అన్ని విజ్ఞప్తులను అనుమతించింది. బేగం క్రాస్ అప్పీల్‌ను కొట్టివేసినట్టు సుప్రీంకోర్టు అధ్యక్షుడు లార్డ్ రాబర్ట్‌రీడ్ చెప్పారు. బ్రిటన్‌లోని బంగ్లాదేశ్‌కి చెందిన దంపతులకు బేగం జన్మించారు. డచ్‌కి చెందిన ఐఎస్ఐఎస్ తీవ్రవాది యోగో రియడ్జిక్‌తో వివాహం నేపథ్యంలో ఐసిస్ వధువుగా బేగంని పిలుస్తున్నారు. తన బ్రిటిష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ యూకే హోంశాఖ తీసుకున్న నిర్ణయాన్ని బేగం సవాల్ చేశారు. ప్రస్తుతం బేగం సిరియాలో సాయుధ దళాల నియంత్రణ శిబిరంలో ఉన్నారు. -
ఐఎస్ఐఎస్ వెనుక గురుశిష్యులు!
దక్షిణాదిలో ‘ఉగ్ర’సంస్థ విస్తరణలో యూపీ ప్రొఫెసర్ అతడికి సహకరిస్తున్న ఇద్దరు విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: దక్షిణాదిలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల వెనుక ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రొఫెసర్, ఢిల్లీ, అసోంలకు చెందిన అతని ఇద్దరు శిష్యుల హస్తం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ), కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలకు సమాచారం అందింది. దీంతో వారి ఆచూకీ కోసం రెండు సంస్థల అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఐఎస్ఐఎస్ భావజాలానికి ఆకర్షితులై 42 మంది ఇరాక్ వెళ్లేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో ఓ వైద్యవిద్యార్థిని కూడా ఉన్నట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. వీరందరు ఇరాక్ వెళ్లేందుకు పాస్‌పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నారని నిఘా వర్గాల దృష్టికి వచ్చింది. కాగా, వీళ్లకు ఐఎస్ఐఎస్ సంస్థ సమాచారాన్ని, ఇరాక్, సిరియాలలో ఉగ్రవాదులు తాజా చర్యలను యూపీ ప్రొఫెసర్, అతడి ఇద్దరు శిష్యులే అందజేస్తున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్‌ను అదపులోకి తీసుకోడానికి ఎన్ఐఎ, ఐబీ అధికారులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా వీరు కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్నారని నిఘా వర్గాలు కనుగొన్నాయి.