israel tour
-
ఇజ్రాయెల్–పాలస్తీనా శాంతికి కృషి
బెత్లెహం: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో శుక్రవారం పర్యటించారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలస్తీనాతో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నామని, తగిన ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య శాంతి యత్నాలకు ఇంకా కార్యక్షేత్రం సిద్ధం కాలేదని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య దశాబ్దం క్రితమే సంబంధాలు తెగిపోయాయి. ఇజ్రాయెల్‌లో రాజకీయ అస్థిరత, పాలస్తీనాలో బలహీన నాయకత్వం వల్ల శాంతి చర్చల ప్రక్రియ సాగడం లేదు. లక్షలాది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ పాలన కింద మగ్గిపోతున్నారు. సొంత సార్వభౌమత్వ, స్వతంత్ర దేశాన్ని పొందే అర్హత రెండు దేశాల ప్రజలకు ఉందని బైడెన్ ఉద్ఘాటించారు. రెండు వర్గాల ప్రజలకు రెండు దేశాలని వ్యాఖ్యానించారు. ఇరు వర్గాల మూలాలు ఇక్కడి ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచే ఉన్నాయని, పక్కపక్కనే శాంతియుతంగా, భద్రతతో కలిసిమెలిసి జీవించారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి మళ్లీ రావాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్–పాలస్తీనా నడుమ శాంతి ప్రక్రియ ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు బైడెన్ చెప్పారు. శాంతి ప్రయత్నాలకు కార్యక్షేత్రం ఇంకా సిద్ధం కానప్పటికీ రెండు దేశాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తామన్నారు. పాలస్తీనాకు 300 మిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాయాన్ని బైడెన్ ప్రకటించారు. వెస్ట్‌బ్యాంక్, గాజాలో ఇజ్రాయెల్ కాలనీల విస్తరణపై స్పందించలేదు. -
అమెరికా అధ్యక్షులకే దక్కలేదు
మోదీకి అసాధారణ స్వాగతంపై భారతీయుల హర్షాతిరేకాలు టెలీఅవీవ్: తొలిసారిగా ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అసాధారణరీతిలో స్వాగతం లభించడం ఇక్కడి భారతీయులను ఆనందపరవశులను చేసింది. చివరికి అమెరికా అధ్యక్షులకు సైతం ఇటువంటి గౌరవం దక్కలేదని వారు అంటున్నారు. భారత సంతతికి చెందిన నాలుగు రకాల తెగలవారు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. వీరి సంఖ్య ఎనిమిది లక్షలదాకా ఉంది. వీరిలో కొంతమంది ముంబైకి చెందిన బెనీ తెగవారు కాగా మరికొందరు కేరళలోని కొచిన్‌కు చెందినవారు. ఇంకా మణిపూర్, మిజోరాంలకు చెందిన బినై మెనషే తెగవారు ఉన్నారు. ఈ విషయమై ఇక్కడ డ్రైవర్‌గా స్థిరపడిన భారత్‌కు చెందిన డేవిడ్ నగని మాట్లాడుతూ ‘16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇక్కడికి వలసవచ్చా. అయితే భారత్‌తో దౌత్యసంబంధాలు లేవని తెలియగానే అప్పట్లో ఎంతో బాధ కలిగింది. అందువల్ల వచ్చే ఇబ్బందులేమిటనే విషయం నాకు అప్పట్లో అంతగా అర్థం కాలేదు. అయితే ఇక్కడ యూదులకు ఎంత గౌరవం లభిస్తుందో అదేస్థాయిలో భారతీయులు కూడా పొందుతారు.ఇజ్రాయెల్ ప్రభుత్వం మన ప్రధానికి ఇచ్చిన గౌరవం నాకు ఎంతో ఆనందం కలిగించింది’ అని చెప్పారు. -
భారతీయ యూదుల్లో ‘మోదీ’ ఆనందం
జెరూసలెం: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా అక్కడి భారతీయ యూదుల్లో ఆనందం వెల్లి వెరిసింది. ఓ భారత ప్రధాన మంత్రి ఇజ్రాయెల్ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి కనుక వారికా ఆనందం. పుట్టిన భారత దేశాన్ని దాదాపు మరచిపోతున్న సమయంలో నరేంద్ర మోదీ రూపంలో ప్రధాన మంత్రి రావడం పుట్టింటి నుంచి ఆత్మీయులు వచ్చిన ఆనందం వారిది. దాదాపు మూడువేల సంవత్సరాల క్రితమే భారత్‌కు వచ్చి స్థిరపడిన యూదులు 1940, 1950 దశకాల్లో ఇజ్రాయెల్‌కు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. యూదులు భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి మతపరమైన కారణాలేకుండా, ఆర్థిక, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. 1948లో ఇజ్రాయెల్‌కు స్వాతంత్య్రం రావడంతో ఇక తమ దేశం ఇజ్రాయెల్గా భావించి వారు అక్కడికెళ్లి స్థిరపడ్డారు. దేశంలో స్థిరపడిన భారతీయ యూదులు లక్షకు మించి ఉండరని, వారిని చరిత్రలో నిక్షిప్తం చేసిన ప్రముఖ చరిత్రకారుడు ఎలియాజ్ దండేకర్ చెబుతున్నారు. ఆయన వారని ‘అదశ్య యూదులు’గా పేర్కొన్నారు. కారణం వారు భారతీయ మూలాలను చెరిపేసేందుకు చివరి పేర్లను ఇజ్రాయెల్‌కు అనుకూలంగా మార్చుకున్నారని ఆయన తెలిపారు. వైద్యం, సైనిక రంగాల్లో చేరిన భారతీయ యూదులే ఎక్కువగా తమ భారతీయతను చెరిపేసుకున్నారని ఆయన చెప్పారు. రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాల్లో చేరివారు భారతీయ సంస్కతి, సంప్రదాయాలను పూర్తిగా విస్మరించలేదు. అలాంటి వారిలో రమ్లా నగరంలోని ‘మహారాజా రెస్టారెంట్’ యజమాని ఎలాజ్ అస్తీవ్కర్ ఒకరు. ఆయన చాలాకాలంపాటు తన హోటల్లో భారతీయ వంటకాలనే ఎక్కువ కాలం సర్వ్ చేశారు. ఇప్పుడు భారతీయ వంటకాలతోపాటు స్థానిక వంటకాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. భారతీయ మసాలాలతోపాటు విదేశీ మసాలలు ఆయన రెస్టారెంట్లో అందుబాటులో ఉంటాయి. నరేంద్ర మోదీ రాక సందర్భంగా ఆయన తన హోటల్ ముందు భారతీయులకు సుస్వాగతం అంటూ ఓ బోర్డును కూడా వేలాడతీశారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డారట. ఆ రెస్టారెంట్లో భారతీయ సంస్కతిని తెలియజేసే చిత్రాలు ఇప్పటికీ గోడలపై కనిపిస్తాయి. మహారాజా రెస్టారెంట్‌కు సమీపంలోనే షావుల్ దివేకర్ మసాలాల దుకాణం ఉంది. ఆయన చిన్నప్పటి భారత్ నుంచి వచ్చి స్థిరపడ్డాడట. ఆయన ఈ రోజు సాయంత్రం జరుగనున్న నరేంద్ర మోదీ, నెతన్యాహు సభకు నాలుగు బస్సుల్లో భారతీయులను తీసుకెళ్లారు. నాలుగు బస్సులను తానే ఇంచార్జినంటూ ఆయన అంతకు ముందు మీడియా ముందు గర్వంగా చెప్పుకున్నారు. ఈరోజు నగరంలో ఎక్కడా ఒక్క భారతీయుడు కనిపించరని, అందరూ మోదీ సభకు వెళ్లారంటూ నవ్వుతూ చెప్పారు. -
మోదీ వ్యూహాత్మక అడుగు
పొరుగు దేశంతో మాత్రమే కాదు... సుదూర దేశాలతో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవాలన్నా ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని కోణా ల్లోనూ విశ్లేషించుకోవాలి. మంగళవారం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జరపబోయే మూడురోజుల ఇజ్రాయెల్ పర్యటన విషయంలో ఈ కసరత్తంతా జరిగిందనుకోవాలి. అరబ్బు దేశాలపై, మరీ ముఖ్యంగా పాలస్తీనాపై ఈ పర్యటన ప్రభావం ఎలా ఉంటుందన్న అనుమానాలు పలువురిలో ఉన్నాయి. పైగా పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్, గాజాస్ట్రిప్లు దురాక్రమణకు గురై అర్ధ శతాబ్ది కావస్తున్న తరుణంలో మోదీ ఇజ్రాయెల్ సందర్శనకు వెళ్తే అది ఎలాంటి అభిప్రాయాన్ని కలగజేస్తుందని ప్రశ్నించినవారూ ఉన్నారు. మరోపక్క ఈ పర్యటనకు ఇజ్రాయెల్ ఇస్తున్న ప్రాము ఖ్యత అంతా ఇంతా కాదు. మోదీ రాకను స్వాగతిస్తూ గతవారం అక్కడి కేబినెట్ ప్రత్యేక తీర్మానం ఆమోదించింది. భారత్ ప్రధానిని పర్యటనకు రప్పించడం తన దౌత్య విజయంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ భావించడమే ఇందుకు కారణం. ఇరు దేశాల మధ్యా జరగబోయే ద్వైపాక్షిక చర్చల సందర్భంగా వర్తక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులతోపాటు పర్యాటకం, పరిశోధన, రక్షణ, ఉన్నత విద్య, వ్యవసాయం, జల సంరక్షణ వగైరా అంశాల్లో పలు ఒప్పందాలు కుదరబోతు న్నాయి. ఇప్పుడున్న వాణిజ్యాన్ని వచ్చే అయిదేళ్లలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల న్నది ఇరు దేశాల లక్ష్యం. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే మోదీ ఇజ్రాయెల్ పర్య టించి ఆ దేశమంటే తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. భారత్–ఇజ్రాయెల్ సంబంధాలు విలక్షణమైనవి. 1947లో ఇజ్రాయెల్ ఏర్పా టును, 1949లో దానికి ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఇవ్వడాన్ని మన దేశం గట్టిగా వ్యతిరేకించింది. అయితే 1950 నాటికి మన దేశ వైఖరి మారింది. ఆ దేశాన్ని గుర్తించడమే కాక కాన్సులేట్ ఏర్పాటుకు కూడా అంగీకరించింది. అయినా పాల స్తీనా అనుకూల, అరబ్బు అనుకూల విధానాన్ని మన దేశం విడనాడలేదు. అంత మాత్రాన ఇజ్రాయెల్ ఆశ వదులుకోలేదు. ఎప్పటికైనా భారత్ ధోరణి మారి తీరు తుందన్న ఆశాభావంతోనే ఉంది. ఓపిగ్గా ఎదురుచూసింది. ఈ సంబంధాల్లో ఏ మార్పూ రాకపోయినా 1962 చైనా యుద్ధం సమయంలో... ఆ తర్వాత 1965, 1971ల్లో పాకిస్తాన్‌తో వచ్చిన యుద్ధాల్లో అది మనకు సైనిక పరంగా సహాయ సహకారాలు అందించింది. కార్గిల్ ఘర్షణల్లోనూ ఇజ్రాయెల్ సాయం ఎన్నదగినది. అదంతా లోపాయికారీగానే సాగింది. అయితే పీవీ నరసింహారావు హయాంలో ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యాక అంతర్జాతీయంగా అనుసరిస్తూ వస్తున్న విధా నాలు కూడా మారాయి. పర్యవసానంగా 1992లో ఇజ్రాయెల్‌తో పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. మరో అయిదేళ్లకు ఆ దేశ అధ్యక్షుడు ఎజర్ వీజ్మాన్ మన దేశం వచ్చారు. పోఖ్రాన్లో అణు పరీక్ష నిర్వహించినప్పుడు దాన్ని ఖండించని అతి తక్కువ దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఉంది. అయినా పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసిన ప్రతి సందర్భంలోనూ మన దేశం గట్టిగా వ్యతిరేకించింది. అంతర్జాతీయ వేదికల్లో ఆ దేశాన్ని అభిశంసించే తీర్మానాలకు మద్దతు పలికింది. వాజపేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇదంతా మారింది. ఘర్షణలు తలెత్తిన సందర్భాల్లో సంయమనం పాటించాలని, హింసా త్మక చర్యలకు దిగవద్దని ‘ఇరు పక్షాలకూ’ హితవు చెప్పే విధానం మొదలైంది. మొట్టమొదటిసారిగా 2000లో ఆనాటి విదేశాంగ మంత్రి జశ్వంత్‌సింగ్ తొలిసారి ఇజ్రాయెల్‌లో పర్యటించారు. రెండు దేశాల మధ్యా ఉగ్రవాద వ్యతిరేక ఉమ్మడి కమిషన్ ఏర్పాటైంది. రెండేళ్లనాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆ దేశం వెళ్లారు. కానీ కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న ప్రధాని పర్యటిస్తేనే ఇరు దేశాల సంబం ధాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుందని ఇజ్రాయెల్ భావిస్తూ వచ్చింది. మోదీ పర్యటన రూపంలో ఇన్నాళ్లకు దాని ఆశ ఈడేరుతోంది. ఇటీవలికాలంలో పశ్చిమాసియాలోనే ఊహించని పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. ఒకప్పుడు ఇజ్రాయెల్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన సౌదీ అరేబియా ప్రస్తుతం ఆ దేశంతో చెలిమి కోసం ఉత్సాహపడుతోంది. ఇజ్రాయెల్ దక్షిణాఫ్రికా మీదుగా రహస్యంగా పంపిన గూఢచార ద్రోన్లతోనే పర్షియన్ జలసంధిలో ఇరాన్ యుద్ధ నౌకల కదలికలపై, యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదార్ల స్థావరాలపై సౌదీ నిఘా పెట్టింది. అరబ్బు దేశాలకు ఇప్పుడు ఇజ్రాయెల్ కన్నా ఇరాన్ పెద్ద శత్రు వైంది. మరోపక్క ఇరాన్‌తో భారత్‌కున్న సాన్నిహిత్యం సంగతి ఇజ్రాయెల్‌కు తెలి యందేమీ కాదు. నిరుడు మోదీ ఇరాన్ పర్యటించడం, ఇరు దేశాల నావికా దళాలూ సంయుక్త విన్యాసాలు జరపడం, ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఎన్ని కల్లో ఘన విజయం సాధించినప్పుడు మోదీ అభినందించడం వగైరాలు భారత్‌తో సంబంధాలకు అవరోధమవుతాయని ఇజ్రాయెల్ భావించడం లేదు. మన దేశం ఇజ్రాయెల్ నుంచి రక్షణ కొనుగోళ్లలో ముందుంది. మోదీ ప్రభుత్వం వచ్చాక శతఘ్ని విధ్వంసక క్షిపణులు, లాంచర్ల కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. క్షిప ణులు ప్రయోగించడానికి వీలయ్యే ద్రోన్లు, అవాక్స్ యుద్ధ విమానాలు వగైరాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇవన్నీ వందల కోట్ల విలువ చేసే ఒప్పందాలు. అసలు ఇరు దేశాల సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరా లన్నది ఇజ్రాయెల్ సంకల్పం. ఆర్ధిక, రాజకీయ, రక్షణ, సాంకేతిక రంగాల్లో సహ కారంతోపాటు ఇరు దేశాల ప్రజానీకం మధ్యా సన్నిహిత సంబంధాలు ఏర్పడేం దుకు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం దోహదపడుతుందన్నది నిజమే అయినా అది ఇరాన్‌తో మనకున్న సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. గతంలో ఇజ్రాయెల్ పర్యటించినప్పుడల్లా మన నేతలు అంతకు ముందో, తర్వాతో పాలస్తీనా వెళ్లి వచ్చేవారు. ఈసారి మోదీ అందుకు భిన్నంగా ప్రత్యేకించి ఇజ్రాయెల్ పర్యటనకే వెళ్తున్నారు. ఇది ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో, పశ్చిమాసియా దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.