Islamophobia
-
ఇస్లామోఫోబియా పోగొట్టేందుకు టీవీ చానల్
ఇస్లామాబాద్: పశ్చిమదేశాల్లో ముస్లింలకు సంబంధించిన అంశాలతోపాటు ఇస్లాం అంటే ఉన్న భయాన్ని పోగొట్టేందుకు పాకిస్తాన్, మలేసియా, టర్కీ కలిసి బీబీసీ తరహా ప్రత్యేక టీవీ చానల్‌ను ప్రారంభించనున్నాయి. ఇటీవలి ఐరాస సమావేశాల్లో ప్రసంగించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఈ విషయం ప్రకటించడం తెల్సిందే. ఇంగ్లిష్‌లో ప్రసారమయ్యే టీవీ చానెల్‌తోపాటు సంయుక్తంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుపై చర్చలు జరుగుతున్నా.. చానల్‌ను ఎప్పుడు ప్రారంభించేదీ ఇంకా నిర్ణయించలేదు. -
అమెరికాలో పెరుగుతున్న ‘ముస్లిమోఫోబియా’
న్యూయార్క్: సకల జాతుల నిలయమైన అమెరికాలో నేడు ‘ముస్లిమోఫోబియా’ తీవ్రంగా పెరిగిపోయింది. ముస్లింలు టెర్రరిస్టుల రూపంలో ఎప్పుడు తమపై విరుచుకు పడిపోతారేమోనని అమెరికన్లు భయపడుతుండగా, అమెరికన్లు ఎక్కడ దాడి చేస్తారేమోనని సాధారణ ముస్లిం ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పాఠశాలల్లో, కాలేజీల్లో తమ పిల్లలకు ఎదురవుతున్న పరాభవాలను తట్టుకోలేక పిల్లలను తీసుకొని వారి ముస్లిం తల్లిదండ్రులు అమెరికా విడిచి విదేశాలకు ఇప్పటికే పారిపోగా మరికొందరు పారిపోవడానికి సన్నద్ధం అవుతున్నారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వానికి సహకారం అందించి అనేక అవార్డులు అందుకున్న స్కాలర్ జీషాన్ ఉల్ హసన్ ఉస్మాని కూడా అక్టోబర్ ఎనిమిదవ తేదీన తన భార్య బినిష్ భగవాని, ఇద్దరు పిల్లలను తీసుకొని అమెరికాకు గుడ్‌బై చెప్పి శాశ్వతంగా పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. కంప్యూటర్ డేటా సైంటిస్ట్‌గా అమెరికా ప్రభుత్వంలో పనిచేసిన ఆయన టెర్రరిస్టుల ఆత్మాహుతి బాంబులను నిర్వీర్యం చేసే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి అవార్డు అందుకున్నారు. నాలుగు అదనపు డిగ్రీలు చేసి పలు రంగాల్లో విశిష్ట సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు కూడా అందుకున్నారు. పాఠశాలలో తన ఏడేళ్ల కుమారుడు అబ్దుల్ అజీజ్‌కు ఎదురైన పరాభవాన్ని తట్టుకోలేక ఆయన అమెరికా విడిచి పోవాలని నిర్ణయించుకున్నారు. ఉత్తర కరోలినాలోని కెరీ నగరంలోని స్కూల్లో చదువుతున్న తన పిల్లవాడు అబ్దుల్‌ను తోటి పిల్లలు ఎలా వేధించారో జీసాన్ సామాజిక వెబ్సైట్ పేజ్బుక్లో వివరించారు. ముస్లిం అంటూ తోటి పిల్లలు ఎప్పుడు తన కుమారుడిని గేళి చేసేవారని, ఓ రోజున హలాల్ చేయని మాంసం తినమని ఒత్తిడి చేస్తే తినను అన్నందుకు బాగా కొట్టారని, చేయిని మెలితిప్పటంతో చేతికి బలమైన గాయం కూడా అయిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత స్కూల్ బస్కెక్కి ఇంటికి రావాలనుకుంటే బస్సులో నుంచి పిల్లలు బయటకు తోసి వేశారని, దాంతో చాలాదూరానున్న ఇంటికి తన కుమారుడు కాలినడకనే వచ్చాడని ఆయన తెలిపారు. ఆ నాటి నుంచి అమెరికాలో ఉండబుద్ధికాక పాకిస్థాన్ వచ్చానని ఆయన చెప్పారు. ఉద్యోగం రీత్యా తరచుగా అమెరికా నుంచి పాకిస్థాన్ వచ్చేవాడిని కనుక పాక్ వెళ్లడం కష్టం కాలేదని, లేకపోతే పాస్‌పోర్టే దొరికేది కాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘డొనాల్డ్ ట్రంప్ ఉన్న అమెరికాకు స్వాగతం’ అన్న వ్యాఖ్యతో ఆయన తన ఫేస్బుక్ పేజీని ముగించారు. ఒకప్పుడు అమెరికా ఇలా ఉండేది కాదని, ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, ముస్లింలంటే ద్వేషం బాగా పెరిగిపోయిందని, క్రిమినల్స్ అన్ని జాతుల్లో ఉంటారని, ఎవరో చేసిన నేరానికి అమాయక ముస్లిం ప్రజలను ఎందుకు ఏడిపిస్తారో అర్థం కావడం లేదని, ఇక అమెరికాలో ఉండలేమని తిరిగొచ్చేశామని పాకిస్థాన్ నుంచి హఫింగ్టన్ పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భార్య బినిష్ భగవాని వివరించారు. ప్రస్తుతం అమెరికాలో 33 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారిలో ఎక్కువ మందికి ఇలాంటి పరాభవాలే ఎదురవుతున్నాయనే విషయం అలీన్ ఖాన్ అనే 17 ఏళ్ల యువతి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రాసిన లేఖ వెల్లడిస్తోంది. ‘ముస్లింలను తన్ని తగిలేయండి. మిగిలిన వారిని క్యాంపుల్లో నిర్బంధించండి... ఉదారవాదులు, మంచి ముస్లింలు ఎప్పుడో మరణించారు...ముస్లింలకు మనకు మధ్య అడ్డుగోడలు కట్టండి లేదా ముస్లింల కోసం గ్యాస్ చాంబర్లు నిర్మించండి!....ఇలాంటి అన్లైన్ సందేశాలను చూసి తాను భయపడిపోయానని అలీన్, ఒబామాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఓ ప్రాజెక్ట్ విషయమై తాను ఆన్లైన్లో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు ఎదురయ్యాయని ఆమె తెలిపారు. తన తండ్రి పాకిస్థాన్ నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడ్డారని, భారత్-అమెరికాకు చెందిన మహిళను ఇక్కడే పెళ్లి చేసుకున్నారని, తాను వారికి అమెరికాలోనే పుట్టానని అలీనా తెలిపారు. తనకు ఇద్దరు అక్కలున్నారని, వాళ్లకు కూడా విద్వేష అనుభవాలు ఎదురయ్యాయనే విషయం ఆ తర్వాత తెల్సిందని ఆమె చెప్పారు. తాను జర్మన్ నగరంలో చదువుకున్నానని, ఇక్కడ వాషింగ్టన్ యూనివర్శిటీలో చేరబోతున్నానని, ముందు జీవితం ఎలా ఉంటుందో అర్థం కావడం లేదని ఆమె వాపోయారు. ఇంతకుముందు ఎన్నడూ ముస్లిం మహిళ అన్న కారణంగా ఎప్పుడూ చిన్నచూపుకు గురికాలేదని ఆమె చెప్పారు. ఆమె లేఖను ఒబామా చదివారో, లేదోగానీ ఆయన నుంచి మాత్రం ఆమెకు ఎలాంటి సమాధానం రాలేదు. అమెరికాలో నివసిస్తున్న ముస్లింలకు వ్యతిరేకంగా హింసాత్మక దాడులు ఇటీవలికాలంలో చాలా పెరిగాయి. గతంతో పోలిస్తే ఒక్క 2015 సంవత్సరంలోనే ముస్లింలపై 80 శాతం దాడులు పెరిగాయి. నిజం చెప్పాలంటే అమెరికన్లకు ముస్లిం మతం గురించిగానీ, వారి సంస్కృతి గురించిగానీ పెద్దగా ఎవరికి తెలియదు. కొద్దిగా తెలిసిన వారు 57 శాతంకాగా అసలు ఏమీ తెలియనివారు 26 శాతం మందని అమెరికాలోని ‘పబ్లిక్ రిలీజియన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ గతంలో ఓ నివేదికలో పేర్కొంది. -
'ముస్లిం మహిళలకు మేం వడ్డించం'
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ శివార్లలో ఉన్న ఓ రెస్టారెంటు ఇద్దరు ముస్లిం మహిళలకు వడ్డించకపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఆగ్రహావేశాలు వెల్లువెత్తి నిరసనలకు దారితీసింది. ''ఉగ్రవాదులు ముస్లింలు, ముస్లింలంతా ఉగ్రవాదులు'' అని బురఖాలలో వచ్చిన ఇద్దరు మహిళలకు చెబుతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రెంబ్లే ప్రాంతంలోని లీ సెనాకిల్ రెస్టారెంటులో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో తమ రెస్టారెంటు ముందు గుమిగూడిన వారికి రెస్టారెంటు క్షమాపణలు తెలిపింది. ప్రస్తుతం వివిధ దేశాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే తాను కూడా ఆందోళన చెందానని, ఫ్రెంచి బీచ్‌లలో బుర్కినీలు వేసుకున్న మహిళల గురించి జరుగుతున్న వివాదాలు కూడా అందుకు కారణమని రెస్టారెంటు యజమాని చెప్పారు. గత నవంబర్‌లో బాటాక్లాన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఉగ్రదాడిలో తన స్నేహితుడు ఒకరు మరణించారని, దాని ప్రభావం కూడా తనపై ఉందని తెలిపారు. జాతి వివక్ష ఉన్న వ్యక్తులు పెడితే తాము తినబోమని ఆ మహిళల్లో ఒకరు చెప్పగా, జాతివివక్ష ఉన్నవాళ్లు ప్రజలను చంపరని రెస్టారెంటు యజమాని వారికి సమాధానం ఇచ్చారు. అయితే, ఇలాంటి వివాదాలను తాము సహించబోమని, దీనిపై విచారణకు ఆదేశించామని ఫ్రెంచి మంత్రి లారెన్స్ రోసిగ్నాల్ చెప్పారు. -
ట్రంప్‌పై విరుచుకుపడ్డ స్టార్ హీరో
దుబాయ్: అమెరికా అధ్యక్ష పదవికోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ విరుచుకుపడ్డారు. ముస్లింలకు వ్యతిరేకంగా ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికన్లలో ఇస్లామోఫోబియాలపై మండిపడ్డారు. తన తాజా సినిమా 'సూసైడ్ స్క్వాడ్' ప్రమోషన్ లో భాగంగా దుబాయ్ వచ్చిన విల్ స్మిత్ ట్రంప్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. 'ట్రంప్ మాటలు తీవ్రంగా బాధపెడతాయి. అమెరికన్లు ఆయన చెప్పే మాటలు వింటుండటం విభ్రాంతికరం. అయితే ట్రంప్ వ్యాఖ్యలు వినడం ద్వారా అవి ఎంత క్రూరంగా ఉంటయో తెలుసుకోవచ్చు. తద్వారా ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని ప్రజలు గ్రహిస్తారు. చెత్తవాడుగుగాళ్లని దేశం నుంచి ఊడ్చిపారేస్తారు'అని విల్ స్మిత్ అన్నారు. ప్రస్తుతం తాను దుబాయ్ (ఇస్లామిక్ దేశం)లో ఉన్నానని, ఇక్కడ తన సినిమాలను ప్రదర్శిస్తున్నానని, సమయాన్ని ఆనందంగా గడుపుతున్నానని అంటే దీని అర్థం ముస్లింలు నన్ను ద్వేషిస్తున్నట్లా? అని వ్యంగ్యబాణాలు వేశారాయన. -
ముస్లిం మహిళను బస్సులోంచి తోసేశారు!
లండన్: ఇస్లామోఫోబియాతో లండన్‌లో విద్వేష నేరాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలికాలంలో యూరప్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్న ఘటనలు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. లండన్‌లో ఓ ముస్లిం మహిళపై సాటి మహిళలే దాడి చేసి బస్సులోంచి గెంటేశారు. తలచుట్టూ సంప్రదాయబద్ధమైన రుమాలు ధరించిన 40 ఏళ్ల ముస్లిం మహిళ బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల ఇద్దరు యువతులు ఆమెపై దాడి చేశారు. ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ ఆమెను బస్సు నుంచి బయటకు తోసేశారు. నిస్సహాయంగా పేవ్మెంట్ మీద పడిపోయిన బాధితురాలిపై జ్యాత్యాంహకార వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడారు. దక్షిణ లండన్‌లో అక్టోబర్ 28న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితురాళ్లను పోలీసులు తాజాగా గుర్తించారు. సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను ఇద్దరిని పోలీసులు గుర్తించారు. పరారీలో ఇద్దరు నిందితురాళ్లను పట్టుకునేందుకు లండన్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
'నేను కూడా పారిస్ దాడిని ఖండిస్తున్నా'
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో మరోసారి ఇస్లామోఫొబియా తెరపైకి వచ్చింది. పారిస్‌లో జరిగిన నరమేధంలో 127 మంది చనిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ.. బాధితులకు మద్దతు ప్రకటిస్తూ సోషల్ నెట్వర్కింగ్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కొందరు వ్యక్తులు మాత్రం ఈ దాడులకు ఇస్లాం మతం, ముస్లిం కమ్యూనిటీయే కారణమన్నట్టు విపరీత వ్యాఖ్యలు చేశారు. కొందరు ముష్కరులు చేసిన దాడిని.. మొత్తం ముస్లింలకు ఆపాదించే ప్రయత్నం చేశారు. ముస్లింలు అంటే భయపడేలా ఇస్లామోఫోబియాతో చేస్తున్న దాడిని నెటిజన్లు దీటుగా తిప్పికొట్టారు. ముస్లింలు కూడా పారిస్ దాడులను ఖండిస్తున్నారని పేర్కొంటూ.. ట్విట్టర్లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. 'నేను ముస్లింను.. పారిస్ దాడులను ఖండిస్తున్నా. మొత్తం 150 కోట్లమంది ముస్లింలు కూడా ఖండిస్తున్నారు' అంటూ పెద్దసంఖ్యలో నెటిజన్లు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అమాయకుల ప్రాణాలు బలిగొనడం ఇస్లాం మత సిద్ధాంతాలకు వ్యతిరేకమని, పారిస్ దాడులను తాము ఖండిస్తున్నామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ముస్లింలు సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. I am a #Muslim. I condemn the #ParisAttack. Over 1.5 billion Muslims do. Please remember this. #paris #parisattacks pic.twitter.com/0O0H6yRbqY — Ulviyye Heydarova (@UlviyyeH) November 14, 2015