భారతీయ యూదుల్లో ‘మోదీ’ ఆనందం
జెరూసలెం: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా అక్కడి భారతీయ యూదుల్లో ఆనందం వెల్లి వెరిసింది. ఓ భారత ప్రధాన మంత్రి ఇజ్రాయెల్ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి కనుక వారికా ఆనందం. పుట్టిన భారత దేశాన్ని దాదాపు మరచిపోతున్న సమయంలో నరేంద్ర మోదీ రూపంలో ప్రధాన మంత్రి రావడం పుట్టింటి నుంచి ఆత్మీయులు వచ్చిన ఆనందం వారిది. దాదాపు మూడువేల సంవత్సరాల క్రితమే భారత్‌కు వచ్చి స్థిరపడిన యూదులు 1940, 1950 దశకాల్లో ఇజ్రాయెల్‌కు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.
యూదులు భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి మతపరమైన కారణాలేకుండా, ఆర్థిక, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. 1948లో ఇజ్రాయెల్‌కు స్వాతంత్య్రం రావడంతో ఇక తమ దేశం ఇజ్రాయెల్‌గా భావించి వారు అక్కడికెళ్లి స్థిరపడ్డారు. దేశంలో స్థిరపడిన భారతీయ యూదులు లక్షకు మించి ఉండరని, వారిని చరిత్రలో నిక్షిప్తం చేసిన ప్రముఖ చరిత్రకారుడు ఎలియాజ్ దండేకర్ చెబుతున్నారు. ఆయన వారని ‘అదశ్య యూదులు’గా పేర్కొన్నారు. కారణం వారు భారతీయ మూలాలను చెరిపేసేందుకు చివరి పేర్లను ఇజ్రాయెల్‌కు అనుకూలంగా మార్చుకున్నారని ఆయన తెలిపారు. వైద్యం, సైనిక రంగాల్లో చేరిన భారతీయ యూదులే ఎక్కువగా తమ భారతీయతను చెరిపేసుకున్నారని ఆయన చెప్పారు.
రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాల్లో చేరివారు భారతీయ సంస్కతి, సంప్రదాయాలను పూర్తిగా విస్మరించలేదు. అలాంటి వారిలో రమ్లా నగరంలోని ‘మహారాజా రెస్టారెంట్’ యజమాని ఎలాజ్ అస్తీవ్‌కర్ ఒకరు. ఆయన చాలాకాలంపాటు తన హోటల్లో భారతీయ వంటకాలనే ఎక్కువ కాలం సర్వ్ చేశారు. ఇప్పుడు భారతీయ వంటకాలతోపాటు స్థానిక వంటకాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. భారతీయ మసాలాలతోపాటు విదేశీ మసాలలు ఆయన రెస్టారెంట్‌లో అందుబాటులో ఉంటాయి. నరేంద్ర మోదీ రాక సందర్భంగా ఆయన తన హోటల్ ముందు భారతీయులకు సుస్వాగతం అంటూ ఓ బోర్డును కూడా వేలాడతీశారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డారట. ఆ రెస్టారెంట్లో భారతీయ సంస్కతిని తెలియజేసే చిత్రాలు ఇప్పటికీ గోడలపై కనిపిస్తాయి.
మహారాజా రెస్టారెంట్‌కు సమీపంలోనే షావుల్ దివేకర్ మసాలాల దుకాణం ఉంది. ఆయన చిన్నప్పటి భారత్ నుంచి వచ్చి స్థిరపడ్డాడట. ఆయన ఈ రోజు సాయంత్రం జరుగనున్న నరేంద్ర మోదీ, నెతన్యాహు సభకు నాలుగు బస్సుల్లో భారతీయులను తీసుకెళ్లారు. నాలుగు బస్సులను తానే ఇంచార్జినంటూ ఆయన అంతకు ముందు మీడియా ముందు గర్వంగా చెప్పుకున్నారు. ఈరోజు నగరంలో ఎక్కడా ఒక్క భారతీయుడు కనిపించరని, అందరూ మోదీ సభకు వెళ్లారంటూ నవ్వుతూ చెప్పారు.