‘ఐఎస్’ అంతానికి సాయం
పారిస్: ‘ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)’ మిలిటెంట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇరాక్‌కు సైన్య సహకారం సహా అన్ని విధాలా సాయం అందించాలని అంతర్జాతీయ సమాజం నిర్ణయించింది. అమెరికా, రష్యా, చైనా సహా 30 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు సోమవారం పారిస్‌లో సమావేశమై.. ఐఎస్ ఆగడాలపై చర్చించారు. ఇటీవల బ్రిటన్ పౌరుణ్ణి ఐఎస్ మిలిటెంట్లు చంపిన నేపథ్యంలో.. ఇరాక్ నుంచి ఐఎస్ దళాలను తరిమికొట్టే ప్రక్రియను మరింత వేగం చేయాలని నిర్ణయించారు. ‘ఇరాక్ కోరిన విధంగా, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అవసరమైన సైన్య సహకారాన్ని అందించాల’ని తీర్మానించారు.
అయితే, భేటీ అనంతరం విడుదల చేసిన తీర్మాన పత్రంలో ఐఎస్ మిలిటెంట్లు ప్రబలంగా ఉన్న సిరియా ప్రస్తావన లేకపోవడం గమనార్హం. సమావేశాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రారంభించారు. సత్వరమే ‘ఐఎస్’ను అంతం చేయకపోతే అది మరిన్ని దేశాలకు చేరే ప్రమాదముందని ఇరాక్ అధ్యక్షుడు మాసుమ్ హెచ్చరించారు. ఐఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న అంతర్జాతీయ కూటమిలో చేరేందుకు ఇరాన్ నిరాకరించింది. ఆ కూటమికి విశ్వసనీయత లేదని ఇరాన్ అత్యున్నత నేత, షియాల మతపెద్ద అయిన అలీ ఖొమేనీ స్పష్టం చేశారు. ఐఎస్‌పై సైనిక చర్య చేపట్టాల్సిందేనని నాటో సెక్రటరీ జనరల్ రస్ముసన్ తేల్చి చెప్పారు.