ముళ్లపొదల్లో చిన్నారి
నంద్యాల టౌన్ : తల్లిదండ్రులు చెత్తకుప్ప పాలు చేసిన ఓ చిన్నారిని మానవతామూర్తి అక్కున చేర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ ఆగ్నేష్ ఏంజల్ పాపను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజుల తర్వాత ఆమెను కర్నూలులోని శిశువిహార్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇస్మాయిల్, అధికారులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. ఆడ పిల్ల అనో.. మరే ఇతర కారణాలతోనో మూడు రోజుల వయస్సు చిన్నారిని కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో బొమ్మలసత్రం వద్దనున్న కుందూ నది ఒడ్డున ముళ్లకంప మధ్య వదిలేశారు.
బహిర్భూమికి వెళ్లిన మూలసాగరం వాసి ఇస్మాయిల్ చిన్నారి ఏడుపు వినిపిస్తుండటంతో అటువైపుగా వెళ్లి అక్కున చేర్చుకున్నాడు. ఆ సమయంలో కుక్కలు గుమికూడి ఉండటంతో వాటిని తరిమేశాడు. పాపను ఇంటికి తీసుకెళ్లగా కుటుంబ సభ్యులు స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించి అందంగా ముస్తాబు చేశారు. ఆ తర్వాత విషయాన్ని అంగన్వాడీ కార్యకర్త సుశీలకు తెలియజేశారు. ఆమె సమాచారంతో ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ ఆగ్నేష్ ఏంజల్ అక్కడికి చేరుకున్నారు.
అయితే కొన్ని గంటల పాటు తమ వద్దే ఉంచుకున్న ఇస్మాయిల్ కుటుంబం పాపను విడిచిపెట్టలేక దత్తత తీసుకుంటామని సీడీపీఓను కోరగా అందుకామె నిరాకరించారు. దీంతో వారు ఆమెతో వాగ్వాదానికి దిగారు. విధిలేని పరిస్థితుల్లో సీడీపీఓ.. త్రీటౌన్ పోలీసుస్టేషన్లో సీఐ దైవప్రసాద్‌కు ఫిర్యాదు చేసి పోలీసుల సహాయంతో చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాపకు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా వైద్యురాలు లలిత పరీక్షించారు. నెలలు నిండక మునుపే జన్మించడంతో బరువు తక్కువగా ఉందని.. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆమె తెలిపారు.
రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి కర్నూలులోని శిశువిహార్‌కు తరలిస్తామని సీడీపీఓ వెల్లడించారు. తల్లిదండ్రులకు పిల్లలు భారమైతే ఇలా పారేయకుండా సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లో అప్పగించాలని.. వివరాలను సైతం గోప్యంగా ఉంచుతామన్నారు. చిన్నారిని కాపాడిన ఇస్మాయిల్‌ను ఆమె అభినందించారు.