ఎన్నికల వల
*కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు తొలిరోజు పర్యటన
*ఇల్లిల్లూ తిరిగి ఓటర్లను ఆకట్టుకునే యత్నం
సాక్షి, చిత్తూరు: ఓటర్లకు గాలం వేసే దిశగా చంద్రబాబునాయుడు తొలిరోజు పర్యటన సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆయన విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ సభల్లో పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం విచ్చేశారు. ఉదయం సిద్దావూరు, శాంతిపురం, వెంకటేపల్లె, బోయనపల్లె, రామకుప్పంలో విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.
ఎన్ని జన్మలు ఎత్తినా కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనని, మళ్లీ ఈ సారి అత్యధిక మెజారిటీతో తనను దీవించాలని పదేపదే ఓటర్లను ప్రాధేయపడ్డారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చోటు లేకుండా చూడాలని ఉపన్యాసంలో తరచూ అభ్యర్థించారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి సమస్య, ఇజ్రాయిల్ ప్రాజెక్ట్, 2కేఆర్ ప్రాజెక్ట్ గురించి అన్ని చోట్లా ప్రస్తావించారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, ఇది ప్రమాదమకరమైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. అలాగే కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రికి సవాల్
ముఖ్యమంత్రికి దమ్ముంటే కుప్పంలో తీవ్రంగా ఉన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించి రచ్చబండ నిర్వహించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. కృష్ణగిరి, పలమనేరు రహదారులను తాను జాతీయ రహదారులుగా మార్చితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. మాట్లాడిన ప్రతి సభలోనూ రేపోమాపో జగన్ ఇక్కడకు వస్తాడు, మీరు అతని మాటలు నమ్మవద్దు, అలాంటి వారిని రానివ్వదు అంటూ ప్రజలను అభ్యర్థించారు. నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారమయ్యే వరకు కుప్పం ఎమ్మెల్యేగా తాను పోరాడతానని, అవసరమైతే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు.
బోయనపల్లెలో ఎక్కువ సమ యం కేటాయించి సామాన్య కార్యకర్తలాగా ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు 21వ తేదీ తిరుపతి సభకు జనసమీకరణ పనుల్లో నేతలు నిమగ్నమయ్యారు. దీంతో బాబు తొలిరోజు పర్యటనలో నేత లు, కార్యకర్తలు, ప్రజల సందడి తక్కువగా కనిపించింది. శాంతిపురం సభ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడడంతో పెద్దగా జనం కనిపించలేదు. అలాగే బాబు తన ప్రసంగంలో ఎక్కువసార్లు ఎన్నికల ప్రచారాన్ని గుర్తు చేస్తూ పరోక్షంగా ఓట్లు అభ్యర్థించడం కనిపించింది.
గతంలో తనను 40 వేలు, 60 వేలు, 70 వేల మెజారిటీ ఓట్లతో గెలిపించారని, ఈ సారి అంతకన్నా ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని ప్రజల ను అభ్యర్థించారు. శాంతిపురంలో స్థానికంగా ఉన్న రోడ్ల సమస్యలను ప్రస్తావించారు. రామకుప్పంలో ఏవైనా సమస్యలున్నాయని అని అడిగి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. వారు అడిగిన ఆర్టీసీ బస్సులు, ఇతర సమస్యలను పరిష్కరిస్తానని, రేపే అధికారులతో మాట్లాడతానని పేర్కొనడం గమనార్హం. సుమారు పదిహేను నెలల తర్వాత కుప్పం నియోజకవర్గానికి వచ్చిన చంద్రబాబు ఆ ప్రభావం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.
తాను ఆరు నెలలకోసారి రావాలనుకున్నా ఈసారి జాప్యం జరిగిందని ముందే పే ర్కొంటూ ఉపన్యాసం ప్రారంభించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కుప్పం వస్తానని, ఎన్నికలు జరిగిన తర్వాత సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానని వాగ్దానంచేశారు. ఆయా గ్రామాల్లో స్థానిక కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ రానున్న ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, పార్టీ గెలిపించాలని వారికి వ్యక్తిగతంగా హితబోధ చేయడం గమనార్హం.
చంద్రబాబు నేరుగా చెప్పకనే చెబుతూ కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మొత్తం మీద బాబు పర్యటన వాహనాల సంఖ్య ఎక్కువ, కార్యకర్తల హడావుడి తక్కువ అన్నట్లు సాగింది. శాంతిపురం వద్ద ఖాళీ బిందెలతో మహిళలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. నీటి కోసం తాము పడుతున్న అగచాట్లు వివరించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.