ఐసిస్ మద్దతుదారుల హర్షం
నీస్: భయంకరమైన పేలుడుతో ఛిద్రమైన దేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఫ్రాన్స్ లోని నీస్ నగరం మార్మోగింది. పసి పిల్లలతో సహా పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయానక ఘటన గురించి తెలిసిన వారంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగా ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) మద్దతుదారులు మాత్రం హర్షాతిరేకాలు ప్రకటిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. నీస్ నగరంలో జరిగిన ఉగ్రదాడిని సమర్థిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఉగ్రదాడిలో ఫ్రాన్స్ పౌరులు మృతి చెందడం తమకెంతో సంతోషం కలిగించిందని కామెంట్లు చేశారు. 'దేవుడు గొప్పవాడు' అంటూ వ్యాఖ్యానించారు.
మరోవైపు నీస్ దాడిని ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండించింది. అమాయక పౌరుల ప్రాణాలు తీయడాన్ని తీవ్రంగా గర్హించింది. పారిస్ దాడి జరిగిన తర్వాత దాదాపు 8 నెలలకు ఐసిస్ మరోసారి నరమేధం సృష్టించింది. అయితే యూరో 2016 సాకర్ టోర్నమెంట్ ఆదివారంతో ప్రశాంతంగా ముగియడంతో ఫ్రాన్స్ ఊపిరి పీల్చుకుంది. ఈలోగా ఐసిస్ మరోసారి ఉగ్రదాడికి తెగబడడంతో ఫ్రాన్స్ తో పాటు ప్రపంచమంతా ఉలికిపడింది.